Missed call scams : ఒక్క మిస్డ్ కాల్.. మీ జీవితాన్నే నాశనం చేయొచ్చు!!

by Javid Pasha |
Missed call scams : ఒక్క మిస్డ్ కాల్.. మీ జీవితాన్నే నాశనం చేయొచ్చు!!
X

దిశ, ఫీచర్స్ :

ఒక్క మిస్డ్ కాల్.. మీలో కుతూహలం పెంచవచ్చు.

అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని కలిగించవచ్చు.

ఆ ఒక్క మిస్డ్ కాలే.. మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేయవచ్చు..

మరికొన్ని క్షణాల్లో మీలోని ఆనందమంతా ఆవిరైపోవచ్చు

జస్ట్ మిస్డ్ కాలే కదా అని రియాక్ట్ అయితే.. మీ అకౌంట్ హ్యాక్ కావచ్చు

పాపం కదా అని మాటలు కలిపితే చివరికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎదురు కావచ్చు

మిస్డ్ కాల్.. మిస్సమ్మలు, మిస్సయ్యలు మిమ్మల్ని నిలువునా ముంచవచ్చు.

డ్యూటీ నుంచి సాయంత్రం ఇంటికి రాగానే ఫోన్ చెక్ చేస్తే ఏదో మిస్డ్ కాల్.. జర్నీలో వినబడలేదే అనుకొని తిరిగి కాల్ చేసిన అతనికి అవతలి నుంచి ఓ స్వీట్ వాయిస్ ఆకర్షించింది. ఆ తర్వాత మరోసారి మిస్డ్ కాల్ వస్తే బాగుండని ఎదురు చూశాడు. రాకపోయే సరికి ఇంతకీ ఎవరా? అని ట్రూ కాలర్ ప్రొఫైల్ చెక్ చేశాడు. ఊరూ పేరూ తెలియని అందమైన అమ్మాయి అనిమాత్రం ఫిక్స్ అయ్యాడు. అలా ప్రతిరోజూ ఫోన్ చేశాడు. మాటలు కలిశాయి. ఆమె లవ్ ప్రపోజ్ చేసింది. ముక్కూ మొహం తెలియకపోయినా మనోడు పడిపోయాడు. కొన్నిరోజులయ్యాక.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, వ్యవహారం అంతా రికార్డ్ అయిందని, తను అడిగిన డబ్బులు పంపకపోతే పోలీసులకు కంప్లైట్ చేస్తానని అవతలి నుంచి హెచ్చరిక.. ఇంకేముంది అడిగినంత ఇచ్చుకొని ఊరుకున్నాడు.. ఒకటో రెండో కాదు. ఇలా రోజూ ఎన్నో జరుగుతున్నాయి. మిస్డ్ కాల్ మోసాలు..

హలో అంటూ దగ్గరై..

ఉదయం 11 గంటలు.. రోజూ లాగే ఆమె ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది. అంతలోనే గూటిలో చార్జింగ్ పెట్టిన ఫోన్ మోగడం ప్రారంభించింది. బిజీలో ఉన్నప్పటికీ ఏదో అర్జంట్ కాల్ అయ్యుండొచ్చునేమోనని భావించింది. కాల్ రిసీవ్ చేసుకుందామని ఫోన్ వద్దకు వెళ్లేసరికి అంతలోనే కట్.. చెక్ చేస్తే ఏదో కొత్త నంబర్. ఊరు, పేరు ఏదీ లేదు. ఏదో కంపెనీదో, కష్టమర్ కేర్‌దో అనుకుంది. తన పనిలో తాను మునిగిపోయింది.

సరిగ్గా 10 నిమిషాలు గడిచిందో లేదో మరోసారి టక్కుమని ఫోన్ రింగ్ అయి సైలెంట్ అయింది. ఆమె మళ్లీ ఫోన్ చెక్ చేసింది. సేమ్ నంబర్.. ఊరూ పేరూ లేని నంబర్. ఇంతకీ ఎవరూ? బ్యాలెన్స్ లేకపోవడంతో బంధువులెవరైనా మిస్డ్ కాల్ ఇచ్చారా? లేదా బయటకు వెళ్లిన తన భర్త ఎవరి ఫోన్తోనైనా మిస్డ్ కాల్ ఇస్తున్నాడా? ఎంతకైనా మంచిదని కాల్ చేసింది. హలో అనగానే.. అవతలి నుంచి ఏదో కొత్త స్వరం. వివరాలు తెలుసుకుంటే.. రాంగ్ నంబర్. తనకు ఎన్నడూ పరిచయం లేని వ్యక్తి.. ‘అయ్యో అనుకోకుండా మీకు వచ్చిందా?’ అన్నాడు. వరంగల్ జిల్లాలో కరీమాబాద్‌కు చెందిన ఓ వివాహిత జీవితంలో చోటు చేసుకున్న నిజ సంఘటన ఇది. 2023లో జరిగింది. ఆ వ్యక్తి నుంచి వచ్చిన ఒక్క మిస్ కాల్ ఆమె జీవితంలో పెను సమస్యగా మారింది. ఏం జరిగిందంటే..

ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన వ్యక్తి రోజూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. మాటా మాటా కలిపాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆడియో కాల్‌కు బదులు వీడియో కాల్స్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. కాగా వీడియో కాల్ చేసిన ప్రతీసారి థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా సదరు మహిళ ఫోన్‌లోని డేటాను తస్కరించాడు అవతలి వ్యక్తి. అనంతరం ఇద్దరూ మాట్లాడుకున్న పర్సనల్ విషయాలను ఆమెకు పంపుతూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ‘చెప్పినట్లు వినపోతే నీ భర్తకు, బంధువులకు వీటిని షేర్ చేస్తా’ అంటూ బెదిరిస్తూ ఆమెను లొంగదీసుకున్నాడు. చివరకు విషయం భర్తకు తెలియడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై, నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక్క మిస్డ్ కాల్ ఎంత పనిచేసింది? అన్యోన్య దాంపత్యాన్ని విడదీసింది. ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అది తెలియని వ్యక్తి నుంచి వచ్చిన కాల్ అని తెలిసినప్పుడే మాట్లాడటం ఆపివేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదేమో.. ఇలా కరీమాబాద్ మహిళ మాత్రమే కాదు.. అలాంటి మిస్డ్ కాల్ బాధితులు చాలామందే ఉంటున్నారని పోలీసులు సైతం చెబుతున్నారు. అప్పుడప్పుడూ జరుగుతున్న సంఘటనలు, మోసాలు కూడా మనకళ్లకు కడుతూనే ఉన్నాయి. అందుకే జర జాగ్రత్త.. ఒక్క మిస్డ్ కాల్ మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

హాయ్ అంటూ మెసేజ్.. ఆ తర్వాత..

ఆమె చదువుకోని మహిళ కూడా కాదు.. ఎంబీఏ చేస్తోంది. ఓ రోజు ఫోన్‌లో నిమగ్నమై ఉండగా.. సడెన్‌గా ‘హాయ్..’ అంటూ ఓ మెసేజ్. ఎవరో అనుకొని రిప్లయ్ ఇవ్వలేదు. ఇంకేముంది అవతలి వ్యక్తి ఆమె సోషల్ మీడియా అకౌంట్లను కూడా సెర్చ్ చేసినట్టున్నాడు. ఇన్‌స్టాలో మరోసారి హాయ్ అంటూ పలకరించాడు. పోనీలే ఈ ఒక్కసారికి అనుకుందేమో.. హలో అంటూ రిప్లయ్ ఇచ్చింది. అలా మొదలైన పరిచయం అక్కడితో ఆగలేదు. ఛాటింగ్స్.. కాల్స్ కొనసాగాయి. కొన్ని రోజులు గడిచాయి.. అంతలోనే అవతలి వ్యక్తి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నంటూ ప్రపోజ్ చేశాడు. నువ్వే కావాలన్నాడు. కాదంటే చచ్చిపోతానని అన్నాడు. ఎన్నడూ నేరుగా కలిసింది లేదు. ఫోన్‌లోనే ఇదంతా జరిగింది. అయినా ఆమె నమ్మేసింది. కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం కదా నిజమే అనుకుందేమో.. అవతలి వ్యక్తి ప్రజోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే అలా మాట్లాడుకునే సందర్భంలో ఆడియో, వీడియో కాల్స్ సదరు యువతికి తెలియకుండా రికార్డ్ చేసిన, ఆ యువకుడు ఓ రోజు తన నిజ స్వరూపం బయట పెట్టాడు. తనకు రూ. 25 వేలు వెంటనే ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి ఇలా అనేసరికి సదరు యువతి ఒక్కసారిగా షాక్ తిన్నది. చేసేది లేక రూ. 25 వేలు అతని అకౌంట్లో వేసింది. అంతటితో కథ ముగిసిపోలేదు. మరోసారి రూ. లక్ష డిమాండ్ చేశాడు. అప్పుడు అర్థమైంది ఆమెకు. తను మోసపోతున్నట్లు గ్రహించింది. విషయం పేరెంట్స్‌కు చెప్పింది. పోలీసులకు విచారణలో ఆ యువకుడు విజయ నగరం జిల్లాకు చెందిన నవీన్ అని తేలింది. అవును.. జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో పరిచయమై ప్రేమిస్తున్నానంటే.. ఎలా నమ్మేస్తారు? పైగా చదువుకున్నవాళ్లు కూడా ఇంత అమాయకంగా ఉంటారా? చదువురానివాళ్లు నయం కదా!

స్వీట్ వాయిస్ వినగానే..

ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న చరణ్‌ ఓ రోజు బిజీగా ఉన్నాడు. అంతలోనే మిస్డ్ కాల్. తిరిగి చేసేసరికి అమ్మాయి హలో అంది. మీ పేరు ఇదేనా అంటూ ఏదో పేరు అడిగింది. కాదన్నాడు అతను.. అయ్యో సర్ రాంగ్ నంబర్.. అయినా మీరెవరు సర్ అంటూ మాటలు కలిపేసింది. అసలే అమ్మాయి.. స్వీట్ వాయిస్. ఇవతల పెళ్లికాని అబ్బాయి. ఊరుకుంటాడా.. మరోసారి ఆమెకు కాల్ చేశాడు.. బక్రా దొరికాడు అనుకున్నట్లుంది. రెండుమూడుసార్లు తను బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చింది. మాట్లాడాలనిపిస్తే ఫలానా టైమ్‌లోనే కాల్ చేయాలని చెప్పింది. తను ఐటీ ఎంప్లాయినని, సాలరీ నెలకు రెండున్నర లక్షలని చెప్పింది. ఇంకేముంది.. చరణ్ బాగా కనెక్ట్ అయ్యాడు. వన్‌వీక్ మాట్లాడుకున్నాక ఓ రోజు ఆ అమ్మాయి సడెన్‌గా ఏడుస్తూ ఫోన్ చేసింది.. తనకు అర్జంటుగా లక్ష రూపాయలు కావాలని, తను బెంగుళూరులో ఉన్నానని చెప్పింది. తనవద్ద అకౌంట్లో డబ్బులున్నాయని, సాయంత్రం వరకు మళ్లీ తనకు ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పింది. ఇంకేముంది తనవద్ద ఉన్న రూ. 50 వేలకు మరో రూ. 50 వేలు స్నేహితులను, తెలిసిన వారిని అడిగి సర్దేశాడు చరణ్. సాయంత్రమైంది. అవతలి నుంచి కాల్ రాలేదు. బిజీలో ఉందేమో తర్వాత చేస్తుందని అనుకున్నాడు. అంతే ఇక.. ఆమె‌కు మళ్లీ కాల్ చేస్తే స్విచ్ఛాఫ్. అసలు ఆమె నంబర్ పనిచేయడం లేదు. తను మోసపోయానని అసలు విషయం గ్రహించాడు చరణ్. ఇలా ఒక్క మిస్డ్ కాల్‌తో కనెక్ట్ అయి తీయనైన మాటలకు పడిపోయి కొందరు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు లొంగిపోయి మరికొందరు మోసపోతూనే ఉన్నారు. ముందు మంచిగా మాట్లాడి ఆడియో, వీడియో కాల్స్ రిర్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే మరికొందరు ప్రేమిస్తున్నానంటూ కొంప ముంచేస్తున్నారు. జర జాగ్రత్త!

స్టాక్ కొంటే లాభాలంటూ..

అతను సికింద్రాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి. యూట్యూబ్‌లో షేర్లు, ఐపీవోల ప్రకటన కనిపించగానే ఇదేదో చూద్దామని క్లిక్ చేశాడు. తర్వాత అతని వాట్సాప్ నంబర్‌కు లింక్ వచ్చింది. ఓ మిస్డ్ కాల్ కూడా వచ్చింది. తిరిగి కాల్ చేస్తే.. అందులో చెప్పిన స్టాక్‌లు కొంటే.. మీకు మస్తు లాభం వస్తుందని చెప్పారు అవతలి వ్యక్తి. నమ్మకం లేకపోతే మేమే మీకు కొంత అమౌంట్ ముందుగానే ఇస్తామని, తర్వాత ఇవ్వండని సెంచ్ చేశారు కూడా.. దీంతో సదరు ఉద్యోగి నమ్మేశాడు. కాగా స్టాక్‌లు కొనేముందు రూ. 80 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు అవతలి వ్యక్తి. అలా ఇతను రూ. 80 లక్షలు డిపాజిట్ చేయగానే రూ. 64 కోట్ల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు అవతలి వ్యక్తులు. విత్ డ్రా మాత్రం సాధ్యం కాలేదు. చివరికి మోసపోయినట్లు తెలిసింది. మరో సంఘటనలో మిస్డ్ కాల్ ఇచ్చిన వ్యక్తి మాటలు నమ్మి తన అకౌంట్లో నుంచి రూ. 92. 10 లక్షలు పోగొట్టున్నాడో వ్యక్తి. ఇలా సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో పొంచి ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే అంత ఈజీగా నమ్మేసి లింక్‌లపై క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.

గుర్తు తెలియని నంబర్లతో జాగ్రత్త

ఒకటో రెండో కాదు, ఈ మధ్య మిస్డ్ కాల్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. వీటికి స్పందించి మాటలు కలిపిన వారు ప్రేమ పేరుతో ఇవతలి వ్యక్తులను లోబర్చుకొని, చివరికి డబ్బులు డిమాండ్ చేస్తూ మోసం చేస్తుంటే.. మరి కొందరు ఏవేవో లింక్స్ పంపి వాటిపై క్లిక్ చేయాలని సూచిస్తూ దోచుకుంటున్నారు. అందుకే మిస్డ్ కాల్ రాగానే తిరిగి కాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. ఒకవేళ చేసినా విషయం తెలుసుకొని మరోసారి స్పందించకపోవడం, అవతలి వ్యక్తి ఫలానా లింక్ క్లిక్ చేయాలని చెప్పినప్పుడు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. కొన్నిసార్లు రిటర్న్ కాల్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ అవుతున్న సంఘటనలు ఇటీవల చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ కోడ్ + 91తో కాకుండా + 255, +371 సహా ఇంటర్నేషనల్ (ఐఎస్‌డీ) కాల్స్ వస్తే అప్రమత్తం అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అట్లనే వర్చువల్ మిస్డ్ కాల్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed