కష్టాల కడలిపై కలల తీరాలవైపు.. ఓ బాలుడి లైఫ్ జర్నీ..

by Javid Pasha |   (  Updated:2026-02-07 08:56:20  IST  )

అక్కడి ఫుట్‌పాత్ మీద మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ లైట్ల నుంచి వచ్చే వెలుతురులో చదువుకుంటున్నాడు తొమ్మిదేళ్ల బాలుడు డానియల్ బెర్రా.

కష్టాల కడలిపై కలల తీరాలవైపు.. ఓ బాలుడి లైఫ్ జర్నీ..
X

దిశ, ఫీచర్స్ : జీవితమేమీ పూల పాన్పు కాదు.. ముళ్లదారులుంటాయి. సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటికీ ఎదురీది, కష్టాలకు ఎదురొడ్డి ఎదురు నిలిచిన వారెవరైనా సరే.. ఏదో ఒకరోజు రాటుదేలుతారు. సమస్యల నుంచి బయటపడతారు. స్వతహాగా అలాంటి అవకాశం లేకపోయినా.. నేచర్ వారికి సహకరిస్తుంది. ఏదో ఒక రూపంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓ బాలుడి జీవితంలో సరిగ్గా అదే జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బాలుడిని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అతడి కల నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తోంది. ఇంతకీ ఎవరతను?

ఫుట్‌పాత్‌ మీద చదువుకుంటూ..

అది ఫిలిప్పీన్ దేశం మండువే సిటీ, సెబునగరంలోని ఓ వీధి. అక్కడి ఫుట్‌పాత్ మీద మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ లైట్ల నుంచి వచ్చే వెలుతురులో చదువుకుంటున్నాడు తొమ్మిదేళ్ల బాలుడు డానియల్ బెర్రా. తండ్రి మరణం తర్వాత తల్లితో కలిసి ఒక చిన్న పూరిగుడిసెలో నివసిస్తున్న డానియల్‌కు బాగా చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ వాళ్ల గుడిసెలో కరెంటు లేదు. కనీస సౌకర్యాలు కూడా లేవు. దీంతో అతను వీధిలో చదువుకోవడం ప్రారంభించాడు. 2015లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఓ నెటిజన్ ఫొటో, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పట్లో బాగా వైరల్ అయింది. దీంతో ప్రపంచమంతా అతనిపై సానుభూతి చూపింది. మెక్ డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్ సంస్థ స్పందించి డానియల్‌కు గ్రేడ్ 12 వరకు పూర్తిస్కాలర్‌షిప్ ఇచ్చింది. కొందరు పాఠ్య పుస్తకాలు, స్కూల్ సామగ్రి, నెలవారీ భత్యం అందించారు. ఈ సహాయంతో డానియల్ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందులను అధిగమించింది.

మంచి రోజులు అందరికీ వస్తాయ్..

2019లో డానియల్ ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసి ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం అతని వయసు 20 సంవత్సరాలు. అతను భవిష్యత్తులో పోలీస్ అధికారి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇందంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే.. నాటి ఫొటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పేదరికం, కష్టాల మధ్య కూడా చదువు పట్ల, లక్ష్యాల పట్ల ఉండే అతిన అభిరుచి, సమాజం నుంచి వచ్చిన సహాయం ఒక బాలుడి జీవితాన్ని ఎలా మార్చగలిగిందో అందరూ చర్చించుకుంటున్నారు. నాటి బాలుడు నేటి యువకుడైనా డానియల్ రియల్ లైఫ్ స్టోరీ అందరినీ ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా 90 కిడ్స్ హృదయాలను టచ్ చేయడంతో పాటు ఈతరానికి ఓ చక్కటి సందేశాన్ని ఇస్తోంది. జీవితంలో ఏదో ఒక రోజు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయని.

Next Story