స్పెషల్ అకేషన్ మానియా..! ప్రత్యేక సందర్భం కోసం ప్రస్తుత సంతోషాన్ని వదిలేసే ధోరణి..!

by Javid Pasha |   (  Updated:2025-10-22 06:40:21  IST  )

మనం సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో జీవించాలంటారు నిపుణులు. ఎందుకంటే అది మన చేతిలోనే ఉంటుంది. కానీ భవిష్యత్తు అలా కాదు.

స్పెషల్ అకేషన్ మానియా..! ప్రత్యేక సందర్భం కోసం ప్రస్తుత సంతోషాన్ని వదిలేసే ధోరణి..!
X

దిశ, ఫీచర్స్ : మన దగ్గర మంచి డ్రెస్ ఉంటుంది. కానీ ఏదైనా స్పెషల్ అకేషన్‌కు వేసుకుందామని నెలల తరబడి దాచిపెడుతూనే ఉంటాం. అకేషన్ వస్తుందో రాదో.. వచ్చినా అప్పటి వరకు ఆ డ్రెస్ అలాగే ఉంటుందో పాతబడి పోతుందో చెప్పలేం. మన దగ్గర సరిపడా డబ్బులుంటాయి. కానీ.. భవిష్యత్‌లో ఖర్చు పెడదామని కనీస అవసరాలకు తగిన కొనుగోళ్లను సైతం విస్మరిస్తుంటాం. కానీ భవిష్యత్‌లో ధరలు పెరగడం వల్లో, ఉన్న డబ్బుకు మించి ఖర్చులు పెరగడంతోనో, ఇంకేదైనా అనుకోని సంఘటనల కారణంగానో ఆశలన్నీ అడియాశలు కావచ్చు. అందుకే అంటారు పెద్దలు. ‘రేపటి గురించి ఆలోచించడంలో తప్పులేదు. అలాగనీ వర్తమానాన్ని విస్మరించడం, కనీస అవసరాలను, చిన్న ఆనందాలను సైతం భవిష్యత్ పేరుతో వాయిదా వేయడమో, విస్మరించడమో మాత్రం సరికాదు’అని. వర్తమానంలో జీవించడమే నిజమైన ఆనందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

ప్రయత్నం సరే కానీ..

మనం సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో జీవించాలంటారు నిపుణులు. ఎందుకంటే అది మన చేతిలోనే ఉంటుంది. కానీ భవిష్యత్తు అలా కాదు. అలాగనీ భవిష్యత్తును ఊహించుకోవడంలో, కలలు కనడంలో, మెరుగైన భవిష్యత్తుకోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అది ఇప్పటికిప్పుడు మన చేతిలో లేని విషయం అనేది మాత్రం గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు. పైగా ఫ్యూచర్లో మనం అనుకున్నట్లే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. అనుకోలేదని ఏదీ జరగదన్న గ్యారెంటీ కూడా ఉండదు. అలాగనీ భవిష్యత్తు గురించి ప్లాన్ ఉండకూడదని, ఆలోచించకూడదని మాత్రం కాదిక్కడ. వర్తమానాన్ని మాత్రం విస్మరించకూడదనేదే నిపుణుల సూచన. ఎందుకంటే వర్తమానం ఒక వాస్తవం. కళ్లముందు కదలాడే నిజం. అందుకే మనస్ఫూర్తిగా దానిని స్వీకరించాలని, ఆస్వాదించాలని, అనుభవించాలని చెబుతారు నిపుణులు.

ప్రత్యేక సందర్భం కోసం వాయిదా?

జీవితం దేనికీ హామీ ఇవ్వదు. కాబట్టి ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మంచి చేద్దామని, స్పెషల్ అకేషన్‌కు మాత్రమే మంచి బట్టలు వేసుకుందామని, ఇష్టమైన వస్తువులు కొనుకుందామని, ఇష్టమైన వ్యక్తులను కలుద్దామని, నలుగురికి మేలు చేసే మంచి పనులో, మనకు నచ్చిన పనులో చేద్దామని ఎదురు చూడటమో, వాయిదా వేయడమో సరైంది కాదనే ధోరణి ఇటీవల పలు దేశాల్లో పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఈ ట్రెండ్ బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ‘వర్తమానాన్ని ఎంజాయ్ చెయ్ బ్రో’ అంటూ దూసుకుపోతోంది ఆధునిక యువత. ప్రజెంట్ సిచువేషన్‌ను ఎంజాయ్ చేయడమంటే భవిష్యత్తును విస్మరించడం మాత్రం కాదిక్కడ!

అనుకున్నదే జరుగదు కదా..!

పౌష్టికాహారం తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిసినా, తినగలిగే స్థోమత, వనరులు ఉన్నా.. కొంతకాలం తర్వాత లేదా కొన్నేండ్ల తర్వాత బాగా డబ్బులు జమ చేసుకున్నాక.. రోజూ తినవచ్చు లే అనుకొని వర్తమానంలో ఏదో ఒకటి తినేసి ఉంటామా? ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకు కదా.. ఆరోగ్యం పాడవుతుంది. మనం కోరుకున్న మంచి రోజు వచ్చే వరకు మనకు చెడు రోజులు దాపురించవచ్చు.. అంటే అనారోగ్యం సంభవించవచ్చు. ఉన్న డబ్బులు పోగొట్టుకోవచ్చు. లేదా ధరలు విపరీతంగా పెరగవచ్చు. అందుకే ఇప్పుడు కావాల్సింది ఇప్పుడే చేయండి. కనీస అవసరాలకు, వ్యక్తిగత విషయాలకు, వర్తమానంలోనే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వండి అంటారు నిపుణులు. ఎందుకంటే వర్తమానం మనచేతిలో ఉంటుంది. భవిష్యత్తు ఉండదు.

ఇప్పటి గురించి ఆలోచించండి

ముఖ్యంగా కొందరు పెళ్లి, పార్టీ, ఫంక్షన్ల వంటి స్పెషల్ అకేషన్లకు మాత్రమే ధరించడం కోసం దుస్తులు, నగలు, షూలు, పర్ఫ్యూమ్, వాచ్‌లు, వివిధ యాక్సెసరీస్ వంటివి క్లోజెట్‌లో దాచి పెడుతుంటారు. కొందరు నిపుణులు దీనిని ‘స్పెషల్ అకేషన్ మానియా’గా అభివర్ణిస్తుంటారు. భవిష్యత్తుకోసమో, ప్రత్యేక సందర్భం కోసమో దాచితే దాచారు కానీ.. వర్తమానంలో కూడా అలాంటి ప్రత్యేక సందర్భంలో పొందగలిగే ఆనందాన్ని, అనుభూతిని, అవకాశాన్ని విస్మరిస్తే ఏం లాభం? అందుకే అదేదో ఇప్పుడే అనుభవించండి.. ఆ తర్వాత భవిష్యత్తు కోసం ఆలోచించండి అంటున్నారు నిపుణులు. ఇదేదో ఒక విషయానికో, ఒక రంగానికో పరిమితమైన అంశం కాదు, ఫ్యాషన్, కెరీర్, స్టడీ ఇలా అన్ని విషయల్లో, అన్ని రంగాల్లో వర్తింపజేసుకోవాలని సూచిస్తున్నారు. Link

Next Story