- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలో నాన్న
చిన్నప్పుడు.. తండ్రులు తమ కూతుళ్లను రాజకుమార్తెలా చూస్తారనే కథలు వినేదాన్ని. ముట్టుకుంటే కందిపోయే ముఖం.. ఏడెత్తుల మల్లెతో పోల్చే అందం.. పువ్వుల మీద నడిచే భోగం.. ఏది కావాలన్నా క్షణంలో తీసుకురావడం

దిశ, ఫీచర్స్ : చిన్నప్పుడు.. తండ్రులు తమ కూతుళ్లను రాజకుమార్తెలా చూస్తారనే కథలు వినేదాన్ని. ముట్టుకుంటే కందిపోయే ముఖం.. ఏడెత్తుల మల్లెతో పోల్చే అందం.. పువ్వుల మీద నడిచే భోగం.. ఏది కావాలన్నా క్షణంలో తీసుకురావడం.. ప్రతిచోట తనకు కాపలాగా మనుషులు.. తండ్రి తనను నిరంతరం రక్షించేవాడని వింటూ పెరిగా. ఈ కథలో తండ్రికి కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అనుకునేదాన్ని. కానీ పెరుగుతూ ఉంటే.. అసలు డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ కాన్సెప్ట్ ఈ సొసైటీలో వర్క్ చేస్తుందా అనిపించింది. నా తండ్రి నా మీద ఎంత ప్రేమ చూపినా.. తాను మాత్రం అలా ఉండకూడదు అనుకున్నా. నా తండ్రి నుంచి ప్రేమను మాత్రమే కాదు ఆయనలోని ధైర్యం, త్యాగం, కష్టపడే తత్వం, నిజాయితీ, పవర్ ఫుల్ నెస్ కూడా కావాలనుకున్నా. ఇదే నా తండ్రి నుంచి శాశ్వతంగా పొందే వారసత్వంగా భావించా. అంటే కూతురు కేవలం భావోద్వేగాలను మాత్రమే కాదు తండ్రి అలవాట్లు, ఎంపికల ద్వారా కూడా జీవితాన్ని ఎదుర్కోగలదు.
సినిమాల ప్రభావం
ఇండియన్ సినిమాలు, సీరియల్స్‌లో తండ్రి పాత్రను చాలా ప్రేమించే వ్యక్తిగా చూపిస్తారు లేదంటే బిడ్డను భారంగా భావించి.. చాలా కష్టపెట్టి, ఎలాగోలా పెళ్లి చేసి చేతులు దులుపుకునే వ్యక్తిగా ప్రజెంట్ చేస్తారు. ఈ ప్రభావం కారణంగా ఒకటి తండ్రిని మిస్టర్ పర్ఫెక్ట్‌గా చూస్తాం లేదా క్రూరుడిగా బావిస్తాం. కానీ మనం ఇక్కడ మరిచిపోయేదేంటి.. ఎవరూ పరిపూర్ణులు కాదు. మన తండ్రులు కూడా లోపాలు ఉన్న మానవులే. పెరిగే కొద్దీ మనం వారిని మనం కోరుకున్నట్టు కాకుండా.. వారు నిజంగా ఎలాంటి వారనే విషయాన్ని గుర్తిస్తాం. బాల్యం నుంచి యుక్తవయస్సు వరకు, యుక్తవయస్సు నుంచి పెద్దవయసు వరకు మనతో పాటు మన తండ్రులు కూడా పెరుగుతారు. ఈ క్రమంలో మనం వారు ప్రపంచాన్ని ఎలా చూస్తారో.. సమస్యలను ఎలా ఎదుర్కొంటారో.. భావాలను ఎలా ప్రాసెస్ చేస్తారో కూడా వారసత్వంగా పొందుతాం.
నాన్నలోని గుణాలు నాలో
నా తండ్రి తన ప్రొఫెషన్‌ను చాలా బాధ్యతగా తీసుకునేవాడు. రాత్రి సమయంలో కాల్ వచ్చినా వెళ్లేవాడు. ఆయనకు ఆయన ఉద్యోగం అంటే అంత నిబద్ధత. ఆ క్వాలిటీనే నేను తీసుకున్నా. వర్క్ హాలిక్ తండ్రి లాగే వర్క్ హాలిక్ కూతురుగా ఎదిగినా. చిన్నప్పుడు నాకో విషయం గుర్తుంది. మ్యాథ్స్ హోమ్ వర్క్ చేస్తున్నప్పుడు.. మధ్యలో మా అమ్మ భోజనానికి ఎన్నిసార్లు పిలిచినా వెళ్లలేదు. తిట్టినా కూడా లేవలేదు. ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే తిన్నా. అంటే అప్పటి నుంచే మా నాన్నలోని క్వాలిటీని అడాప్ట్ చేసుకున్నా. కారణం నేను ఓ ఫెయిరీటేల్‌లో బొమ్మలాగా ఉండాలని కోరుకోలేదు. నా నాన్నకు కూతురిగా ఎదగాలనుకున్నా. ఎందుకంటే రాజకుమార్తెలను ఎప్పుడూ రక్షించాల్సి ఉంటుంది.. కానీ కూతుళ్లను సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తారు. నిజానికి తండ్రి ధర్మం కూడా ఇదే.
నేను కొత్తగా ఏదైనా పని చేస్తానన్నా.. చెట్లు ఎక్కి ఆడుకుంటానన్నా.. రాత్రి షాపుకు వెళ్లి వస్తానన్నా.. ఒక్కదాన్నే టౌన్‌కు వెళ్లి వస్తానన్నా.. మా నాన్న ఆపేవాడు కాదు. కానీ ఇరుగు పొరుగు ఇండ్లలో ఉండే తండ్రులు కొందరు మాత్రం వాళ్ల పిల్లలను ఒంటరిగా పంపించేందుకు ఆలోచించేవారు. కానీ వాళ్లకు నాకు మధ్య తేడా ఇప్పుడు అర్థమవుతోంది. నాకు నాపై ఉన్న నమ్మకం. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా మంది స్నేహితుల్లో చూడలేదు. మొత్తానికి యుక్త వయసు వచ్చేసరికి నా తండ్రిలో చాలా గుణాలు నాకు వచ్చేశాయి. డెసిషన్ మేకింగ్, సత్యం, ధైర్యం, త్యాగం, కష్టపడే స్వభావం. కానీ నా తండ్రి మోసిన అనసవర భారాలను మాత్రం మోయకూడదని నిర్ణయించుకున్నా. ఆయన ఎక్కడైతే అనవసరంగా బాధలను అనుభవించాడో.. ఆ పాయింట్ దరిదాపులకు కూడా పోవద్దని అనుకున్నా.






