- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులపై రక్త నాళాలు పైకి కనిపించడం.. అనారోగ్య సంకేతమా?
చేతులపై రక్త నాళాలు కనిపిస్తే వయసు పెరుగుతోందనో, ఆరోగ్యం పాడవుతోందనో కొందరు అనుమాన పడుతుంటారు. కానీ అది నిజం కాదు!

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? కొందరికి చేతులపై రక్తనాళాలు చర్మంలోంచి పైకి కనిపిస్తుంటాయి. ఏదైనా బరువును ఎత్తినప్పుడు లేదా డ్రైవింగ్‌లో స్టీరింగ్‌పై చేతులు ఉంచినప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇది చూసి కొందరు ఆందోళన చెందుతుంటారు. చర్మం సన్నబడుతోందనో, వయసు పెరుగుతోందనో, ఆరోగ్యం పాడవుతోందనో అనుమాన పడుతుంటారు. కానీ అది వృద్ధాప్యం లేదా అనారోగ్య సంకేతం ఏమాత్రం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్య సాహిత్యం & క్లినికల్ గైడ్‌లైన్స్ కూడా ఇదే పేర్కొంటున్నాయి. Cleveland Clinic, Mayo Clinic వంటి సోర్సెస్ ప్రకారం ఇది సాధారణ శారీరక నిర్మాణ విషయమేనని నిపుణులు అంటున్నారు. మరి అలా కనిపించడానికి గల ఇతర కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేనికి సంకేతం?
రక్తనాళాలు(Veins) ఉబ్బి, చర్మంలో నుంచి పైకి కనిపించడానికి జన్యు శాస్త్రం, స్కిన్ థిక్‌నెస్, శరీరంలో కొవ్వు శాతం, ఉష్ణోగ్రత, హైడ్రేషన్, వ్యాయామం, రక్తప్రసరణ వంటి సాధారణ కారణాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇలా కనిపిస్తుంటే.. మీ శరీరం నిరంతరం రక్తాన్ని పంపిణీ చేస్తూ.. ఆక్సిజన్ అందిస్తూ.. ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నదని అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. వ్యాయామం చేసిన తర్వాత, వేడి వాతావరణంలో లేదా శరీర నిర్మాణం సహజంగా ఉన్నప్పుడు సహజంగానే రక్తనాళాలు ఎక్కువగా కనిపించవచ్చు. ఇది శరీరం సాధారణంగా పనిచేస్తున్నట్టు సంకేతమే తప్ప ప్రమాదకరం కాదని నిపుణులు అంటున్నారు.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
కేవలం రక్త నాళాలు కనిపించడం అస్సలు సమస్య కాదు. అది వృద్ధాప్యం లేదా అనారోగ్య లక్షణం కూడా కాదు. కానీ.. నొప్పి, వాపు, ఎర్రబడటం, ఆకస్మికంగా ఎక్కువగా కనిపించడం, చర్మంలో మార్పులు లేదా అల్సర్లు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అనుమానించాలి. వైద్యులను సంప్రదించి తగిన సలహాలు పాటించాలి. అలాగే రక్త నాళాలు మాత్రమే ఆరోగ్య స్థితిని కూడా నిర్ణయించవు. కాబట్టి ఇక్కడ సందర్భం, లక్షణాలు అనేవి ముఖ్యం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






