- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిర్యానీ ప్రేమికులు ఇది మీ రోజు.. ఇవాళ వరల్డ్ బిర్యానీ డే!
బిర్యానీ అనగానే చాలా మందికి నోట్లో నీరూరుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక వంటకం కాదు..

దిశ, వెబ్ డెస్క్: బిర్యానీ అనగానే చాలా మందికి నోట్లో నీరూరుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక వంటకం కాదు.. ఎంతో మందికి ఇది ఓ ఎమోషన్, ఓ అనుభూతి. పెళ్లి కాని పండుగ కాని, ఫ్రెండ్స్ గెట్టు గెదర్.. దావత్ ఏదైనా సరే, బిర్యానీ ఉండకపోతే ఆ వేడుకే అసంపూర్తిగా అనిపిస్తుంది. ఇది నేటితరానికే పరిమితమైన ప్రేమ కాదు. రాజుల కాలంలోనూ బిర్యానీకి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. మొఘల్ చక్రవర్తులు, నిజాం రాజులు, అవధ్ నవాబులు.. వీరి భోజనాల్లో బిర్యానీ కీలక భాగంగా ఉండేది. వారి వంటగదుల్లో రుచుల ఉత్సవంగా ఉండే బిర్యానీ, నేడు ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రియమైన వంటకం అయింది.
ఈ నేపథ్యంతోనే, బిర్యానీకి అంకితంగా ‘వరల్డ్ బిర్యానీ డే’ను కూడా ప్రతి సంవత్సరం జులై మొదటి ఆదివారం (ఈ ఏడాది జులై 6) జరుపుకుంటున్నారు. 2022లో దావత్ బాస్మతి రైస్ సంస్థ ప్రపంచ బిర్యానీ దినోత్సవం (World Biryani Day 2025) ప్రారంభించగా, అప్పటి నుంచి ఇది ఫుడ్ లవర్స్ కోసం ఓ పండుగలా మారింది. రెస్టారెంట్ల ఆఫర్లు, ఫుడ్ ఫెస్టివల్స్, ప్రత్యేక రుచులతో ఈ రోజు ఓ ఫుడ్ కల్చరల్ సెలబ్రేషన్‌లా మారింది.
నిజానికి ఇది స్థానిక వంటకంగా పేరుపొందినప్పటికీ పరాయి దేశం నుంచే మన దేశంలోకి ప్రవేశించింది. బిర్యానీ అన్న పదం ‘బిరింజ్ లేదా బిరియాన్’ అనే పర్షియన్ పదం నుంచి పుట్టినట్టు చెప్పుకుంటారు. దీని అర్థం వేయించటం. ఇక దీనిని మొఘల్ చక్రవర్తలు మన దేశానికి తీసుకొచ్చినట్లుగా చెబుతారు. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికులకు అధిక పోషకాలు అందించేందుకు ఈ వంటకాన్ని ఆహారంగా ఇచ్చేవారని చరిత్రకారులు చెబుతుంటారు. కాలక్రమేణ ప్రీతికరమైన వంటకంగా మారిపోయింది. అప్పుడు రాజరిక వంటగదుల్లో మొదలైన బిర్యానీ ప్రయాణం, ఈరోజు ప్రతి ఇంట్లో పండుగ వంటకంగా నిలిచింది.
ఎక్కడ పుట్టినా, బిర్యానీకి నిజమైన గుర్తింపు తెచ్చింది మాత్రం హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఏ ప్రాంతానికెళ్లినా 'హైదరాబాద్ బిర్యానీ ఉంది కదా?' అని అడిగే స్థాయికి చేరుకుంది. అంతేకాదు, లక్నో అవధీ బిర్యానీ, కోల్కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, ఆంబూర్ బిర్యానీ, సింధీ బిర్యానీ, దొడ్డు బిర్యానీలు కూడా తమ ప్రత్యేకతతో బిర్యానీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ప్రాంతం తమ రుచులకు అనుగుణంగా ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, శైలి వాడి బిర్యానీని ఓ కళలాంటిదిగా తీర్చిదిద్దింది. ఇవాళ బిర్యానీ అనే మాట వినగానే కడుపు కాదు, మనసే తొలుత ఆకలితో తడుస్తోంది!






