Feel The Jail : మీకు జైలు జీవితం ఆస్వాదించాలనుందా?

by Sujitha Rachapalli |

జైలు జీవితం అంటే కేవలం నాలుగు గోడలు కాదు. అది చేసిన నేరానికి బంధించబడిన జీవితం. నియమాలకు పరిమితమైన రోజులు. కుటుంబానికి దూరమైన బాధ.

Feel The Jail : మీకు జైలు జీవితం ఆస్వాదించాలనుందా?
X

దిశ, ఫీచర్స్ : జైలు జీవితం అంటే కేవలం నాలుగు గోడలు కాదు. అది చేసిన నేరానికి బంధించబడిన జీవితం. నియమాలకు పరిమితమైన రోజులు. కుటుంబానికి దూరమైన బాధ. ప్రతి క్షణం పశ్చాత్తాపంతో నిండిన మనసు. క్షణికావేశంలో చేసిన తప్పుతో కళ్ల ముందు ఉన్న ప్రపంచం ఒక్కసారిగా ఇనుప తలుపుల వెనుకకు జారిపోతుంది. చేతులకు సంకెళ్లు, హృదయంలో పశ్చాత్తాపం, కుటుంబానికి కన్నీళ్లు, జీవితానికి చీకట్లు. స్వేచ్ఛను కోల్పోయిన తర్వాత జీవితం ఎంత కఠినమో, నేరం ఫలితం ఎంత భయంకరమో ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న అరుదైన చైతన్య వేదికే తెలంగాణ జైలు మ్యూజియం.

సాధారణంగా మ్యూజియం అనగానే చరిత్ర గుర్తుకు వస్తుంది. కానీ చంచల్‌ గూడ జైలు మ్యూజియం చరిత్రను మాత్రమే కాదు.. జీవిత సత్యాన్ని చూపిస్తోంది. “స్వేచ్ఛే నిజమైన సంపద” అని గుండెల్లో ముద్ర వేసే ఈ ప్రత్యేక కేంద్రం యువతకు మార్గదర్శకంగా, సమాజానికి హెచ్చరికగా, చట్టం పట్ల గౌరవాన్ని పెంపొందించే విలువైన విద్యా వేదికగా నిలుస్తోంది. అయితే నేరాలకు పాల్పడే వారికి జైలు జీవితం సాధారణమే అయినప్పటికీ కామన్ పీపుల్‌కు జైలు లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. సినిమాల్లో చూసి ఇలా ఉంటుందా అనుకోవడం తప్పితే.. నిజంగా జైలు లోపల ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వారి కోసం చంచల్ గూడ జైలు అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు చెల్లిస్తే ఒక రోజు ఖైదీగా జైలు జీవితం అనుభవించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో చాలా ఉంది ఉత్సాహంతో ముందుకు వస్తుండడంతో ‘ఫీల్ ద జైల్’ అనే అధికారుల ప్రయత్నానికి పాజిటివ్ టాక్ వస్తోంది.

మ్యూజియం కాదు… జీవితాన్ని మార్చే సంస్కరణాలయం

ఇటీవల తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించిన ఈ మ్యూజియం.. జైలు అనేది కేవలం శిక్షించే స్థలం కాదని.. తప్పు చేసిన వ్యక్తిని తిరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చిదిద్దే సంస్కరణాలయమని చాటి చెబుతోంది. తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం.. శిక్ష నుంచి సంస్కరణ వరకు సాగిన దిద్దుబాటు వ్యవస్థ పరిణామాన్ని సమగ్రంగా పరిచయం చేస్తోంది. ఉగ్రవాదులు, అత్యంత ప్రమాదకర నిందితుల కోసం ఉపయోగించే హైసెక్యూరిటీ జోన్.. మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 24 గంటల సీసీ కెమెరా నిఘా, ప్రత్యేక భద్రత, జైలర్ పర్యవేక్షణ గది, విచారణ గది వంటి ఏర్పాట్లు జైళ్లలో అమలయ్యే కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ప్రతిబింబిస్తున్నాయి.

‘ఫీల్ ది జైల్’ టారిఫ్‌లు

‘ఫీల్ ద జైల్’లో సాధారణ ప్రజలు స్వయంగా ఖైదీలా జీవించే అవకాశం పొందుతారు. ఇందుకోసం రూ.1,000 (12 గంటలు), రూ.1500 (24 గంటలు) చెల్లించాలి. జైలు లోపల ఖైదీ దుస్తులు ధరించాలి. జైలు భోజనం చేయాలి. బ్యారక్‌లోనే గడపాలి. జైలు నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ప్రత్యేక ఆకర్షణగా ఉరి విభాగం…

మరణశిక్ష చరిత్ర, అమలు విధానం, న్యాయ వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన ‘ఉరి’ విభాగం సందర్శకులను లోతుగా ఆలోచింపజేస్తుంది. శిక్ష వెనుక ఉన్న న్యాయ తత్వాన్ని ఈ విభాగం స్పష్టంగా తెలియజేస్తుంది. ఖైదీలలో దాగి ఉన్న ప్రతిభకు వేదికగా పెయింటింగ్స్ గ్యాలరీ నిలుస్తోంది. ఖైదీలు, విద్యార్థులు రూపొందించిన చిత్రాలు పశ్చాత్తాపం, ఆశ, మార్పు, ఆత్మ పరిశీలన వంటి భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.

ఐదు ప్రధాన విభాగాలుగా మ్యూజియం ...

జైలు మ్యూజియంను ఐదు ప్రధాన విభాగాలుగా రూపొందించారు. ఇందులో 1. జైలు చరిత్ర, 2. కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, 3. పాతకాలపు జైళ్లు-శిక్షలు, 4. శిక్షాత్మక వ్యవస్థ నుంచి సంస్కరణ దిశగా, 5. యంత్రాలు-జైలు పని వంటివి ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తే నేరాల దుష్పరిణామాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవడం, చట్టాన్ని గౌరవించడం, స్వేచ్ఛను సంరక్షించడం ఎంత ముఖ్యమో నేర్చుకుంటారు.

ఒక రోజు జైలు కోసం ఏం చేయాలి ...

ఒకరోజు జైలు జీవితం గడపాలనుకునే వారు 94946 32046 ఫోన్ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ-మెయిల్: [email protected], వెబ్‌సైట్: Telangana Jail Experience ద్వారా కూడా మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.

మార్పు కోసం ....

చెడు వ్యసనాలకు బానిసలై తప్పుడు మార్గంలో నడిచే యువత శిక్షను సంస్కరణగా, ఖైదీని మంచి పౌరుడిగా మార్చే లక్ష్యంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. చంచల్‌ గూడ సెంట్రల్ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ జైలు మ్యూజియం, నేరం చేసిన ఒక్క తప్పు జీవితాన్ని ఎలా చీకటిలోకి నెడుతుందో కళ్లకు కట్టినట్లు చూపించడంతో, యువతలో చట్టం పట్ల గౌరవం, స్వేచ్ఛ విలువలు తెలిసేలా చేస్తున్నాయి. అంతేకాకుండా శిక్ష పూర్తి చేసుకుని సమాజంలోకి తిరిగి వచ్చే మాజీ ఖైదీలకు, వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం రుణ సదుపాయాలు, పెట్రోల్ బంకులు సహా వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తూ.. ‘ఒక్క తప్పు జీవితాన్ని మార్చినా… ఒక అవకాశం జీవితాన్ని మళ్లీ నిలబెడుతుంది’ అనే నమ్మకంతో వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాం.

- తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా

Next Story