- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ రోబోలతో స్వచ్ఛమైన సముద్ర తీరాలు.. అద్భుతాలు చేస్తున్న ఆ సాంకేతికత
ఆటోనమస్ ఎలక్ట్రిక్ బీచ్ క్లీనింగ్ మెషీన్లు లేదా రోబోలు స్వయం చాలకంగా పనిచేస్తాయి. దుబాయ్‌లో రాత్రి సమయంలో బీచ్‌లను క్లీన్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : చెరువుగట్లు, నదీ తీరాలు, సముద్ర తీరాలు, స్విమ్మింగ్ పూల్ పరిసరాలు చూడ్డానికి అందంగా ఉంటాయి. అయితే సందర్శకులు, పర్యాటకుల తాకిడితో అవి చెత్తా చెదారంతో నిండిపోతుంటాయి కూడా. దానిని తొలగించడానికి ఎంతోమంది వర్కర్లు ప్రతిరోజూ కష్టపడుతుంటారు. కొన్నిచోట్ల యంత్రాలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బీచ్‌ల సంరక్షణలో పరిశుభ్రత చాలా ముఖ్యం. అయితే ఈ సమస్యకు దుబాయ్ సాంకేతిక నిపుణులు మరో అద్భుతమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చారు. సముద్ర తీరాలను శుభ్రంగా, అందంగా ఉంచడానికి అత్యాధునిక ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ బీచ్ క్లీనింగ్ మెషీన్లను(autonomous electric beach-cleaning robots) అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవెలా పనిచేస్తాయి? ఉపయోగాలేమిటో చూద్దాం పదండి!
కాలుష్యం లేకుండా..
ఆటోనమస్ ఎలక్ట్రిక్ బీచ్ క్లీనింగ్ మెషీన్లు లేదా రోబోలు(autonomous electric beach-cleaning robots) స్వయం చాలకంగా పనిచేస్తాయి. రాత్రి సమయంలో బీచ్‌లను క్లీన్ చేయడానికి దుబాయ్ దేశంలో ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి వాటిని ఆన్ చేసి వదిలిపెడితే చాలు.. ఈ యంత్రాలు రాత్రంతా నడిచి, పగటిపూట నివాసితులు, పర్యాటకులు లేదా వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీచ్‌ను శుభ్రం చేస్తాయి. అలాగే రాత్రిళ్లు పనిచేయడం వల్ల నగరం నిద్రపోయినప్పుడు శుభ్రత పూర్తయిపోతుంది. ఉదయానికి పూర్తిగా స్వచ్ఛమైన సముద్ర తీరం అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్‌లతో పని చేసే ఈ ఆటోనమస్ మెషీన్లు ఇసుకపై ఈజీగా కదులుతూ.. ప్లాస్టిక్, గాజు ముక్కలు, సిగరెట్ ముక్కలు, ఇంకా ఇతర చెత్తను సెన్సార్ల ద్వారా గుర్తించి సేకరిస్తాయి. పైగా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తాయి కాబట్టి ఈ మెషీన్లు కాలుష్యాన్ని కూడా విడుదల చేయవు. నిరంతరంగా క్లీనింగ్‌ను మేనేజ్ చేస్తుంటాయి.
క్లీన్ ఎనర్జీ టెక్నాలజీతో..
అయితే దుబాయ్ ఈ ప్రాజెక్ట్‌ను తన స్మార్ట్ సిటీ విజన్‌లో భాగంగా అమలు చూస్తోంది. ఆటోమేషన్, క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ ద్వారా రోజువారీ సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎక్కువగా టూరిజం మీదనే ఆధారపడిన ఆ నగరంలో బీచ్ శుభ్రత అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఈ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. అలాగే రాత్రి సమయంలో శుభ్రత చేయడం వల్ల సముద్ర జీవులు, తాబేళ్లు గుడ్లు పెట్టే సమయాలు, పక్షుల నెస్టింగ్ ప్యాటర్న్‌లపై కూడా ఎలాంటి ఒత్తిడి, ప్రభావం పడదు. పర్యావరణానికి కూడా నష్టం జరగదు. దుబాయ్ స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్‌లో భాగంగా స్థానికంగా డెవలప్ చేసిన లేదా కస్టమైజ్ చేసిన ఈ ఆటోనమస్ ఎలక్ట్రిక్ బీచ్ క్లీనింగ్ మెషీన్లు లేదా రోబోట్‌లుగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే అద్భుతమే ఇక.






