వెగటు పుట్టిస్తున్న నాయకుల ఆరోపణలు

by  |
వెగటు పుట్టిస్తున్న నాయకుల ఆరోపణలు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: ఎన్నికలొస్తాయి.. నాయకులొస్తారు.. సొంత మనుషుల్లా పదేపదే ఇంటింటికీ తిరుగుతారు.. ఆ పదిరోజులు తీయగా పలుకరిస్తారు. ఎటు చూసినా పార్టీల నేతలే.. ఏ గల్లీకి వెళ్లిన కార్యకర్తల హడావిడే.. ఆ పార్టీ నాయకుడొచ్చి, ఈ పార్టీ ఆయన్ను, ఇంకో పార్టీ నేతలొచ్చి మరో పార్టీ వ్యక్తికి నోటితో చెప్పలేని మాటలతో కడిగిపారేస్తారు.. తప్పు వారు చేశారని వీరు, వీళ్లు చేశారని వాళ్లు ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉంటారు.. అంతేకానీ ప్రజల కోసం ఏం చేయబోతామో మాత్రం చెప్పరు.. ఎంతసేపూ వారి రాజకీయమే తప్ప సామాన్యుడి సమస్యలు పట్టవు.. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్ ఇది.. వెగటు పుట్టించేలా వ్యవహరిస్తున్న నాయకుల తీరును ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూనే ఉన్నారు.. ఇకనైనా నేతలు మారాలని, ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే తమదైన శైలిలో చెప్పాల్సిన సమయంలో తప్పక బుద్ధి చెబుతామని పేర్కొంటున్నారు.

మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం త‌దిత‌ర పార్టీలు ఒక‌రిని ఒక‌రు టార్గెట్ చేస్తూ ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఓట‌ర్లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల నుంచి మొద‌లైన ఆరోప‌ణాస్త్రాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా వ‌ర‌ద సాయం నిలుపుద‌ల విష‌యంలో లేఖ తాను రాయ‌లేద‌ని బీజేపీ అధ్యక్షుడు, అత‌నే రాశార‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.

ఇది ఎంత‌గా అంటే చివ‌ర‌కు బీజేపీ అధ్యక్షుడు స్వయంగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసే స్థాయికి వెళ్లిన విష‌యం తెలిసిందే. దీనికితోడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎంకు వేసిన‌ట్లేన‌ని బీజేపీ టీఆర్ఎస్ ను ఎండ‌గ‌ట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఇంత విప‌త్తు సంభ‌వించి రాష్ట్రంలో ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌లు ముంచెత్తితే కేంద్రం ఒక్క రూపాయి కూడా స‌హాయం చేయ‌లేద‌ని టీఆర్ఎస్ బీజేపీపై బుర‌ద జల్లుతోంది. అంతేకాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ల మ‌ధ్య ఎలాంటి స్నేహ పూర్వకపొత్తు ఉండ‌ద‌ని టీఆర్ఎస్ ప్రకటించడాన్ని కూడా ఓట‌ర్లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఎన్ని రోజులు వారు ఆ మాట మీద నిల‌బ‌డ‌తారో చూస్తామ‌నే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక‌రిపై ఒక‌రి ఆరోప‌ణ‌లేనా – అభివృద్ధి పట్టదా…?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో సమస్యలు తాండవం చేస్తుంటే వాటిని ప‌ట్టించుకోకుండా ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేసుకుంటున్న ఆరోప‌ణ‌ల‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు నేటికీ కొన్ని కాలనీల్లో బురద పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. వేల కుటుంబాలు వ‌ర‌ద‌ల కార‌ణంగా పడిన ఇబ్బందులు అన్నీఇన్నీకావు. వాటిని గాలికి వ‌దిలి ఒక పార్టీపై మ‌రొక పార్టీ, ఒక నాయ‌కునిపై మ‌రో నాయ‌కుడు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2014 లో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింద‌ని, ఐటీ, పరిశ్రమలు త‌దిత‌ర విభాగాల్లో రాష్ట్రం దూసుకుపోతుంద‌ని అధికార పార్టీ నాయ‌కులు అంటుండ‌గా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయిని, ఆరేళ్లుగా ఇత‌ర పార్టీలు మండిప‌డ‌డాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

మా సమస్యలు పట్టవా..?

ప్రజల సమస్యలు ప‌ట్టించుకోకుండా అన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజ‌కీయం చేస్తున్నాయి. ప్రజలను కేవ‌లం ఓట‌ర్లుగానే చూస్తున్నారు తప్ప వారికి ఏదైనా చేద్దామనే నాయకులు లేకుండాపోయారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చి ఓట్లు వేయ‌మ‌ని అడుగుతున్నారు, ఇతర సమయాల్లో ప‌ట్టించుకోవ‌డం లేదు. ఓట్ల కోసం ప‌లు ప‌ర్యాయాలు ఇండ్ల చుట్టూ తిరిగే నాయ‌కులు ఎన్నిక‌ల అనంత‌రం ప‌నుల గురించి వారి చుట్టూ ఎన్ని ప‌ర్యాయాలు తిరిగినా ప‌ట్టించుకోరు. ఇలాంటి దుస్థితి మారాలి. నిస్వార్థంగా సేవ చేసే నాయ‌కుల‌కు పార్టీల‌క‌తీతంగా ఓట్లు వేస్తాం. -వివేక్ గుప్తా – కొత్తపేట్​

మంచిప‌నిని స్వాగ‌తిస్తాం..

నాయ‌కులు చేసే ఏ మంచిప‌నినైనా స్వాగ‌తిస్తాం. మాకు పార్టీల‌తో సంబంధం లేదు. ఐతే ప్రజలను పట్టించుకోకుండా పరస్పరం దూషించుకునే నాయ‌కుల‌ను చూస్తే చిరాకేస్తుంది. ప‌ద‌వుల కోసం నీచానికి దిగి మాట్లాడుకోవ‌డం త‌గ‌దు. వ‌రద ముంపు స‌హాయం చేసేందుకు ప్రభుత్వం బాగానే ముందుకు వ‌చ్చినా అది ఎందుకు ఆగిందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌ర‌ద‌ల అనంత‌రం న‌గ‌రంలోని అన్ని రోడ్లు చెడిపోయాయి. కొన్నిచోట్ల రోడ్లపై ఏర్పడిన గుంతల్లో పడి ఎంతో మంది గాయాల బారిన ప‌డుతున్నారు. ముందు అటువంటి సమస్యలపై స్పందించి ప్రజలకు మేలు చేయండి. -రాజు డ్రైవ‌ర్, కోఠి

Next Story

Most Viewed