పురుషుల స్వరం.. గరీబ్ బేటా.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:26:59  IST  )

పురుషుడికి గౌరవం.. ప్రేమ.. ఆదరణ ఉంటాయా అనే కొత్త ప్రశ్నను బలంగా లేవనెత్తుతోంది ఈ వీడియో

పురుషుల స్వరం.. గరీబ్ బేటా.!
X

దిశ, ఫీచర్స్: ఒకే ఒక్క రీల్.. లక్షలాది మంది గుండెల్ని తాకింది. దెబ్బకు వైరలై ఆలోచింపజేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో "డైరెక్టర్ దయాళ్" అనే క్రియేటర్ పోస్టు చేసిన "గరీబ్ బేటా తో మా బాప్ కో భీ అచ్ఛా నహీ లగ్తా" అనే వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. డబ్బు ఆర్జించే వరకు మాత్రమే పురుషుడికి గౌరవం.. ప్రేమ.. ఆదరణ ఉంటాయా అనే కొత్త ప్రశ్నను బలంగా లేవనెత్తుతోంది ఈ వీడియో.

వైరల్ ఎలా అయ్యింది.?

"ఆడపిల్లకు సొంతిల్లుండదు తెలుసా" అనే వీడియో ఎంత వైరలైందో తెలుసు కదా.? వైరలే కాదు.. ఇదొక పెద్ద చర్చనీయాంశమైంది కూడా. ఇప్పుడలాంటి చర్చనే ఇంకోటి జనాల మధ్యలోకి వచ్చింది. అదే "గరీబ్ బేటా". ఈ దయాళ్ అనే వ్యక్తి దాన్ని గట్టిగానే జనాల్లోకి వదిలాడు. అందుకే ఇప్పుడెక్కడ చూసినా ఇదే అంశమ్మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంతకూ దయాళ్ చెప్పేదేంటంటే.. "నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ ముందుగానే రెండు ఎక్స్‌ట్రా రొట్టెలు చేసేది. నాన్న కూడా నవ్వుతూ మాట్లాడేవారు. ఇంట్లో నాకు ప్రత్యేక స్థానం ఉండేది. ఎందుకంటే.. నేను సంపాదిస్తున్నా" కాబట్టీ అంటాడు.

ఉద్యోగం మానేస్తే..

"మరి సమస్యెక్కడిదీ" అనే కదా మీ సందేహం. ఇదిగో అదే చెప్తున్నాడు ఈ దయాళ్. ఉద్యోగం మానేసి మూడు రోజులకు ఇంటికి వెళ్లాడట దయాల్. ఆ రోజు భోజనానికి రెండు రొట్టెలు అడిగాడు. అప్పుడు వాళ్ల నాన్న అమ్మతో "ఇదిగో రెండు రొట్టెలు అడుగుతున్నాడు...ఇచ్చెయ్ ఇచ్చెయ్" అని వెటకారంగా అన్నాడట. ఆ ఒక్క మాట దయాల్‌కు గుచ్చుకుంది. "ఇల్లు అదే.. తల్లిదండ్రులు వాళ్లే. కానీ నా సంపాదన ఆగిపోయిన మరుక్షణమే నన్నేదోలా చూస్తున్నారు. వాళ్లకు అసలు నేను కంటికి కనిపించకుండా పోయాను" అని ఆ వీడియోలో వణుకుతూ దు:ఖ స్వరంతో చెప్పాడు.

సంపాదనతోనే గౌరవం..

అసలు మనోడి బాధేందో తెలుసుకుంటే ఒకటి స్పష్టంగా అర్థమైంది. "సంపాదన లేకపోతే ఎవరూ గౌరవించరు.. దానికి తల్లిదండ్రులు మినహాయింపేం కాదు" అంటాడు. దయాళ్ మాట విన్న వెంటనే వందల మంది పురుషులు తమ అనుభవాలు కామెంట్స్‌లో పంచుకున్నారు. "నేను రెండేళ్లు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నాను. అమ్మ నన్ను చూసి ఇంట్లో కూర్చుని తింటావా అనేది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాను.. ఇప్పుడు అమ్మే నాకు రొట్టెలు పెడుతోంది" అని ఒకరు.. "ఆడవాళ్లు.. పిల్లలు.. కుక్కలు మాత్రమే ఏం లేకున్నా ప్రేమించబడతాయి. పురుషుడు మాత్రం ఏదో ఇస్తేనే ప్రేమించబడతారుస్తారు" అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story