We are all with you.. డియర్ జవాన్.!

by Daayi Srishailam |
We are all with you.. డియర్ జవాన్.!
X

దేశం మీసం తిప్పుతోంది.

దేశమంటే మనుషులోయ్ అని నిరూపిస్తోంది.

బార్డర్లో సైనికుడా నీ వెంటే మేమున్నామని నినదిస్తోంది.

వీరులగన్న తల్లులు..

ధీరుల కట్టుకున్న సతీమణులు..

చెమ్మ బయటకు రానీయని చెల్లెమ్మలు..

భారత్‌కు రక్షణగా తమవాళ్లను పంపించి..

గగనతలం నుంచి తూటాలు ఎగిసిపడుతున్నా..

తొణకుండా.. బెణకకుండా యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు.

- దిశ, ఫీచర్స్

ముష్కర మూకలను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ పనిబట్టేందుకు ఇండియాలో పిల్లాజెల్లా "జై కొడుతూ" జాగారం చేస్తున్నారు. భారత సైన్యపు భారీ సాహసాల గురించి మీసం మెలేసి చెప్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు. యుద్ధం చేస్తున్న.. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవానుల కుటుంబాల మద్దతు ఒకెత్తు. "విజృంభించండి బిడ్డా.. వీర జవానులారా.. మీకు మేమున్నాం" అంటూ ఆపరేషన్ సిందూర్‌కు ఊతమిస్తున్నారు.

నా కొడుకు రాకపాయె

"సిందూర్" ఆపరేషన్ మాత్రమే కాదు. కాశ్మీర్లో రాలిన ప్రతి నెత్తుటి బొట్టుకు అర్పిస్తున్న నివాళి. గాల్లో కలిసిన ప్రతి ప్రాణానికి సంస్మరణ. "వదిలేయండీ" అని హాహాకారాలు చేస్తున్నా చలించని ముష్కరమూక చెల్లించుకుంటున్న మూల్యం. మూకకు వంతపాడుతున్న పాక్‌కు తగిన గుణపాఠం. ఈ ముష్కరులు బాంబులిసిరిన ప్రతీసారి ఎన్ని సిందూరాలు రాలిపోయి ఉంటాయి. ఎందరి ముత్తయిదువల గాజులు పగిలిపోయి ఉంటాయి. ఎంతమంది పిల్లలు కన్నీళ్లు కార్చి ఉంటారు.? రోజూ పొద్దుమూకే వేళకు దారెంట ఎదురుచూస్తూ "ఎనకొచ్చే ఆవుల్లారా ఎర్రావుల్లారా.. మీరంతా వస్తున్రూ నా కొడుకు రాకపాయె" అని ఎందరు తల్లులు ఎదురుచూసి ఉంటారు చెప్పండి.? అనే మద్దతు లభిస్తోంది.

ఆనంద బాష్పాల ఆత్రుత

యుద్ధమంటే మాటలు కాదు. యుద్ధమంటే మంత్రాలు కాదు. రంగంలోకి దిగినవారికే తెలుసు యుద్ధం గొప్పదనం. వాళ్లను రంగంలోకి దింపిన కుటుంబాలకే తెలుసు వారి త్యాగం. ఒక్కో తూటా చప్పుడుకు.. టీవీ చూస్తున్న తల్లి గుండె తరుక్కుపోతుంది. బాంబుల శబ్దం విన్నప్పుడల్లా భార్య ఉలిక్కి పడుతుంది. "ఆపరేషన్ సిందూర్" ఆ భయాలను తరిమికొడుతోంది. ఆందోళనలను ఆవిరి చేస్తోంది. పేగు బంధాలను.. పోగు బంధాలను పక్కనబెట్టి "ఆపరేషన్ సిందూర్"కు ఆక్సీజనందిస్తున్నారు. "నువ్వు పేల్చే ఒక్కో తూట.. భావి తరాలకు పూలబాటలేయాలి బిడ్డా" అని ఏండ్లకొద్దీ ఏడ్చిన కండ్లూ.. ఆనంద భాష్పాల కోసం ఆత్రుత పడుతూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.

తగ్గేది లే తమ్ముడా

"ఆపరేషన్ సిందూర్"పై బయట వాళ్లొకరు వీళ్లొకరు కొంత భిన్నంగా మాట్లాడుతున్నారు కానీ.. సైనిక కుటుంబాలు సానుకూలంగానే ఉన్నాయి. "మాకు భయం లేదు.. మా పిల్లలకూ భయం లేదు" అని స్టేట్మెంట్లు ఇచ్చి జవాన్ల వీరత్వాన్ని వివరిస్తున్నారు. "అవసరమైతే మేమూ వస్తాం.. అదరొద్దూ బెదరొద్దూ" అని ధైర్యం నూరిపోస్తున్నారు. "అవసరమైతే తలా ఇన్ని పైసలేసుకుంటాం.. యుద్ధ సామాగ్రికి మా వంతు సాయం చేస్తాం. మీరు కట్టుకెళ్లిన సద్దీ అయిపోయిందని వెనకడుగు వేయకు తమ్ముడా.. ఇప్పుడు తగ్గితే ఎప్పటికీ తగ్గే ఉండాల్సి వస్తుంది సూడు" అని వెలకట్టలేని సందేశాలనిస్తున్నారు. "ఆపరేషన్ సిందూర్" ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తుందనే కొత్త తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.

మేమున్నాం సోదరా

"సిందూర్" మనల్ని అప్రమత్తం చేయడమే కాదు. జాతిని జాగృతం చేసింది. బయట ఉన్నవాళ్లం ఎన్నయినా మాట్లాడతాం.. ఏవైనా చెప్తాం. కానీ యుద్ధరంగంలో శతృవును తన మేధస్సుతో చీల్చి చెండాడుతున్న సైన్యానికి తెలుసు ఆ కష్టమేంటో.? అందుకే ఏ సైనికుడి త్యాగాన్ని తక్కువ చేయొద్దని.. ఆపరేషన్ సిందూర్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని "ఆర్మీ బలగం" ఏకమవుతోంది. సైన్యంలో సేవలందిస్తున్న వారి కుటుంబాలే కాకుండా.. స్నేహితులు.. బంధువులూ గర్వంగా ఫీలవుతూ వారి త్యాగాలను కొనియాడుతూ.. యుద్ధానికి మద్దతునిస్తున్నారు. "మాకు మీరున్నారనే భరోసానే కాదు.. మీకూ మేమున్నామనే భరోసా ఇస్తున్నాం.. వియ్ ఆర్ ఆల్ విత్ యూ" అని ప్రకటిస్తున్నారు.



Next Story

Most Viewed