ఎర్రమల్లె "నల్ల"ముత్యం.!

by Daayi Srishailam |

నల్లపురెడ్డి శ్రీచరణి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు

ఎర్రమల్లె నల్లముత్యం.!
X

దిశ, ఫీచర్స్: గ్రామీణ ఆడపిల్లలు ఒక్కసారి తలుచుకుంటే ఇక దూసుకుపోవడమే. ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి చూసుకోరు అనడానికి మరో ఉదాహరణ నల్లపురెడ్డి శ్రీచరణి. ఎక్కడో కడప జిల్లా ఎర్రమల్లె అనే పల్లెలూరు నుంచి వచ్చిన ఈ నల్లపురెడ్డి శ్రీచరణి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు.

వరల్డ్ కప్‌లో స్పెషల్..

ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్-2025 కొట్టిన భారత జట్టులో సెన్సేషన్ గా మారింది 21 సంవత్సరాల శ్రీచరణి. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అందుకే ఇప్పుడు క్రీడా ప్రపంచం శ్రీచరణి గురించి చర్చిస్తున్నారు. ఆమెకు మంచి భవిష్యత్ ఉందనీ.. భవిష్యత్‌లో భారత మహిళా జట్టును ఏలనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డబ్ల్యూపీఎల్ ఆడుతున్న ఈ ఎడమ చేతి స్పిన్నర్‌ తన మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన రికార్డు క్రియేట్ చేసింది. లాక్‌డౌన్ రోజుల్లో పల్లెటూరి మట్టి మైదానంలో ఆడుకున్న బాలిక.. ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించిందంటే తన సాధనెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పరీక్ష రాయాలంటే కండీషన్..

శ్రీచరణి చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఆటలకు ప్రయారిటీ ఇచ్చింది. పేరెంట్స్ కూడా తనను చాలా ప్రోత్సహించారు. అయితే వాళ్ల నాన్న తనను బ్యాడ్మింటన్.. అథ్లెటిక్స్.. కో-కో కోచింగ్ కు పంపాడు. వాటిమీదనే కాన్సెంట్రేట్ చెయ్యమని చెప్పేవాడు. కానీ శ్రీచరణి వాటితో పాటు క్రికెట్‌నూ వదల్లేదు. బ్యాడ్మింటన్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి స్నేహితులతో క్రికెట్ ఆడేది. తనకు క్రికెటంటే ఎంత ఇష్టమంటే.. 10వ తరగతి పరీక్షల సమయంలో "క్రికెట్ ఆడనివ్వకపోతే పరీక్షలు రాయను" అని కండీషన్ పెట్టిందట. చేసేదేంలేక ఓకే చెప్పి.. వాళ్ల నాన్ననే మనసు మార్చుకొని కూతురికి క్రికెట్ కోచింగ్ ఇప్పించాడన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా బిడ్డ కోసం వాటన్నింటినీ అధిగమించి శిక్షణిప్పించాడు.

కడప నుంచి ఫస్ట్..

చిన్నప్పుడు శ్రీచరణికి నిదానం ఉండకపోయేదట. ఆటలో రాణించాలంటే ఈ ఆత్రం పనికొస్తుందా.? చాలా ఓపిక ఉండాలి. ఓర్పు ఉండాలి. ఉండాల్సి చోట దూకుడు ఉండాలిగానీ.. మొత్తం జీవితమే దూకుడుగా ఉండొద్దు కదా.? అందుకే కోచ్ ఆమెను ముందు స్పీడ్ తగ్గించుకోమని సలహా ఇచ్చాడు. అతడు పెట్టిన గంటల తరబడి నెట్ ప్రాక్టీస్‌లు తనను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు శ్రీచరణి అంటే ప్రశాంతంగా ఉండే అమ్మాయి. ప్రతీదీ ఆలోచించి అడుగు ముందుకేసేంత నేర్పరి. బౌలింగ్‌లోనూ ప్రతీ ఓవర్‌కు.. ప్రతీ బంతికి ఆలోచించి ప్లాన్ చేస్తుంది. ఈ ప్రశాంతతే తనను వరల్డ్ కప్ ఫైనల్‌లో అనాబెల్ వికెట్ తీయగలిగే స్థాయికి తీసుకెళ్లింది. కట్‌చేస్తే.. కడప జిల్లా నుంచి భారత జట్టు జెర్సీ ధరించిన మొదటి మహిళగా.. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక ప్లేయర్‌గా నిలిచింది శ్రీచరణి.

Next Story