- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ భూమి పీఓబీ లిస్ట్‌లో ఉందా?
మీ భూమి.. నిషేధిత జాబితాలో ఉందా?.. పీఓబీ లిస్ట్‌లో ఉంటే కష్టాలు షురూ.. సర్కార్‌ది కాదని నిరూపించాలంటే ముప్పతిప్పలు పడాల్సిందే..

దిశ, తెలంగాణ బ్యూరో: లక్షలు, కోట్లు పోసి భూమిని కొనుగోలు చేశారా? డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అధికారిక రికార్డుల్లో మీ పేరే ఉందా? లేదా? పరిశీలించండి. అక్కడ కూడా మీ పేరిటే ఉన్నా నమ్మొద్దు. ల్యాండ్ క్లాసిఫికేషన్ కరెక్టుగానే ఉందా? పట్టా భూమి అని ఉందా? లేదంటే అసైన్డ్, సర్కారీ, గైరాన్, శివాయి జమ్దారీ.. ఇలా రకరకాల పేర్లు ఏమైనా ఎంట్రీ చేశారా? ల్యాండ్ స్టేటస్‌లో ప్రొహిబిటెడ్ అని ఏం లేదు కదా? ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. 50, 60 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి.. తరతరాలుగా మీరు అనుభవిస్తున్న భూమి అయినా సరే.. వాటిని ప్రభుత్వ భూమి అంటూ పీవోబీ జాబితా(నిషేదిత భూముల జాబితా)లో నమోదు చేస్తున్నారు. 70 ఏండ్లుగా పట్టా భూమి అయినప్పటికీ సేత్వార్, ఖాస్రా పహానీ అంటూ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌కి విరుద్ధంగా నిషేదిత జాబితాలో పెడుతున్నారు. ఇది తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్లు చేస్తున్న అనాలోచిత నిర్ణయం. కరెక్టుగా అడిగితే అంటే నిలదీస్తే సీసీఎల్ఏ గైడ్ లైన్స్ ప్రకారం సేత్వార్, ఖాస్రా పహానీలు చూసి క్లాసిఫికేషన్ నిర్ధారించమని చెప్పారని బదులు ఇస్తున్నారు. లక్షలు పోసి స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు చూపించినా ఒక్కో సారి పనులు కావడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? న్యాయం ఎలా పొందాలి?
షాక్‌కు గురి చేసే ఇష్యూ
1990, 2000లకు ముందు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూములను కూడా ప్రస్తుతం నిషేదిత జాబితాలో నమోదు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ వారి ప్రాపర్టీ.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు అధికారిక వెబ్ సైట్ భూ భారతి (bhubharati.telangana.gov.in), స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్(registration.telangana.gov.in)లో సెర్చ్ చేసుకోవాలి. మీ ప్రాపర్టీని సెక్షన్ 22A కింద నమోదు చేసినట్లుగా కనిపిస్తే చిక్కులు తప్పవు. ఇక మళ్లీ మీ భూమి హక్కులు పొందాలంటే ఏండ్లు తిరగాల్సిందే. తెలంగాణ, ఏపీలో చాలా మంది భూమి కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్తే అది 22A జాబితాలో ఉందని తెలిసి షాక్ అవుతున్నారు. అసలు ఈ 22A అంటే ఏమిటి? మీ భూమిని ఆ జాబితా నుంచి ఎలా తొలగించుకోవాలి? అనే విషయాలపై అవగాహన లేకుండా ప్రాపర్టీస్ కొనాలంటే దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది.
నిషేధిత జాబితా అంటే..
1. సెక్షన్ 22A (రిజిస్ట్రేషన్ల చట్టం): ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు లేదా వివాదాల్లో ఉన్న భూములను ఎవరూ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం ఒక నిషేధిత జాబితాను రూపొందిస్తుంది. దీనినే ‘22A జాబితా' అంటారు.
2. మీ భూమి పొరపాటున ఈ జాబితాలోకి వస్తే: కొన్ని సార్లు పట్టా భూములు, పాత కాలం నాటి కొనుగోలు భూములు కూడా పొరపాటున ఈ జాబితాలో చేరవచ్చు. అలాంటి సమయంలో ఆ భూమిని అమ్ముకోవడానికి లేదా బ్యాంక్ లోన్ పొందడానికి వీలుండదు. దీనిపై చట్టపరంగా పోరాడాల్సిందే.
3. పరిష్కారం: మీ భూమి పట్టా భూమి అని, ప్రభుత్వ భూమి కాదని నిరూపించే ఆధారాలు, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, పహానీలు సమర్పించాలి. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని భూ భారతి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
4. పహానీలు పొందాలంటే: గతంలో ఆన్ లైన్ వ్యవస్థ లేనప్పుడు మాన్యువల్‌గా పహానీలు ఇచ్చేవారు. ఇప్పుడా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏ సంవత్సరం పహానీ కావాలన్నా అధికారులను, రెవెన్యూ సిబ్బందిని వేడుకోవాలి. లేదంటే సమాచార హక్కు చట్టం ద్వారా పహానీలు పొందడం తప్ప మరో మార్గం లేదు. మీ భూమి పాత రికార్డుల్లో ఎలా ఉందో మీరే నిరూపించాలి. పాత రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయొచ్చు. కానీ ఇప్పుడంత ఔదార్యం కలిగిన తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎవరైతే బాధితులో వారే అది ప్రభుత్వ భూమి కాదు.. పట్టా భూమి అని అధికారిక రికార్డుల ద్వారా నిరూపించాలి.
5. విచారణ: మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతారు. నిజానికి క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం లేదు. ఇదంతా రికార్డుల ద్వారా చోటు చేసుకున్న తప్పిదాలు. కానీ కొందరు అధికారులు విచారణ పేరిట దరఖాస్తుదారుడిని తిప్పించుకునే వ్యూహాత్మక నిర్ణయంగా క్షేత్ర స్థాయి విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత అది ప్రభుత్వ భూమి కాదని తేలితే కలెక్టర్ ఆ భూమిని 22A నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు జారీ చేస్తారు.
6. కోర్టును ఆశ్రయించే హక్కు: ఒక వేళ కలెక్టర్ స్థాయిలో మీ దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. సరైన ఆధారాలు ఉంటే కోర్టు మీ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశిస్తుంది. అయితే ఇది సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉంది.






