హరాస్‌మెంట్‌కు అడ్డుకట్టవేసే జటాయువు.. ఓ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ వినూత్న ఆలోచన!

by Javid Pasha |

జటాయువు అనే ఏఐ స్టార్టప్ కేవలం లాభాపేక్ష సంస్థ కాదు. సామాజిక బాధ్యతలో భాగం అంటారు దాని వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వికా త్రిషా కుమార్.

హరాస్‌మెంట్‌కు అడ్డుకట్టవేసే జటాయువు.. ఓ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ వినూత్న ఆలోచన!
X

దిశ, ఫీచర్స్ : వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యక్తులపై వేధింపులకు సంబంధించిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిలో చాలా వరకు కేసుల్లో సాక్ష్యాధారాలు లేక వీగిపోతుంటాయి. అలాంటి పరిస్థితికి చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది బెంగుళూరుకు చెందిన అద్వికా త్రిషాకుమార్ (Advika Trisha Kumar) అనే ఓమహిళ. ముఖ్యంగా హరాస్‌మెంట్ కేసుల్లో ఆయా సంస్థల లేదా యాజమాన్యాల చేతుల్లో ఎవిడెన్స్ చిక్కుకోకుండా, లేదా వారు తొలగించకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా జటాయు (Jatayu) అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుంది? బాధితులకు ఎలాంటి భరోసానిస్తుంది? తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.

జటాయువు అనే ఏఐ స్టార్టప్ కేవలం లాభాపేక్ష సంస్థ కాదు. సామాజిక బాధ్యతలో భాగం అంటారు ఎంటర్‌ప్రెన్యూర్, ఇండియన్ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ కొత్త తరం వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వికా త్రిషా కుమార్. జటాయువు సంస్థ ఒక ప్రత్యేక సురక్షిత సాఫ్ట్‌వేర్‌ను సీసీటీవీ (CCTV) సిస్టమ్‌లలో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఆయా సంస్థల్లో, కార్యాలయాల్లో, నిర్దేశించిన ప్రదేశాల్లో స్త్రీ, పురుషులపట్ల జరిగే తప్పుడు ప్రవర్తనలను రియల్ టైమ్‌లో గుర్తిస్తుంది. అంతేకాదు ఇందులోని సాంకేతికత, సందేహాస్పద కార్యలాపాలను గుర్తించినప్పుడు సిస్టమ్ అలర్ట్‌ను ట్రిగర్ చేసి, ఎన్‌క్రిప్టెడ్ ఫుటేజ్‌ను నేరుగా రక్షిత యూజర్ ప్రొఫైల్స్‌లో సురక్షితం చేస్తుంది. ఈ టెక్నాలజీ సాక్ష్యాలను సురక్షితంగా ఉంచడం ద్వారా బాధితులకు న్యాయం చేసే అవకాశాన్ని పెంచుతుంది. ముఖ్యంగా హరాస్‌మెంట్ విషయాల్లో ఎవిడెన్స్‌ను ఆయా సంస్థలు లేదా అధికారులు డిలీట్ చేయకుండా, నియంత్రించకుండా కట్టడి చేయడం ద్వారా రక్షిస్తుంది. ‘టెక్నాలజీ అధికారాన్ని కాకుండా సత్యాన్ని రక్షించాలనే’ లక్ష్యంతో తమ జటాయువు సంస్థ పనిచేస్తుందని అద్వికా త్రిషా కుమార్ అంటున్నారు. కార్యాలయాలే కాకుండా విద్యా సంస్థలు, పబ్లిక్ ప్లేస్‌లలో కూడా ‘జటాయువు’ సంస్థ ప్రజలపై వేధింపులకు సంబంధించిన ఎవిడెన్స్‌ను సురక్షితంగా భద్రపర్చడంలో, న్యాయపరంగా సహకరించడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొంటున్నారు.

Next Story