Health : ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్.. ఎందుకు వస్తుంది..? ఏం చేయాలి?

by Javid Pasha |   (  Updated:2025-12-25 06:48:40  IST  )

Health : ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్.. ఎందుకు వస్తుంది..? ఏం చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : పొట్ట నొప్పి, కడుపులో ఉబ్బరం, గందరగోళంగా అనిపించడం, తిమ్మిరి, అలసట, శక్తిహీనంగా అనిపించడం, మలంలో రక్తం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే అనుమానించాల్సిందే. అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇవి ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) సంకేలు కావచ్చు. కొన్నిసార్లు జ్వరం కూడా వస్తూ ఉంటుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో ప్రతీ లక్ష మందిలో సుమారు 50–100 మందికి ఇది ఉన్నట్లు గుర్తించారు. నిజానికిది పేగులు అండ్ జీర్ణాశయంలో దీర్ఘకాలిక వాపు (ఇన్‌ఫ్లమేషన్) కలిగించే వ్యాధుల సమూహం. క్రోన్స్ డిసీజ్, అలాగే అల్సరేటివ్ కోలైటిస్ అనే రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది.

ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌ ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది.. కానీ ఇటీవలి దశాబ్దాల్లో భారతదేశంలో కూడా ఈ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ నివేదిక ప్రకారం.. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా ఉండటానికి జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం, ఒత్తిడి ప్రధాన కరణమని చెప్పవచ్చు.

ఎందుకు వస్తుంది?

ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) అనేది జన్యుపరమైన కారణాలు, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, పర్యావరణ కారకాలు, అలాగే పేగులోని బ్యాక్టీరియా (Gut Microbiome) అసాధారణ ప్రతిస్పందనల కలయిక వల్ల వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన ప్రేగు కణాలపై దాడి చేయడం వల్ల దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది. అంటే రోగనిరోధక వ్యవస్థ ప్రేగులలోని సాధారణ బ్యాక్టీరియాను హానికరమైనవిగా భావించి, వాటిని నిర్మూలించే క్రమంలో సొంత ప్రేగు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే కూడా వారసులకు వచ్చే అవకాశం.

లక్షణాలు

ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌ లక్షణాల విషయానికి వస్తే.. వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. తరచుగా డయేరియా వేధిస్తుంది. చాలా సందర్భాల్లో ఇది రక్తస్రావంతో కూడి ఉంటుంది. అలాగే పొట్ట నొప్పి, బరువు తగ్గడం, అలట, శక్తిహీనత, కొన్ని కొన్నిసార్లు జ్వరం, పిల్లల్లో అయితే శారీరక పెరుగుదలలో ఆలస్యం వంటివి కనిపిస్తాయి. హిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటివి ఉండవచ్చు.

నిర్ధారణ

ఇన్‌ఫ్లమేటరీ బవెల్(Inflammatory bowel disease) డిసీజ్‌ను కచ్చితంగా నిర్ధారించేందుకు వివిధ మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాపు, రక్తహీనత (Anemia) గుర్తించేందుకు రక్తపరీక్షలు అవసరం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఖరారు చేయడానికి, కాల్ ప్రొటెక్టివ్ వంటి మార్కర్లను చూడటానికి స్టూల్ టెస్ట్ ఉంటుంది. పేగుల అంతర్భాన్ని నేరుగా పరిశీలించేందుకు కొలొనోస్కోపీ అవసరం. పేగుల నుంచి శాంపిల్స్ తీసి పరిశీలించడానికి బయోప్సీ టెస్ట్ అవసరం. అలాగే అవసరాన్ని బట్టి సిటి స్కాన్ లేదా ఎంఆర్ఐ టెస్టులను కూడా రిఫర్ చేస్తారు.

నివారణ-చికిత్స

దీనికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి కాబట్టి ఐబీడీని పూర్తిగా నివారించలేం. కానీ రిస్క్ తగ్గించడానికి సిగరెట్ స్మోకింగ్ మానేయడం, NSAID మందులు (ఇబుప్రోఫెన్ వంటివి) అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడి నిర్వహణ కోసం మెడిటేషన్, ఎక్సర్‌సైజ్, థెరపీ వంటివి చేయాలి. పెద్ద మొత్తంలో ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ ఎక్కువసార్లు హెల్తీ మీల్స్ తినడం, ఆల్కహాల్, కెఫిన్, డైరీ, గ్రీజీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, వ్యాక్సినేషన్స్ తీసుకోవడం నివారణంలో భాగమని చెప్పవచ్చు. నివారణ ద్వారా తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ‌’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More..

Health : యూరిన్ రంగు మారుతోందా..? కిడ్నీలు డేంజర్లో ఉన్నట్టే !

Next Story