అమ్మమ్మ వారసత్వంతో.. చెంగావి ఆయుర్వేదం.!

by Daayi Srishailam |

ఆయుర్వేదంలో సాటిలేని ఎంట్రప్రెన్యూర్‌గా దూసుకెళ్తోంది

అమ్మమ్మ వారసత్వంతో.. చెంగావి ఆయుర్వేదం.!
X

దిశ, ఫీచర్స్: అమ్మమ్మ.. నాన్నమ్మల నుంచి నేర్చుకుంటే ఎంతో ఉంటుంది. మన జీవితం సాఫల్యం కావాలంటే వాళ్ల జీవితాన్ని స్టడీ చేస్తే చాలు. అంటే మూలాలు మరవొద్దన్నమాట. చిన్నప్పటి నుంచే ఊరు.. పొలాలు.. ఆవులు.. మూలికలు.. అమ్మమ్మ చెప్పిన ఇంటి చిట్కాలతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్న 22 ఏళ్ల జగతిరెడ్డి కృష్ణాపురం ఇవాళ ఆయుర్వేదంలో సాటిలేని ఎంట్రప్రెన్యూర్‌గా దూసుకెళ్తోంది.

అమ్మమ్మ మూలికా వైద్యం..

కర్నూలు సమీపంలోని కొడుమూరుకు చెందిన జగతి చిన్నప్పటి నుంచే ప్రకృతి.. సంప్రదాయాలకు దగ్గరగా పెరిగింది. వాళ్ల అమ్మమ్మ తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన మూలికల ఫార్ములాలు తయారు చేసేది. అలా ఆయుర్వేదం అనేదొకటి ఉంటుందని తనకు తెలియకముందే మొక్కలకుండే ఔషధగుణాలను తెలుసుకుంది జగతి. పచ్చని పొలాలు.. పక్షులు.. పశువుల మధ్య అందం గురించి నేర్చుకుంది. తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అమ్మమ్మ చేత్తోనే మూలికలు అందిస్తే తగ్గిపోయేవి. ఆ అనుభవాలు తనకు ఆయుర్వేదంతో సహజమైన అనుబంధాన్ని ఏర్పరిచాయి.

ఫ్యామిలీ బిజినెస్..

హైదరాబాద్‌కు వచ్చిన జగతి 2024లో "బీబీఏ ఇన్ అనలిటిక్స్" పూర్తిచేసింది. ప్రస్తుతం ఐఎస్‌బీ హైదరాబాద్‌లో "ఫ్యామిలీ బిజినెస్"లో మాస్టర్స్ చదువుతోంది. వారసత్వ జ్ఞానాన్ని ఫార్మల్ నాలెడ్జ్‌తో కలపాలని యూకేలోని "లెర్న్ కాన్యన్" నుంచి "ఆయుర్వేద స్కిన్ అండ్ హెయిర్‌కేర్ ఫార్ములేషన్స్‌"లో డిప్లొమా సాధించింది. ఇది సంప్రదాయ ఆయుర్వేదాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి సహాయపడింది. అదే సమయంలో వాళ్ల నాన్నకు సంబంధించిన వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొని నిర్ణయాలు ఎలా తీసుకోవాలి.? మేనేజ్మెంట్ నైపుణ్యాలు నేర్చుకుంది.

చెంగావి లాంచ్..

జగతి వాళ్ల నాన్న సురేష్ కుమార్ రెడ్డి కృష్ణాపురం "స్కంధాంశి గ్రూప్" చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్. స్కంధాంశి అనుభవం ఆయుర్వేదంపై జగతికున్న వ్యక్తిగత ఆసక్తి వ్యాపారపరంగా ఎంతవరకు పనికొస్తుందనే విషయాన్ని ప్రాక్టికల్ అనుభవాన్ని ఏర్పరిచింది. అలా జగతి "చెంగావి" అనే బ్యూటీ బ్రాండ్‌తో ఆయుర్వేద వ్యాపారాన్ని ప్రారంభించింది. భారతీయ పురాతన వెల్‌నెస్ విధానాలకున్న నిజాయితీని సైన్స్‌తో అనుసంధానం చేస్తే ప్రపంచంలోని ఉత్తమంగా ప్రొడక్ట్ అందిస్తామనే ధీమా తనకుంది. ఆ ధైర్యంతోనే డాక్టర్ విష్ణు ప్రశాంత్ వినుకొండతో కలిసి చెంగావిని లాంఛనంగా లాంచ్ చేసింది.

250 ఏళ్ల వారసత్వం..

చెంగావిని అధికారికంగా ఇటీవల లాంచ్ చేసినప్పటికీ నాలుగేళ్ల క్రితమే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది. సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక హై-పెర్ఫార్మెన్స్ ఫార్ములాలుగా మార్చడమే ఈ బ్రాండ్ లక్ష్యం. కో ఫౌండర్ డాక్టర్ విష్ణు ప్రశాంత్ వినుకొండ నేపథ్యం కూడా ఆయుర్వేదమే. తనకు బయోటెక్నాలజిస్ట్‌గా 15 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు 250 ఏళ్ల ఫ్యామిలీ ఆయుర్వేద వారసత్వం వాళ్లది. చాలా బ్రాండ్‌లు ఆయుర్వేదాన్ని థీమ్‌గా వాడతాయి. కానీ చెంగావికి అదే పునాది. ప్రతి ప్రొడక్ట్ శాస్త్రీయ ద్రవ్య సిద్ధాంత సూత్రాలతో మొదలవుతుంది.

అంతర్జాతీయ ప్రమాణాలు..

మూలాలతో మమేకమై ఉంటూనే క్రమంగా తన బ్రాండ్‌ను మెరుగుపరచుకోవాలని యూకే నుంచి ఆయుర్వేద స్కిన్‌కేర్.. హెయిర్‌కేర్‌లో అంతర్జాతీయ సర్టిఫికేషన్ సాధించింది జగతి. అమెరికా.. సౌత్ కొరియా.. సింగపూర్‌లకు వెళ్లి గ్లోబల్ బ్యూటీ ఫెయిర్‌లు.. ఎక్స్‌పోల్లో పాల్గొని ఫార్ములేషన్.. ప్యాకేజింగ్.. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను నేర్చుకుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ స్కిన్‌కేర్.. హెయిర్‌కేర్.. బాత్ అండ్ బాడీ.. మెన్స్ కేర్‌లో 24 లగ్జరీ ప్రొడక్ట్‌లను అందిస్తోంది. హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నయ్.. కోల్‌కతా వంటి నగరాల్లో 27 బ్యూటీ అండ్ న్యూట్రీ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్ముతోంది.

Next Story