ORS Vs ORSL.. ఏది ఆరోగ్యం..? ఏది ప్రమాదకరం..?

by Javid Pasha |   (  Updated:2025-07-11 10:23:19  IST  )

ORS Vs ORSL.. ఏది ఆరోగ్యం..? ఏది ప్రమాదకరం..?

ORS Vs ORSL.. ఏది ఆరోగ్యం..? ఏది ప్రమాదకరం..?
X

దిశ,తెలంగాణ బ్యూరో : అనేక రకాల ఆహార పదార్థాల్లో కల్తీ జరగడాన్ని చూసాం. తప్పుడు ప్రకటనలు ఇస్తూ బిజినెస్ చేసే కంపెనీల బాగోతాలనూ చదివాం. కానీ ఇప్పుడు చదవబోయేది వీటన్నింటినీ తలదన్నే ఓ ప్రమాదకర ధోరణి. అనారోగ్య సమయంలో, అందునా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడే ఓ కంపెనీ అత్యాశ, అడ్డగోలు ధోరణిని ఓ మహిళా డాక్టర్ అడ్డుకుంటోంది. కొండ లాంటి పెద్ద కంపెనీని సింగిల్ గానే ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితి వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించాలంటే ప్రజల అప్రమత్తతే కీలకమని సూచిస్తున్నది.

ప్రపంచ ఆరోగ్యసంస్ధ డయేరియా లాంటి ప్రాణాంతక సమయాల్లో ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్‌ అనే ద్రావణాన్ని భారతదేశంలో అత్యవసర సమయాల్లో లక్షలాది మంది వినియోగిస్తుంటారు. ఇది విరేచనాల వల్ల కలిగే డీ ‌హైడ్రేషన్ కి కీలకమైన ఫార్ములా గా ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఒక్కరూ ఏదో ఒకసందర్భంలో వీటిని వాడి ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మార్కెట్లో అతి తక్కువ ధరకే లభించే ఈ ద్రావణం సులభంగా ఇంట్లోనే తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇక ఎలక్ట్రోలైట్ పానీయంగా మార్కెట్ లో ఉన్న ఓఆర్ఎస్ఎల్ అనే ప్యాక్ .. విటమిన్ సీ, సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉంటుందని, శక్తిని పునరుద్ధరిస్తుందని సదరు తయారీ కంపెనీ పేర్కొంది. కానీ విరేచనాల సమయంలో సిఫార్సు చేయబడే ఎలాంటి ఫార్ములా ఇందులో లేదు. ఎందుకంటే ఇది ‘ఆహారం’గా మాత్రమే వర్గీకరించిన ద్రావణం. కేవలం ఓ కూల్ డ్రింక్ లా అన్నమాట. ఇవి చూడటానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయి. కానీ అవి ఏదైనా వ్యాధి నివారణ, ఉపశమనం, చికిత్స లేదా నివారణ కోసం ఉద్దేశించబడినవి మాత్రం కావు.

అక్షరాల్లోనే అసలు గుట్టు..

ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ఎల్ చుట్టూ ఉన్న గందరగోళం వాటి పేరుని, వాడే విధానం, ప్యాకేజింగ్ నుంచి మొదలవుతోంది. ఓఆర్ఎస్ అనగానే అందరికీ అతిసార చికిత్స కోసం వాడే ద్రావణం అనే తెలుసు. ప్యాకింగ్ కారణంగా పొరపాటున ఓఆర్ఎస్ఎల్ అనే పెద్ద అక్షరాలను చూసి దాన్నే కొనుగోలు చేసే అవకాశం ఉంది. సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ విరేచనాల వల్ల కలిగే డీ‌హైడ్రేషన్ కి చికిత్స చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఆ సమయంలో పేషెంట్ కోల్పోయిన శరీర ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడానికి రూపొందించబడిన ఎలక్ట్రోలైట్‌లు, గ్లూకోజ్‌ల మిశ్రమం ఇది. పేషెంట్ పరిస్థితిని మరింత దిగజార్చకుండా రీహైడ్రేషన్‌కు అంటే తిరిగి శరీరంలో ద్రావణాలు పెరగడానికి 245 mmol/L ఓస్మోలారిటీ (ద్రావణం యొక్క కొలత) కలిగి ఉంటుంది.

దీనికి విరుద్ధంగా, ఓఆర్ఎస్ఎల్ పేరు దాదాపుగా ఓఆర్ఎస్ ని పోలి ఉన్నప్పటికీ, ఇది కేవలం ఎలక్ట్రోలైట్‌లతో పండ్ల రుచిగల పానీయాన్ని పోలి ఉంటుంది. విరేచనాల కారణంగా డీ ‌హైడ్రేషన్ చికిత్స చేయడానికి ఇది ఉద్దేశించబడలేదు. దీని ఓస్మోలారిటీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది (585 mmol/L). ఇలాంటి దాన్ని ప్రమాదకరమైన డయేరియా లాంటి సమయాల్లో వాడటం ప్రమాదకరం అని వైద్య నిపుణుల వాదన.

డాక్టర్ ఒంటరి పోరాటం..

హైదరాబాద్ కి చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని ఇదే అంశంపై చాలా కాలంగా పోరాడుతున్నారు. ఈ రెడీమేడ్ పానీయం అప్పటికే విరేచనాలతో బాధపడుతున్న రోగులకు హాని కలిగించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధులలో డీ ‌హైడ్రేషన్ కోసం తగిన చికిత్స కోసం ఈ ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ పానీయాలలో అధిక చక్కెర కంటెంట్ కారణంగా అవసరమైన లవణాలు తగినంతగా భర్తీ చేయబడకపోగా, విరేచనాలు మరింత తీవ్రం కావడం ప్రాణాంతక ఫలితాలకు దారితీస్తుంది. అధిక షుగర్ కలిగి ఉండటం వల్ల విరేచనాలు కొనసాగడం కూడా అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్ధితిని కల్పిస్తుందని డాక్టర్ శివరంజని వివరించారు. ‘స్కూల్ క్యాంటీన్లలో, చుట్టుపక్కల గల షాపుల్లో ఈ అధిక చక్కెర గల టెట్రా ప్యాక్‌లను అందుబాటులో ఉంచడం మంచిది కాదు’ అని ఆమె అంటున్నారు. భారతదేశంలోని పిల్లల మరణాలకు అతిసారం మూడవ ప్రధాన కారణంగా ఉందని, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి మరణాలలో 13 శాతం ఉందని డాక్టర్ శివరంజని పేర్కొంటూ పరిస్థితి తీవ్రతను వివరించారు.

లక్షలాది మంది పిల్లలక ప్రాణాలను రక్షించే ఔషధమైన ORS,మరణాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోందని .. ఈ ఉత్పత్తులను ORSగా తప్పుగా చూపించడాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ శివరంజని నాలుగు సంవత్సరాలుగా నిరంతర పోరాటం సాగిస్తోంది. ఆమె చురుకైన జోక్యం చట్టపరమైన మార్గాలకు చేరుకుంది. 2022లో, ఈ ఉత్పత్తుల మోసపూరిత మార్కెటింగ్‌ను సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి FSSAI,భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుంచి ప్రతిస్పందనలను కోరింది. ఏప్రిల్ 8,2022న, FSSAI ఆహార లేబుల్‌లపై లేదా ప్రకటనలలో ‘ORS’వంటి పదాల వాడకాన్ని పరిమితం చేస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. జూలై 14న, కంపెనీల రిట్ పిటిషన్‌ను అనుసరించి, ‘చెల్లుబాటు అయ్యే ట్రేడ్‌మార్క్‌లు కలిగిన ఈ కంపెనీలు పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌ల కంట్రోలర్ జనరల్ నిర్ణయం వచ్చే వరకు వాటి సంబంధిత ట్రేడ్‌మార్క్ పేర్లతో అటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి అనుమతించాలని నిర్ణయించబడింది’అని FSSAI.. డాక్టర్ శివరంజనికి తెలియజేసింది.

Next Story