- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్ ఊర్జా.. గిరిజనుల బతుకులు దర్జా
"మిషన్ ఊర్జా" ప్రాజెక్టుతో కొత్త ఆశ చిగురించేలా చేశాడు.

పూణెకు కేవలం 55 కిలోమీటర్ల దూరం.
ముల్షీ తాలుకాలోని "వలని" గ్రామం.
కనీస సౌకర్యాల్లేవు. కాలం ఆగిపోయిందా అనిపిస్తుంది ఆ ఊరి కథ వింటే.
కనీసం "ఫ్యాన్" గురించి తెలియని గిరిజనులను చూసి చలించిపోయాడొక యువ ఇంజినీర్.
"మిషన్ ఊర్జా" ప్రాజెక్టుతో కొత్త ఆశ చిగురించేలా చేశాడు.
- దిశ, ఫీచర్స్
"తన్వీర్ ఇనామ్‌దార్" వయసు 28 సంవత్సరాలు. మెకానికల్ ఇంజినీర్ అతను. 2020లో ఒక పనిమీద ముల్షీకి వెళ్లి అట్నుంచటే "వలని" గ్రామాన్ని చూసేందుకు వెళ్లాడు. ఊరంతా ఉక్కపోస్తోంది. అసలీ మనుషులెలా ఉంటారనిపించిందట. మట్టి.. కట్టెలతో నిర్మించిన ఇల్లు. కొన్న ఇండ్లకు సరైన పైకప్పు కూడా లేదు. ఎండ.. వర్షం.. చలి నుంచి ఎలాంటి రక్షణ లేదు వాళ్లకు. ఊళ్లోకి వెళ్లిన తమకు 10 నిమిషాల్లోనే బట్టలు తడిచిపోయేంత చెమటలు పట్టాయి. "ఫ్యాన్" పెట్టుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది కదా అని వాళ్లను అడిగినప్పుడు "ఫ్యానా" అని నోరెళ్లబెట్టారట.
800 పెట్టి కొనలేం
ఊరంతా తిరుగుతున్నప్పుడు అక్షయ్ జాదవ్ కుటుంబ కథ తన్వీర్ హృదయాన్ని కదిలించింది. అక్షయ్ తల్లి అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇంట్లో మట్టి ఇటుకలతో చేసిన సాంప్రదాయ కిచెన్ వల్ల ఆమెకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయట. రోజూ వంటచేస్తున్నప్పుడు పొగలోనే ఉండిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. అక్షయ్‌కి ఫ్యాన్ గురించి వివరించాడు తన్వీర్. కానీ దానికి రూ.800 అనేసరికి "కొనలేను" అన్నాడట. ఎందుకంటే అక్షయ్ సంపాదన నెలకు రూ.1800 మాత్రమే. పాపం అనిపించింది ఆ పరిస్థితిని చూసిన అక్షయ్‌కి.
మిషన్ ఊర్జా
భాను వాఘ్మారేకు రక్తపోటు సమస్య. వంట గదిలో వేడి కారణంగా ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. దుత్తా మోరెకు వేడి కారణంగా అర్ధరాత్రి రెండింటి వరకు కూడా నిద్ర పట్టలేని పరిస్థితి. శరత్ కొడుకు వేడి కారణంగా చదువులో వెనకబడ్డాడు. వేడిని తట్టుకోలేక ఆరు బయట కూర్చుంటే పాములు.. తేళ్లు కాటేస్తున్నాయి. లోపల కూర్చుంటెనేమో వేడితో చర్మ వ్యాధులు.. నీరసం.. వికారం.. శ్వాసకోస సమస్యలు. ఇవన్నీ తెలుసుకున్న తన్వీర్ "మిషన్ ఊర్జా" ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. దీని ద్వారా "డొనేట్ ఎ సోలార్ ప్యాన్" ఛాలెంజ్ చేస్తూ "వలని" గిరిజనుల జీవితాలను మెరుగు పరుస్తున్నాడు.
టీవీలు ఇప్పించాడు
"మిషన్ ఊర్జా" ప్రాజెక్టు ద్వారా మొదటగా "వలని" గ్రామంలో ఇంటింటికీ "సోలార్ ఫ్యాన్లు" అందజేశాడు తన్వీర్. కొద్ది కాలంలోనే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు. ఇంటి పైకప్పులు బాగు చేయించడం.. అందరికీ సోలార్ పవర్ సౌకర్యాన్ని కల్పించడం వంటి ఎన్నో పనులు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. "టీవీ" అంటే తెలియని ప్రజలకు "టీవీలు" పెట్టించాడు. ఇప్పుడు వాళ్లూ అందరిలా టీవీలు.. అందులో వచ్చే సినిమాలు.. క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నారు. ఆ తర్వాత "ముల్షీ తాలుకా"లోని మలే.. కాశింగ్.. షేరే వంటి గ్రామాలకు దీనిని విస్తరించాడు.
280 గ్రామాల్లో
గత ఐదేళ్ల నుంచి తన్వీర్ "మిషన్ ఊర్జా" కార్యక్రమాలను భారతదేశమంతటా విస్తరించాడు. అలా ఇప్పటివరకు దేశంలోని 280 గ్రామాల్లో విద్యుత్తు.. ఇతర సౌకర్యాలు కల్పించాడు. కొండల్లో.. చెట్లు తక్కువగా ఉండి గాలి సరిగా రాని.. వేసవిలో వేడిమి ఎక్కువగా ఉండే గ్రామాలను ఈ మిషన్ కింద ఎంచుకున్నాడు. గిరిజన కుటుంబాలకు ఎండ వేడిమి నుంచి విముక్తి కల్పించి.. ఆరోగ్యాన్ని.. ఆనందాలనూ తీసుకొస్తున్నాడు. ఫ్యాన్ ద్వారా జీవితాలను మార్చగలవా అని ప్రశ్నించిన వాళ్లకు సవాల్ విసిరి "మిషన్ ఊర్జా" ద్వారా శభాష్ అనిపించుకుంటున్నాడు.
డొనేట్ ఫ్యాన్
"మిషన్ ఊర్జా"లో భాగస్వామ్యం అయ్యి సౌర ఫ్యాన్‌లతో మీరూ ఒక కుటుంబానికి విరాళం అందించొచ్చు అని రూ.800తో డొనేట్ ఎ ఫ్యాన్ ఛాలెంజ్ చేస్తున్నాడు తన్వీర్. మీరు చేసే ఈ చిన్న సాయం వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొస్తుందని వివరిస్తున్నాడు. 500 కుటుంబాలకు వీటిని అందించాలనే లక్ష్యం పెట్టుకొని తన ప్రయత్నాలు చేస్తున్నాడు.






