- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకకాలంలో.. సైక్లింగ్.. ట్రెక్కింగ్.. మారథాన్.!
అత్యధిక ఎత్తులో నిర్వహించే టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్‌ను పూర్తి చేయడం వంటి సవాళ్లను విజయవంతంగా సాధించాడు

దిశ, ఫీచర్స్: త్రిపురకు చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరిత్రా రాయ్ బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూనే ట్రైయాథ్లాన్‌ను పూర్తిచేశాడు. అగర్తల నుంచి నేపాల్ వరకు సైకిల్ తొక్కడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం.. ఆ తర్వాత అత్యధిక ఎత్తులో నిర్వహించే టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్‌ను పూర్తి చేయడం వంటి సవాళ్లను విజయవంతంగా సాధించాడు.
మనమెందుకు సాధించొద్దు.?
అరిత్రా రాయ్‌కు సాహస క్రీడలంటే ఆసక్తి. అగర్తలలో పెరిగిన తనకు చిన్నప్పట్నుంచే శారీరక శ్రమపై అవగాహన ఉంది. రన్నింగ్, సైక్లింగ్, ఈత ఇవన్నీ తన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. 2020లో లాక్‌డౌన్ కారణంగా కొన్ని రకాల శిక్షణలు తీసుకున్నాడు. మారథాన్‌లు, ఓపెన్-వాటర్ ఈత, ట్రైయాథ్లాన్‌లలో పాల్గొన్నాడు. ఒకరోజు ఇంటర్నెట్‌లో స్క్రోల్ చేస్తుండగా ఒక స్వీడిష్ అథ్లెట్ నేపాల్‌కు సైకిల్ తొక్కి, ఎవరెస్ట్‌ను అధిరోహించి, తిరిగి సైకిల్‌పైనే వెళ్లిన కథనం కనిపించింది. అతను చేయగలిగితే, నేనెందుకు చేయలేను? ఇలాంటి ఘనత మనమెందుకు సాధించకూడదు? అని ఆలోచించాడు.
ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని..
ఎందుకు చేయలేం అనే ఆలోచన అరిత్రా రాయ్‌ని లక్ష్యం వైపు నడిపించింది. ఎవరెస్ట్‌ను అధిరోహించి, అగర్తల నుంచి నేపాల్‌కు సైకిల్‌పై ప్రయాణించి, టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్‌ను పూర్తి చేయాలని సంకల్పించాడు. 2024 మార్చి 16న తన సైకిల్ యాత్రను అగర్తల నుంచి మొదలుపెట్టాడు. 21 రోజుల యాత్ర అది. 14 రోజులు సైక్లింగ్‌తో సహా 1200 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాడు. రోజుకు 80-100 కిలో మీటర్లు సైకిల్ తొక్కేవాడు. ఎండ, రోడ్ల పరిస్థితులు, సైకిల్ సమస్యలెన్ని ఉన్నా తన లక్ష్యసాధనతో త్రిపురను ప్రపంచస్థాయిలో నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగాడు.
మొదటి వ్యక్తి..
నేపాల్ చేరుకున్న తర్వాత అరిత్రా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌కు సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 29, 2024న తన శిఖర యాత్రను ప్రారంభించాడు. ఖుంబు ఐస్‌ఫాల్, సన్నని గాలి, శీతల రాత్రులు వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మే 21, 2024 తెల్లవారుజామున 4 గంటలకు 8848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. చీకటి కమ్ముకుని ఉంది. అతడి శ్వాస, గుండె చప్పుడు, మంచు కిర్రుమనే శబ్దం మాత్రమే వినిపించాయి. భారత జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకుని తన త్రిపుర నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
భార్య గైడెన్స్..
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కొన్ని రోజుల తర్వాత 17500 అడుగుల ఎత్తులో 42.2 కిలో మీటర్ల దూరంలోని టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్‌ను పూర్తి చేశాడు. శిఖరం ఎక్కిన తర్వాత ఈ మారథాన్ చేయడం చాలా కష్టం. శరీరం అలసిపోయినా.. మానసిక స్థయిర్యం అరిత్రా ముందుకు నడిపించింది. అరిత్రా విజయంలో తన భార్య అషిర్బానీ కీలక పాత్ర పోషించింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య, పర్సనల్ లోన్ తీసుకుని, సేవింగ్స్‌తో ఈ యాత్రను సాధ్యం చేశారు. అతని జీపీఎస్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ లక్ష్యం దారితప్పకుండా పర్యవేక్షించేది. తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే అరిత్ర ఈ ఘనత సాధించడం నిజంగా గ్రేట్.






