కారు బంగ్లా ఉన్నా.. కార్డుకు పేదొళ్లమే.!

by Daayi Srishailam |

"అన్నింటికీ అర్హులమే.. దేన్నీ వదులుకోం" అనే ఆలోచనతో ఉంటారు ఈ మనుషులు.!!

కారు బంగ్లా ఉన్నా.. కార్డుకు పేదొళ్లమే.!
X

సంపన్న కుటుంబమే..

సర్కారు పథకమనేసరికి "సారూ నాకూ" అంటారు.

కారు.. బంగ్లాలుంటాయి.

"కార్డు" అనేసరికి కడు పేదరికం ఉన్నొళ్లలా "లైన్లు" కడతారు.

ధనం.. దందాలూ ఉంటాయి.

"దరఖాస్తు" అనేసరికి "దారిద్ర్యరేఖ"కు దిగువనున్నాం అంటారు.

అన్నీ బాగనే ఉన్నా..

"అంత్యోదయ అన్నయోజన" కావాలని ఆశ పడతారు.

ఉద్యోగం సద్యోగం ఉన్నా..

"ఉపాధి హామీ పథకం" కార్డుండాలని పేరు రాయిస్తారు.

"అన్నింటికీ అర్హులమే.. దేన్నీ వదులుకోం" అనే ఆలోచనతో ఉంటారు ఈ మనుషులు.!!

- దాయి శ్రీశైలం

మనుషులు రెండు రకాలు. ఉన్నోడు.. లేనోడు. ఏమీ లేనోడు ఏదో రకంగా కడుపు నింపుకొని "హమ్మయ్యా" పూట గడిచిందిరా దేవుడా అని కాళ్లు ముడుచుకుంటున్నాడు. ఉన్నోడేమో ఇంకా ఉంటే బాగుండు అని ఆశపడుతున్నాడు. ఏమీ లేనొళ్లకు సర్కారిచ్చే పథకాలకు అడ్డుపడుతూ "నాకెందుకు ఇయ్యరు" అని నానా కథలు పడుతున్నాడు.

బ్లాక్‌లో అమ్మేందుకా.?

చాలామందిని చూస్తుంటాం. వాళ్లకు కార్లుంటాయి.. బంగ్లాలుంటాయి. ఎకరాలకు ఎకరాలు భూములుంటాయి. ఇంట్లో ఫ్రిడ్జుంటుంది. ఏసీ ఉంటుంది. అంత ఉన్నా సర్కారిచ్చే "రేషన్ బియ్యం" కోసం నానా తంటాలు పడుతుంటారు. "తెల్ల రేషన్ కార్డు" కోసం తెల్లందాక "క్యూ" కడతారు. సరే పోనీ.. రేషన్ బియ్యాన్ని వాళ్లేమైనా తింటరా అంటే.. అదీ ఉండదు. రేషన్ షాపులోంచి బయట పడ్డయంటే ఆ బియ్యం ఎక్కడికో వెళ్తాయి. కానీ కార్డున్నవారి ఇంట్లో పొయ్యి మాత్రం ఎక్కవు. సర్కారిచ్చే ఈ ఉచిత బియ్యాన్ని పది రూపాయలకు.. పదిహేను రూపాయలకు కిలో చొప్పున బ్లాక్‌లో అమ్మేసి.. వైట్ క్యాష్ చేసుకుంటున్నారు.

ఆశ ఎవ్వడిది.. ఆకలెవ్వడిది.?

"బ్లాక్ మార్కెట్"కు తరలిపోతున్న రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి.? అటూ ఇటూ తిరిగి డిజైన్ సంచుల్లో మళ్లీ పేదోడికే కిలోకు రూ.60 చొప్పున దిగుతున్నాయి. బాస్మతి తినే స్థోమత ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారం చేసేవాళ్లు.. రిటైరయ్యి ఫించన్ తీసుకుంటున్నవారు.. భూస్వాములు.. కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవాళ్లు రేషన్ బియ్యాన్ని వదులుకోక అంగట్లో అమ్మేస్తున్నారు. వీళ్లలో నిజమైన పేదోడెవరు.? ఉచితంగా వచ్చే బియ్యాన్ని "బ్లాక్" చేస్తున్నోడా.? అదే బియ్యం "వైట్ కోటింగ్" వేసుకొని వస్తే కొంటున్నోడా.? ఆశ ఎవడిది.? ఆకలి ఎవడిది.?

బాగు పడేదెవ్వడు.?

ఎలక్షన్లో పోటీ చేసే పార్టీలేం చెప్తాయి.? పాతా ఇనప సామాన్లకు బఠానాలిస్తాం అన్నట్లు.. అదిస్తాం ఇదిస్తాం కోటీశ్వరులను చేస్తాం అని హామీలిస్తాయి. ఎవరికివ్వాలో వాళ్లకే ఇచ్చేస్తే పాపం ఓట్లెవరేస్తారు. అందుకే అందరికీ రేషన్ కార్డులు.. అందరికీ రుణమాఫీ అంటారు. ఇంటింటికీ సంక్షేమ పథకం అంటారు. వాస్తవానికి ఇవ్వాల్సింది ఏమీ లేనోనికి. పేదోడికి రేషన్ కార్డిచ్చి.. ఆరోగ్య శ్రీ అమలుచేసి.. రుణమాఫీ చేసి.. ఫించనిస్తే పూటపూటకూ తిని.. మంచి బట్టకట్టి బతుకు సాగిస్తడు కదా.? ఆకలితో ఉన్నోడిని.. ఆశపడ్డోన్ని అందర్నీ ఒక గంప కిందనే కమ్మితే లాభం ఎవ్వడికి.?

పేదోడెవరు మరీ.?

ఒక వ్యక్తి రోజుకెంత సంపాదిస్తుండు.. ఖర్చెంత ఉంటుందనేది తెలిస్తే పేదేడెవరో తెలిపాయె. లెక్కల ప్రకారమే చూస్తే 2014 రంగరాజన్ కమిటీ సిఫారసుల ప్రకారం.. గ్రామాల్లో వ్యక్తి సంపాదన రోజుకు రూ.32/.. పట్టణాల్లో రూ. 47/ మించకుండా ఉండాలి. ఇది 2025 కాబట్టి ఇప్పటి ద్రవ్యోల్బణం 5-6% అనుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 50-55 సంపాదిస్తే అది సంవత్సరానికి రూ. 18,250-20,075 మాత్రమే. పట్టణాల్లో రూ.75-80 అనుకున్నా సంవత్సరానికి రూ. 27,375-29,200 ఆదాయం వస్తుంది. ఈ 20వేలు.. 30వేలతో వాళ్లేం బతుకుతారు.? అసలు వీళ్లుకదా పేదొళ్లంటే.?

ఆదాయం ఒక్కటేనా.?

పేదోడెవరో చెప్తా అని ప్రపంచ బ్యాంకోడు కూడా ఒక లెక్క చెప్పిండు. మనందర్కీ అప్పిచ్చేది వాడే కాబట్టీ.. వాడి లెక్కనూ పరిశీలిస్తే.. ఒక మనిషి రోజుకు $2.50-$2.70 కంటే ఎక్కువ సంపాదించే స్థోమత లేకపోతే వాడే పేదోడు. రూపాయలల్లో తీసుకుంటే రోజుకు రూ.65-75.. సంవత్సరానికి రూ. 23,725-27,375 అన్నమాట. అయినా ఒక మనిషి పేదోడా.. బలిసినోడా అనేది చెప్పడానికి ఆదాయాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ఎట్లా.? ఆహార భద్రత.. ఆరోగ్య సంరక్షణ.. విద్య.. నివాసం.. పరిశుభ్రమైన నీటి లభ్యత వంటివన్నీ లెక్క కట్టాలి. వాటి ప్రకారమే సంక్షేమ పథకాలు తీసుకోవాలి.

ఎవరు తీసుకోవాలి.?

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తెలంగాణ జనాభా సుమారు 3.6 కోట్లు. పేదరిక శాతం13.74%. అంటే దాదాపు 50 లక్షల మంది. జాతీయ సగటు 25.01% కంటే తక్కువ. ఈ లెక్కన.. ఆరోగ్య శ్రీ.. ఫీజు రీయంబర్స్‌మెంట్.. రైతుబంధు.. రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు ఎవరికి దక్కాలి.? ఏదైతే ఈ 13.74% ఉందో ఆ కేటగిరి ప్రజలకు దక్కాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నారు. 2025 నాటికి మన తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 90,41,953. ఇవి సుమారు 2.5-3 కోట్ల జనాభాను కవర్ చేస్తాయి. అంటే 3.6 కోట్ల జనాభాలో దాదాపు 3 కోట్ల మంది వివిధ రూపాల్లో రేషన్ కార్డులను సంక్షేమ పథకాలకు వాడుతున్నారు.

ఉల్టా బొక్క పడేది మనకే.!

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకం ఉంటారు కొందరు. "ఎవరింట్లకెల్లి ఇస్తుండ్రు.. సర్కారిస్తుంది" అని సిల్లిగా వాదిస్తారు. అయ్యా సార్లూ.. సర్కారే ఇస్తుండొచ్చు కానీ సర్కారు స్కీమ్ కోసం చెయ్యి చాచే స్థాయిలో లేకున్నా వాటి వెంట పరుగులు తీయడం ఎందుకు.? నీకు అవసరం లేకున్నా తీసుకోవడం వల్ల అత్యవసరం ఉన్న ఇంకొకడికి బొక్క పడుతుందయ్యా. అదీగాక.. నువ్వూ నేనూ.. అందరూ వాటిపై ఆశపడటం వల్ల అది పన్నుల రూపంలో.. ధరల రూపంలో మళ్లీ ఉల్టా మనకే కొడుతుంది. దాన్ని భరించే లిస్టులో నువ్వుంటావు.. నేనుంటాను.. అందరూ ఉంటారనే సోయి ఉండాలి కదా.?

ఇచ్చెయండీ చూద్దాం.!

"అంతా శాకాహారులే ముక్కలు మాయమైనట్లు".. "మాకేం తక్వ" అని డాబూ.. దర్పం చూపిస్తారు కొందరు. మెడలో బంగారు గొలుసు.. చేతికి ఉంగరాలు పెట్టుకొని కూడా ఫ్రీగా వస్తుందంటే బర్రె కావాలి.. గొర్రె కావాలి అనడం అవసరమా.? నిజంగా మీకు సమాజం మీద సోయే ఉంటే.. గళ్లా ఎగరేసి బాజాప్తా మీ రేషన్ కార్డులు.. రుణమాఫీలు.. రైతుబంధులు తిరిగి ఇచ్చేయండి. పాపం.. అవసరం ఉన్నోడి కడుపైనా నిండుతది కదా.?

కోట్లొస్తయా వాటితో.?

పేదొళ్ల కోసం ఇచ్చే ఫ్రీ స్కీములను అందరూ తలా ఇంతా ఫలారంలా పంచుకోవడం వల్ల అసలైన అర్హుడికి మోసం జరుగుతోంది. దూపైనోడు నీళ్లు తాగాల్నా.? ఇంట్లో బిందెల నిండా నీళ్లుండి కూడా వచ్చినోడు తాగాల్నా.? పది.. ఇరవై లక్షల కార్లలో తిరిగేవాళ్లు.. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివించేవాళ్లు కూడా రేషన్ బియ్యం కోసం పోటీ పడటమెందుకయ్యా.? ఈ "కోపీన్ బియ్యం"తో కోట్లు వెనకేసుకుంటరా ఏంది.?


అమెరికాలో ఇలా

👉 సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ (స్నాప్) ద్వారా నిత్యవసర సరుకులు ఇస్తారు.

👉 130% ఫెడరల్ పావర్టీ లైన్ కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు.

👉 దీనిని "ఫుడ్ స్టాంప్స్" అని కూడా అంటారు.

👉 ఇంట్లో కుటుంబ సభ్యుల నెలవారి ఆదాయం $3,400.. సంవత్సరానికి $40,800 తక్కువ ఉండాలి.

👉 ఇండ్లు లేనివాళ్లు.. నిరుద్యోగులు.. తక్కువ వేతనం ఉన్నవాళ్లు.. వృద్ధులు.. వికలాంగులకు ఇది వర్తిస్తుంది.


ఆస్తులేం ఉండాలి.?

👉 నెలవారి గ్రాస్ ఆదాయం 130% ఫెడరల్ పావర్టీ లెవల్ (ఎఫ్‌పీఎల్) కంటే తక్కువుండాలి.

👉 నెట్ ఆదాయం 100% ఎఫ్‌పీఎల్ కంటే తక్కువుండాలి.

👉 $2,750 కంటే తక్కువ ఆస్తులుండాలి.

👉 వృద్ధులు.. వికలాంగులకు $4,250 ఉండాలి.


తేడా ఏంటంటే.?

👉 మన దగ్గర రేషన్ కార్డులను కేవలం సరుకులకే కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు వాడతారు.

👉 అమెరికాలో ఆహారం కొనుగోలు కోసం మాత్రమే స్నాప్ కార్డులను వినియోగిస్తారు.

👉 మన దగ్గర అందరికీ రేషన్ కార్డులు అనే హామీలుంటాయి.

👉 అమెరికాలో అర్హులకు మాత్రమే స్నాప్ కార్డులు ఇస్తారు.

Next Story