గోన్ ఫిషింగ్ కాటేజెస్.. ప్రకృతి ఒడిలో అందమైన ఇల్లు !

by Javid Pasha |   (  Updated:2026-01-17 10:17:58  IST  )

‘ఇదేం జీవితంరా బాబు.. ఎటైనా పర్వతాలకు వెళితే బాగుండు’ అనుకుంటారు చాలామంది. కానీ ఆ దంపతులు మాత్రం ఆ కలను నిజం చేసుకున్నారు. నగర జీవితాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లారు.

గోన్ ఫిషింగ్ కాటేజెస్.. ప్రకృతి ఒడిలో అందమైన ఇల్లు !
X

దిశ, ఫీచర్స్ : చండీగఢ్‌కు చెందిన డింపుల్.. ఉప్పి భార్యాభర్తలు. రోజూ సందడిగా ఉండే జీవితం వాళ్లది. డింపుల్ IELTS, SAT, GMAT వంటి పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఒక సంస్థను నడిపింది. TGALF అనే సంస్థ కోసం లీడర్‌షిప్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసింది. ఉప్పి మాత్రం రైతు.

ప్రకృతిపై ప్రేమతో..

ఇద్దరు వృత్తులు వేరైనా ప్రకృతిపై ప్రేమే వారిని ఒక్కటి చేసింది. వీళ్లిద్దరూ 25 ఏళ్లపాటు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించారు. 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. 25 ఏళ్లుగా తీర్థన్‌ను సందర్శిస్తున్నారు వాళ్లు. ఎప్పుడో ఒకసారి పర్వతాలకు వెళ్లాల్సిందే అనుకునేవారట. కానీ పర్వతాల మధ్య జీవించడం ఒక దూరపు కలగా కనిపించేదట. ఆ కలను నిజం చేసుకోవాలని అన్నింటినీ వదిలేసి తీర్థన్ వ్యాలీలోని కరాతి భూమిని ‘గోన్ ఫిషింగ్ కాటేజెస్’గా మార్చేశారు.

అందమైన వ్యూ

హిమాలయాల్లో వాళ్లది ఒక అద్భుతమైన రాతి.. సౌరశక్తితో నడిచే హోం స్టే. దానిని ప్రేమ మందిరంగా నిర్మించి పర్యావరణ అనుకూల పర్వత ఆశ్రయంగా తీర్చిదిద్దారు. పొగమంచు ఉదయాలు.. నక్షత్రాలు నిండిన రాత్రులు.. లోయల్లో ప్రవహించే గలగల నీటి శబ్దం ఇక్కడి గోన్ ఫిషింగ్ కాటేజెస్ సొంతం. మొదట్లో వాళ్లక్కడ కొంత భూమిని తీసుకున్నారు. అప్పడది రాళ్లు.. పొదలతో నిండి ఉండేది. కానీ 50 అడుగుల దూరంలో సహజసిద్ధమైన ప్రవాహం.. దాని ముందొక పర్వతం.. ఎడమవైపు అడవి అందంగా కనిపిస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలని దానిని అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఫాం హౌజ్..

భూమిని చదును చేయడానికే రెండేళ్లు పట్టింది. ఆ భూమి నుంచి వచ్చిన రాళ్లతోనే కాటేజీలు నిర్మించారు. మొదట రెండు బెడ్రూమ్ కాటేజీలను ఇంటిగా నిర్మించారు. తర్వాత అదనపు రాళ్లతో రెండవ కాటేజీ నిర్మించారు. 2017 నూతన సంవత్సరం సందర్భంగా వారి కాటేజీలకు మొదటి అతిథులు వచ్చారు. ఒక జంట.. వారి స్నేహితుడు.. ఇంకా ఒక కుక్క. కుక్కను తీసుకొస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ సంఘటనతో వాళ్లు ఒక ఫాంహౌజ్‌ను కూడా కట్టారు. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ అతుల్ కుక్రేజా వీరి కాటేజీలకు రెగ్యులర్ సందర్శకుడు.

పిల్లలకు పాఠాలు కూడా

హోం స్టేను ప్రారంభించే ముందే వాళ్లు మురుగు.. వ్యర్థాల నిర్వహణను సరిచేశారు. బయో డైజెస్టర్.. సహజ మురుగు శుద్ధీకరణ కోసం ఒక అధునాత వ్యవస్థ.. ఎనిమిది కంపోస్ట్ గుండీలు ఉంటాయి. ప్లాస్టిక్ వాడకాన్ని దాదాపు తగ్గించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అస్సలు వాడరు. వెదురు స్ట్రాలు.. రాగి లేదా ఉక్కు తట్టలు.. ఆకులతో చేసిన బయోడీగ్రేడబుల్ ప్లేట్స్ మాత్రమే వినియోగిస్తారు. చెత్త సంచులు కూడా బయోడీగ్రేడబులే. ఇదంతా సోలార్ పవర్‌తోనే నడుస్తుంది. కస్టమర్లకు ఇచ్చే సబ్బులనూ ఇంట్లోనే తయారు చేస్తారు. స్థానిక పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు కూడా బోధిస్తున్నారు ఈ దంపతులు.

Next Story