ఇదేందిరా మావా.. జంతు రక్షణకు మనుషులు చేయలేని పని ఏఐ చేస్తోంది.!

by Daayi Srishailam |

వేటగాళ్లను తక్షణమే గుర్తించి, అధికారులకు హెచ్చరికలు పంపే ఒక స్మార్ట్ సిస్టమ్

ఇదేందిరా మావా.. జంతు రక్షణకు మనుషులు చేయలేని పని ఏఐ చేస్తోంది.!
X

దట్టమైన అడవుల్లో ఏనుగులు, పులులు దర్జాగా ఉంటాయి. కానీ అక్రమ వేట వల్ల వన్యప్రాణులు, అడవి చుట్టూ అల్లుకున్న అందమైన జీవితాలూ ప్రమాదంలోకి నెట్టేయబడ్డాయి. గతంలో అటవీ సిబ్బంది అంకితభావంతో పనిచేసి జీవవైవిధ్యాన్ని కాపాడేది. ఇప్పుడా పరిస్థితుల్లేవు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత కెమెరాలు, డ్రోన్‌‌‌లు, స్మార్ట్ యాప్స్ ఈ అక్రమ వేటను నిరోధిస్తూ మానవ- వన్యప్రాణి సంఘర్షణను తగ్గిస్తు్న్నాయి.

- దిశ, ఫీచర్స్

ట్రైల్‌గార్డ్ ఏఐ

ఇది వేటగాళ్లను తక్షణమే గుర్తించి, అధికారులకు హెచ్చరికలు పంపే ఒక స్మార్ట్ కెమెరా సిస్టమ్. సిమిలిపాల్, కాన్హా-పెంచ్, దుధ్వా వంటి పులుల సంరక్షణ క్షేత్రాలలో ఈ సిస్టంను ఇన్‌స్టాల్ చేశారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో 100-150 కెమెరా యూనిట్లను ఉపయోగించి 10 నెలల్లో 96 మంది వేటగాళ్లను పట్టుకున్నారు. 86 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ట్రైల్ గార్డ్ ఏఐ వాడకం ద్వారా జంతువేట సంఘటనలు 80% వరకు తగ్గాయి.

ఎలా పనిచేస్తుంది.?

ట్రైల్‌గార్డ్ ఏఐ కెమెరాలు చిన్న పెన్ సైజు ఇమేజింగ్ యూనిట్, నోట్‌ప్యాడ్ సైజు బ్యాటరీతో రూపొందించబడ్డాయి. ఏదైనా కదలికను గుర్తించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి, పులి, ఏనుగు, వాహనాలను వర్గీకరిస్తాయి. 30-40 సెకన్లలో ఫోటోలను సెల్యులార్ లేదా శాటిలైట్ ద్వారా కంట్రోల్ సెంటర్, వాట్సాప్ గ్రూప్‌లు, రేడియో ఛానెల్‌లకు పంపుతాయి. అటవీ సిబ్బంది అలర్టయి వేటగాళ్లను పట్టుకుంటారు.

హాక్ యాప్

ఇది స్మార్ట్ నివేదికలు సమర్పించే అధునాతన అనువర్తనం. హాక్ అంటే హాసిల్ యాక్టివిటీ వాచ్ కెర్నెల్. లెపర్డ్ టెక్ ల్యాబ్స్, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీనిని డెవలప్ చేశాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు అటవీ శాఖల్లో ఈ సిస్టం ఉపయోగంలో ఉంది. కాగితం ఆధారిత రికార్డులు భర్తీ చేస్తూ వన్యప్రాణి నేరాలను నమోదు చేయడాన్ని తగ్గిస్తుంది.

ఎలా పనిచేస్తుంది.?

ఈ యాప్ జీపీఎస్ ఆధారంగా గస్తీలను పర్యవేక్షిస్తుంది. అటవీ అధికారులు సంఘటనలను దీని ద్వారా నమోదు చేస్తారు. ఈ యాప్‌లో డిజిటల్ ఇంటెలిజెన్స్ కోసం సైబర్‌హాక్, పాముల వంటి రెస్క్యూ కోసం సర్ప, ఏనుగుల కదలికల కోసం జంబో రాడార్, వర్షపాతం ఆధారంగా వచ్చే హెచ్చరికల కోసం వైల్డ్‌వాచ్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ డేటాతో నేరాల ధోరణులను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటారు.

వన్‌నేత్ర

ఇది కెమెరా ట్రాప్ డేటాను ఏఐతో సార్టింగ్ చేస్తుంది. వన్‌నేత్ర అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత వేదిక. ఇది కెమెరా ట్రాప్‌ల నుంచి లక్షలాది చిత్రాలను స్వయంచాలకంగా విశ్లేషిస్తుంది. వివిధ వన్యప్రాణి జాతులను గుర్తిస్తూ, జీవవైవిధ్య పర్యవేక్షణను వేగవంతం చేస్తుంది. అక్రమ వేటకు సంబంధించిన అసాధారణ కార్యకలాపాలను గుర్తిస్తుంది.

ఎలా పనిచేస్తుంది.?

అమరాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల నుంచి కెమెరా ట్రాప్ ఫోటోలు వన్‌నేత్రకు అప్‌లోడ్ చేయబడతాయి. ఏఐ అల్గారిథమ్‌లు ఈ చిత్రాలను జాతుల వారీగా వర్గీకరిస్తాయి. అటవీ సిబ్బంది ప్రతి చిత్రాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని తొలగిస్తాయి. ఒక వారం పైలట్ ప్రాజెక్ట్‌లో ఈ వ్యవస్థ అటవీ సిబ్బంది గస్తీ నిర్వహించే అవసరం లేకుండానే 40 లక్షల చిత్రాలను విశ్లేషించి, జాతుల ఉనికిని, వాటికి పొంచివున్న ముప్పు ప్రాంతాలను గుర్తించింది.

ఆపరేషన్ శికార్

డిజిటల్ ఫోరెన్సిక్స్‌తో దంతాల స్మగ్లింగ్‌ను అరికట్టడంలో పనిచేస్తుంది. కేరళ అటవీ శాఖ, వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జరిగిన దంతాల స్మగ్లింగ్ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఇది. డిజిటల్ ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విశ్లేషణను ఉపయోగించి 72 మందిని అరెస్టు చేసి, 487 కిలోల దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎలా పనిచేస్తుంది.?

కాగితం ఆధారిత ఇంటెలిజెన్స్‌ను డిజిటల్ డేటాబేస్‌లుగా మార్చి కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, లావాదేవీల ట్రయిల్స్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా గుర్తిస్తారు.

డ్రోన్ ఆపరేషన్

తమిళనాడు, కేరళలో డ్రోన్ల ద్వారా వేటగాళ్లు నిరోధించడంలో సహాయపడుతోంది. అటవీ శ్రేణులలో ఏనుగు కదలికలను పర్యవేక్షించడం, అగ్నిప్రమాదాలను గుర్తించడం, అక్రమ వేటగాళ్లను నిరోధించడానికి వీటిని వాడుతున్నారు. అటవీ సిబ్బందితో 20 రోజులు పట్టే గస్తీ అర్ధ రోజులోనే పూర్తవుతున్నాయి.

ఎలా పనిచేస్తుంది.?

ఈ డ్రోన్‌లు 48 మెగాపిక్సెల్ కెమెరాలు, థర్మల్ సెన్సార్‌లు, జీపీఎస్ ట్రాకర్‌లు, లేజర్-రేంజ్ ఫైండర్‌లు, సెర్చ్‌లైట్‌లు, లౌడ్‌స్పీకర్‌లతో అమర్చబడి ఉంటాయి. వన్యప్రాణులు లేదా అగ్నిప్రమాదాలను గుర్తించినప్పుడు అటవీ సిబ్బందికి, సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేస్తాయి.

Next Story