బడికి వేళాయె..! మదిని తడుముతున్న చిన్ననాటి జ్ఞాపకాలు

by Javid Pasha |   (  Updated:2026-06-14 14:20:08  IST  )

బడికిపోయే బాటలో, నీటి గుంతల్లో కాళ్లు తడుపుతూ ఆడుకునేవాళ్లం. ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టి మురిసిపోయేవాళ్లం.

బడికి వేళాయె..! మదిని తడుముతున్న చిన్ననాటి జ్ఞాపకాలు
X

దిశ, ఫీచర్స్ : భగ భగ మండే ఎండల నుంచి చల్లని ఉపశమనం లభించే సందర్భమే ఈ వర్ష రువుతు. జూన్ రాగానే వేసవి ప్రభావం సహజంగానే తగ్గుతుంది. నైరుతి రుతుపవనాల పలకరింపుతో వాతావరణం చల్లబడుతుంది. ఇక అప్పుడప్పుడూ కురిసినా, ఎడతెరిపి లేకుండా కురిసినా వాన జల్లుల పలకరింపులతో నేలతల్లి నవ్వుతుంది. మట్టి వాసనల పరిమళాలతో చేనూ చెలకలు పులకరించిపోతాయి. గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ ఇదంతా మరచిపోలేని వానజ్ఞాపకం. నాక్కూడా అంతే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్లం

వానకాలం రాకతో మనసులో గూడుకట్టుకున్న జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదులుతున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవుల తర్వాత ఇది స్కూళ్లు రీఓపెన్ అయ్యే సమయం. ఇప్పటి పిల్లల్లో కొందరు హాలిడేస్ ఇంకా కొన్నిరోజులు ఉంటే బాగుండు అనుకునేవారే ఎక్కువ. కానీ.. నా చిన్ననప్పుడు అలా కాదు. వేసవి సెలవులు ప్రారంభమైన పదీ పదిహేను రోజుల తర్వాత నుంచే, మళ్లీ స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో అని ఎదురు చూసేవాన్ని, నేనే కాదు 1990-96 ఆ సమయంలో ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు గ్రామాల్లో చదివే పిల్లలంతా దాదాపు ఇలా ఆలోచించేవారు. అప్పట్లో స్కూళ్లు, చదువు చెప్పే టీచర్లతో ఉండే అనుబంధం అలాంటిది. గ్రామాల్లో ప్రైవేట్ స్కూళ్లు చాలా తక్కువ. దాదాపు అందరూ ఊర్లోని గవర్నమెంట్ స్కూల్‌కే వెళ్లేవారు.

పుస్తకాల బస్తా.. గవర్నమెంట్ బడి

సమ్మర్ హాలిడేస్ సగం గడిచినప్పటి నుంచే మనసంతా స్కూలువైపే లాగేది. పొద్దున్న లేచి, రెడీ అయ్యి, అమ్మ చేసిన రొట్టెనో, అన్నమో తినేసి పుస్తకాల బస్తా సంకనేసుకొని బడికి బయలు దేరేవాన్ని నేనైతే. దారిమధ్యలో దోస్తులతో కలిసి అందరం కలిసి వెళ్లేవాళ్లం. అప్పట్లో ఇప్పటిలాగా పుస్తకాల బరువు ఉండేది కాదు. ఐదో తరగతికి వచ్చినా ఒక పలక, నాలు గుపుస్తకాలు, నాలుగో ఐదో నోట్ బుక్స్ ఉండేవి. ఇప్పటిలెక్క రంగు రంగుల బ్యాగులు ఉండేవి కాదు. ఇంట్లోని సంచులతోనే ఊర్లోని టైలర్ వద్ద స్కూల్ బ్యాగ్ కుట్టించుకునేది. అంటే దానిని బ్యాగు అనేకంటే బస్తా అనే పిలిచేవాళ్లం. అప్పట్లో అందరూ ఇలాగే పిలిచేవారు.

సైకిళ్ల మీద సారోల్లు..

కొన్నిసార్లు పొద్దున్న ఐదు గంటలకే నిద్రమేల్కొనేది. ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో, స్కూలుకి ఎప్పుడు వెళ్తామా అనే ఆత్రుత ఉండేది. పుస్తకాల బ్యాగులు భుజానికి తగిలించుకొని అందరం కలిసి మట్లాడుకుంటూ గంటో, అరగంటో ముందే స్కూల్‌కు వెళ్లేవాళ్లం. అక్కడికెళ్లి పచ్చికతో నిండిపోయిన స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకునేవాళ్లం. అందులో ఎంత ఉర్కులాడినా, కిందపడ్డా దెబ్బలు తగిలేది కాదు. కాబట్టి పిల్లలందరం కబడ్డీ, ఖోఖో, హైజంప్, లాంగ్ జంప్ ఇలా రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం. అప్పట్లో సారోళ్లు కూడా కార్లల్లో వచ్చేవాళ్లు కాదు. బస్సుమీదో, సైకిల్ మీదో వచ్చేవాళ్లు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఆరోతరగతి వరకు చదువుతున్నప్పుడు మా సారోళ్లు అయితే సైకిళ్లమీదే వచ్చేవారు. ఇక వర్షాకాలంలో కాబట్టి సాయంకాలం వాన ఎక్కువై వదలకపోతే మా సారోళ్లు ఆ రోజు రాత్రికి స్కూల్లోనే ఉండిపోయేవారు. ఇలా వారు ఉండిపోయిన ప్రతీసారి నేను, ఒకరిద్దరు నా దోస్తులు కలిసి స్కూలు వదిలిన వెంటనే ఇంటికి రాకుండా సార్ వాళ్లతో ముచ్చట పెట్టుకుంటూ అక్కడే ఉండిపోయేవాళ్లం. వాన తగ్గినాక వచ్చేవాళ్లం.

స్నాక్స్ అంటే ఇవే..

ఇప్పట్లో పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ అంటున్నారు. కానీ నా చిన్నప్పుడు బడికెళ్లేముందు ప్రత్యేకించి స్నాక్స్ ఏవీ ఉండేది కాదు. నేనే కాదు ఊర్లో ఎవరూ టిఫిన్లు, స్నాక్స్ తినేవారు కాదు. అన్నమో, రొట్టెనో తినిపోవాలి. మధ్యాహ్నం వచ్చి మళ్లీ అన్నమో రొట్టెనో తినిపోవాలి. ఇక స్నాక్స్ అంటే.. వానాకాలంలో అయితే కాల్చిన చింతగింజలో, ఏంచిన పల్లీలో, అప్పుడప్పుడు కిరణాకొట్టులో కొనుకున్న బఠానీలో తినేవాళ్లం. అది కూడా రెగ్యులర్‌గా కాదు. ఎవరైనా బఠానీలు తెచ్చుకుంటే పిల్లలంతా నాక్కూడా ఇవ్వురా అంటూ చట్టూ చేరేవాళ్లు. తెచ్చుకున్న చారానా, ఆటాన, రూపాయి బఠానీల్లో అందరం పంచుకొని తిన్న ఆ రోజులు ఎంత బాగుండేవో అసలు. ఇక వాన వస్తున్నప్పుడు సంచులతో చేసిన కొప్పెరలో, వాన కాయితా(ప్లాస్టిక్ కవర్లు)లో కప్పుకొని పోయేవాళ్లం. కొందరు ఛత్తిర్లు (గొడుగులు) తెచ్చుకునేవాళ్లు. వానవచ్చినప్పుడు స్కూల్లో కూర్చొని ఉన్న మేము బయటకు చూసినప్పుడు మస్తు ఆనందం కలిగేది.

వానలో వస్తూ.. పోతూ..

స్కూల్ పై కప్పుడు నుంచి జారుతున్న వానధారల చప్పుడు సంగీతంలా అనిపించేది. వానకు పారుతున్న వరదలు, వరదల్లో తేలియాడుతూ పోతున్న కాగితాలు, కాగితప్పు పడవలు చూడముచ్చటగా ఉండేది. ఇక వాన వెలిశాక. స్కూల్ ముందు మైదానంలో పచ్చికపై వెలిసిన నీటిబిందువులు నడుస్తున్న మా కాళ్లకు తగిలితే ఏదో హాయిగా ఉండేది. ఇక స్కూల్ నుంచి వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు మధ్య మధ్యలో బాటలో, రోడ్డుపై గుంతల్లో వెలిసిన నీటిలో కూడా కాళ్లు తడుపుతూ ఆడుకునేవాళ్లం. ఇంటికి వచ్చాక ఇంటి ముందరో, ఊరిబయట మైదానంలోనో ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టి ఆడుకునేవాళ్లం. అందుకే స్కూళ్లు తెరిచే సమయమన్నా, బడికి వేళాయే అనే పిలుపు విన్నా అప్పట్లో మనసు పులకరించేది. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకొస్తే అదే అనుభూతి మదిని తడిమినట్టు అనిపిస్తుంది.

- మొహమ్మద్ జునైద్

Next Story