కొవిడ్ కేర్ సెంటర్‌లో ‘లైబ్రరీ’

by  |
కొవిడ్ కేర్ సెంటర్‌లో ‘లైబ్రరీ’
X

దిశ, ఫీచర్స్ : ఆస్పత్రుల్లో ఉన్న కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి, సంతోషం నింపడానికి చాలామంది వైద్యులు, నర్సులు డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్స్‌ కోసం నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయి లైబ్రరీని ఏర్పాటు చేయడం విశేషం.

‘ఒక మంచి పుస్తకం.. వంద మంది మిత్రులతో సమానం’ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాగే ‘పుస్తకాల్లో మనల్ని మనం కోల్పోతాం. అక్కడే మనల్ని మనం మళ్లీ కొత్తగా పొందుతాం’. పుస్తకాల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటే అతిశయోక్తి కాదేమో. ఎల్లవేళలా తోడుంటే మిత్రుడి వంటి పుస్తకాలతో కొవిడ్ బాధితులు సాంత్వన పొందుతారని, కాలక్షేపం చేస్తారని భావించిన నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక ‘కోవిడ్ కేర్ సెంటర్‌’లో కంప్లీట్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఈ లైబ్రరీలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలకు సంబంధించిన అద్భుతమైన పుస్తకాలను సేకరించి పెట్టారు.

‘రోగుల దృష్టిని ప్రతికూలత నుంచి మళ్లించడంతో పాటు పుస్తకాలతో స్నేహం చేస్తారని ఈ ఏర్పాటు చేశాం. రోగులు పది రోజులకు పైగా ఉంటారు. కాబట్టి వారు పుస్తకాలు ఎక్కువ చదవగలరు. అలాగే, ఈ అలవాటు వల్ల స్మార్ట్ ఫోన్‌లో నెగటివ్ వార్తలు చూసే సమయం తగ్గుతుంది. కొంతమంది రోగులు ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్నప్పుడు ఆశను కోల్పోయే అవకాశం ఉంది. వారు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ప్రభావం మరింత ఘోరంగా ఉంటుంది. పుస్తకాలు వారికి ఓదార్పునిస్తాయి, వారిలో పాజిటివిటీని పెంచగలవు. కొంతమంది పేషెంట్స్ తమ వెంట పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవడం గమనించాం. వారి నుంచి స్ఫూర్తి పొందే ఇది ఏర్పాుటు చేశాం. పుస్తకాలు చదవడం అలవాటైతే.. అది ఇక్కడితో ఆగిపోదు, ఎక్కడున్న వాళ్లు దీన్ని కొనసాగిస్తారు. మహమ్మారిని వదిలేసి, ‘రీడింగ్ వైరస్’‌తో వాళ్లు వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఇతర కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించాలని యోచిస్తున్నాం’ – అభిజిత్ బంగర్ , మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఆఫీసర్


Next Story

Most Viewed