అనుపమ రామచంద్రన్.. స్నూకర్‌లో తిరుగులేని ఛాంపియన్.!

by Daayi Srishailam |

భారత మొదటి మహిళా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్

అనుపమ రామచంద్రన్.. స్నూకర్‌లో తిరుగులేని ఛాంపియన్.!
X

దిశ, ఫీచర్స్: స్నూకర్.. గ్రీన్ టేబుల్‌పై జరిగే ఒక మాయాజాలం. రంగురంగుల బంతుల్లో రసవత్తరంగా సాగే ఆట అది. క్యూ స్టిక్‌తో ఇచ్చే ఒక్కో స్ట్రోక్‌.. ఆటను ఒక్కో లెవల్లో ఉత్కంఠ లేపుతుంది. ఒక తప్పు చేశామంటే ఇక అంతే. ఆట తారుమారు.. ఆటగాడు బేజారు. అలాంటి మనసును పదునుపెట్టే ఆటలో నిమగ్నమై.. ఇవాళ దేశానికే వన్నె తెచ్చిన క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్. భారత మొదటి మహిళా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్.

మహిళా ఛాంపియన్‌..

ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో చెన్నయ్ క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్ టైటిల్ గెలుచుకొని భారత మొదటి మహిళా ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది. 23 ఏళ్ల అనుపమ మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హాంకాంగ్‌కు చెందిన ఎన్‌జీ ఆన్ యీని ఎదుర్కొన్నది. మొదటి ఫ్రేమ్ ఓడిపోయినా వెనక్కి తగ్గకుంగా స్కోరును సమం చేసుకొని.. నాలుగో ఫ్రేమ్‌లో ఒత్తిడి మధ్యలో 29 పాయింట్ల బ్రేక్ సాధించి మ్యాచ్‌ను డిసైడర్‌కు తీసుకెళ్లింది. అనుపమ విజయంతో భారత్ నవయుగానికి నాంది పలికిందని చెప్పొచ్చు.

మెంటార్ లేకుండానే..

చెన్నయ్‌లోని సాధారణ కుటుంబంలో పుట్టిన అనుపమ ఒక సమ్మర్ క్యాంప్‌ తన స్నూకర్ ప్రయాణాన్ని ప్రారంభించింది. 13 ఏళ్ల వయసులో మైలాపూర్ క్లబ్‌ సమ్మర్ వర్క్‌షాప్‌లో అనుపమ మొదటిసారి స్నూకర్‌ ఆటను చూసింది. అప్పటి వరకు క్రికెట్.. బ్యాడ్మింటన్ వంటి ఇతర ఆటలు ప్రయత్నించినా ఎందుకోగానీ స్నూకర్ ఆమె మనసును ఆకర్షించింది. క్యాంప్ ముగిసినా స్నూకర్‌ను వదల్లేకపోయింది. తమిళనాడు బిలియడ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్‌లో శిక్షణ ప్రారంభించి మెంటార్ లేకుండానే ప్రాక్టీస్ చేస్తూ భారత నంబర్ వన్ ర్యాంక్ సాధించింది.

చదువులోనూ..

విద్యా మందిర్ స్కూల్‌లో చదువుకున్న అనుపమ 2018లో వరల్డ్ అండర్-16 మహిళల స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించినప్పటికీ.. చదువును వదులుకోలేదు. క్రీడా.. చదువు రెండూ ముఖ్యం. ఒకటి మరోదాన్ని ప్రభావితం చేయొద్దనే మనస్తత్వంతో ముందుకు సాగింది. ఇప్పుడు 23 ఏళ్ల వయసులో కూడా ఆమె రోజువారీ షెడ్యూల్‌లో ఒకవైపు మద్రాస్ క్రికెట్ క్లబ్‌లో 4-5 గంటలు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తమిళనాడు అసోసియేషన్‌లో టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఇలా డిసిప్లిన్‌తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఛాంపియన్‌గా నిలిచింది.

మొదటి భారత మహిళగా..

అనుపమ విజయ ప్రస్థానం 2018లో మొదలైంది. తర్వాత 2022లో వరల్డ్ జూనియర్‌లో సిల్వర్ సాధించింది. 2023లో వరల్డ్ ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్‌లో అమీ కమనీతో కలిసి టైటిల్.. అండర్-21 వరల్డ్ టైటిల్ గెలిచింది. 2024లో ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ సాధించింది. వరల్డ్ ఉమెన్స్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కి చేరి.. ర్యాంకింగ్‌లో నంబర్ 6కు చేరుకుంది. 2025 నవంబర్ 13న దోహాలో ఐబీఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ ఫైనల్‌లో ఎన్‌జీ ఆన్ యీని 3-2తో ఓడించి మొదటి భారత మహిళగా టైటిల్ సాధించింది. డిసైడర్ ఫ్రేమ్‌లో 60-61 స్కోర్‌తో ఆఖరి బ్లాక్ పోట్ చేసి చరిత్ర సృష్టించింది.

Next Story