Mind power : మనసుకూ కావాలి.. పరిశుభ్రత !

by Javid Pasha |

Mind power : మనసుకూ కావాలి.. పరిశుభ్రత !

Mind power : మనసుకూ కావాలి.. పరిశుభ్రత !
X

దిశ, ఫీచర్స్ : మనసు బాగుంటేనే మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. బాగోలేకపోతే నిరాశా, నిరుత్సాహానికి గురవుతుంటాం. కంటికి కనిపించదు కానీ.. మొత్తానికి ఏదో మాయ చేస్తుంది మనసు..! అంటుంటారు నిపుణులు సైతం. అందుకే మైండ్ పవర్ గురించి, మైండ్ రిలాక్సేషన్ గురించి పుస్తకాలు సైతం ఎన్నో వెలువడ్డాయి. మనసును అర్థం చేసుకోవడం, మనసును మార్చడం, మేనేజ్ చేయడం అనేది చదివిన కొద్దీ ఒడవని కథలాంటిదే.. కాబట్టి మనసును మంచివైపు నడిపించాలి. శరీరంలోని మలినాలను తొలగించడానికి బాడీ డిటాక్సిఫికేషన్ ఎంత అవసరమో.. మనసులోని మాలిన్యాన్ని తొలగించడానికి మైండ్ డిటాక్సిఫికేషన్ కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు.

బాడీ డిటాక్సిఫికేషన్.. శరీరంలో పేరుకుపోయిన విషపూరిత పదార్థాలను తొలగించేందుకు చేసే ఒక సంప్రదాయ పద్ధతి లేదా ప్రయత్నమే ఇది. వైద్య నిపుణుల సహకారంతో గానీ, ఇంటిలోనే పాటించగలిగే సహజసిద్ధమైన చిట్కాలతో గానీ కొందరు ఇలా చేస్తారు. రకరకాల పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా పేరుకుపోయిన శరీరంపై, శరీరంలో లోపల పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి ఈ బాడీ డిటాక్సిఫికేషన్ సహాయపడుతుంది. అయితే ఇక్కడ శరీరానికే కాదు. ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడుతున్న వారి మనసుకూ డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ) చాలా ముఖ్యం.

భ్రమలు తొలగిపోయేలా..

ఎప్పుడైతే మనం వాస్తవాలను విస్మరించి భ్రమలకు లోనవుతామో అప్పుడు ప్రతికూల ఆలోచనలు వేధించే అవకాశం ఎక్కువ అంటుంటారు నిపుణులు. అరుదుగా కొన్నిసార్లు ఇవి శారీరక సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతవల్ల కూడా సంభవించే అవకాశం ఉంటుంది. పుట్టి పెరిగిన వాతావరణం, సమాజంలో నుంచి నేర్చుకోవడం, జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, అనుభవాల ఆధారంగా కూడా ప్రతికూల ఆలోచనలు లేదా ప్రతికూల దృక్పథం ఏర్పడుతుంటాయని నిపుణులు అంటున్నారు. అలాంటి ఆలోచనలను డైవర్ట్ చేయడానికి నచ్చిన పుస్తకం చదవడం, వ్యాయామం చేయడం, ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటి చేయవచ్చు సహాయపడతాయి. ఇదే మైండ్ డిటాక్సిఫికేషన్ అంటున్నారు నిపుణులు.

స్పందించే తీరును బట్టి..

ఒక విషయంపట్ల మీరు స్పందించే తీరు, మీ చుట్టూ జరిగే సంఘటనలు, ఆయా పరిస్థితులను అర్థం చేసుకునే విధానం కూడా వాటిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంటాయి. అందుకే రోజువారీ అనుభవాలు, ఆయా సందర్భాల్లో మీ ప్రవర్తన, స్పందనపై ఒక అవగాహనకు రావాలి. మీలో ప్రతికూల స్పందనలు ఎక్కువగా ఉంటున్నాయా? సానుకూల స్పందనలా? వీటిపట్ల మీ వైఖరిలో ఏది ఎక్కువగా ఉంది? అనేది మీకు మీరు పరిశీలించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, సహచరులు సహాయం తీసుకోండి. మీలో ప్రతికూల ఆలోచనలు రావడానికి గల కారణాలను విశ్లేషించుకుంటూ.. వాటిని పోగొట్టేందుకు మీకు మీరే శిక్షణ ఇచ్చుకోండి. ఈ విధమైన మైండ్ డిటాక్సిఫికేషన్ మెథడ్ మీలో గొప్ప మార్పును తెస్తుంది.

తార్కిక ఆలోచన

ప్రతికూల ఆలోచనలు పదే పదే మీ మైండ్‌లో మెదులుతుంటే.. అవి ఎందుకు వస్తున్నాయి? వాస్తవ పరిస్థితులు ఏమిటి? మీరు ఆ ఆలోచనల్లో ఎందుకు కూరుకుపోవాల్సి వస్తోంది? అని ప్రశ్నించుకుంటే సగం సమస్యల నుంచి బయటపడిట్లే అంటున్నారు నిపుణులు. మీకున్న భయాలు, ఆందోళనలు, ఎదుర్కొన్న అనుభవాలే అందుకు కారణమైతే వాటికి వ్యతిరేక ఆలోచనలవైపు మీ మనసును నిమగ్నం చేయండి. ఏ విషయంలోనైనా సరే హేతు బద్ధంగా లేదా తర్కబద్ధంగా ఆలోచిస్తే సరైన మార్గమేదో మీకే తెలుస్తుంది.

ఇతరులతో పోల్చుకోవద్దు

ప్రతీ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం మీలో ప్రతికూల ఆలోచనలకు కారణం అవుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు సహజంగానే కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని అందుకోలేనప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని బాధపడుతుంటారు. ఇవే కొన్నిసార్లు ప్రతికూల దృక్పథానికి కారణం అవుతుంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయాలంటున్నారు నిపుణులు.

విమర్శలను స్వీకరించడం

మనలో లోపాన్ని ఎత్తిచూపే సద్విమర్శలను కూడా కొందరు యాక్సెప్ట్ చేయరు. దీనివల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోయి మైండ్ పాడు చేసుకుంటారు. నిజానికి విమర్శలు కొన్నిసార్లు మనల్ని తీర్చిదిద్దుతాయి. ఏవో పనిగట్టుకొని చేసే విమర్శలు మినహాయిస్తే.. మీ మేలు కోరి చేసే సద్విమర్శలను తప్పక స్వీకరించాలి అంటున్నారు నిపుణులు. దీనివల్లో మీలోని లోపాలను అధిగమిస్తారు. మీ మైండ్ సెట్ మార్చుకుంటారు. విజయం వైపు నడిపించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. సో.. విమర్శను స్వీకరించడం కూడా నిజమైన ‘మైండ్ డిటాక్సిఫికేషన్’ అవుతుంది అంటున్నారు నిపుణులు.

Next Story