నిర్మాణాలకు బ్రేక్.. మన ఇసుక రాదాయే, అక్రమంగా దొరకదాయే..?

by  |
నిర్మాణాలకు బ్రేక్.. మన ఇసుక రాదాయే, అక్రమంగా దొరకదాయే..?
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుక దొరకడం లేదు. దీంతో నిర్మాణాలు ఆగిపోతున్నాయి. పనులులేక భవన నిర్మాణ కార్మికులు వలస పోతున్నారు. చాలా కుటుంబాలు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల ఇసుక అవసరాలు తీర్చడం కోసం కేశవాపురం గ్రామపంచాయతీ గుంపెనగూడెం గ్రామం వద్ద తాలిపేరు వాగు నందు ర్యాంపు పెట్టి ప్రభుత్వం మన ఇసుక వాహనం ద్వారా చేసిన ఇసుక సప్లై వర్షాలు కురవడంతో వాగులు పొంగి ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. ఈ స్కీమ్‌పై గంపెడాశతో రిజిస్టర్ చేసుకున్న ట్రాక్టర్ యజమానులకు పనిలేక వాహన నిర్వహణ కడుభారమైంది.

మరోవైపు కొత్తగా వచ్చిన చర్ల తహశీల్దార్ ఈరెల్లి నాగేశ్వరరావు దొడ్డిదారి ఇసుక రవాణాపై నిఘాపెట్టి తనే స్వయంగా రోడ్లపై రేయింబవళ్ళు తిరుగుతూ ఇసుక ట్రాక్టర్లు పట్టుకోవడంతో దాదాపు ఇసుక అక్రమ రవాణాకు చర్లలో అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు. ప్రభుత్వ పరంగా కొనడానికి ఇసుక దొరక్క, చాటుమాటుగా తెప్పించుకొనే చాన్స్‌లేక భవన నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. చర్ల మండలంలో అక్రమ ఇసుక రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేయడం అభినందనీయమని, అయితే ప్రజల ఇసుక అవసరం తీర్చడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివలన రెవెన్యూ కళ్ళుగప్పి చీకటి మాటున వాగు, వంకల నుంచి ఇసుక తోడి అమ్ముకొనే అక్రమార్కులు ధర పెంచి సొమ్ము చేసుకొంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారులు ఎంత టైట్ చేస్తే తమకు అంత మంచిదని అక్రమ ఇసుక రవాణాదారులు (చీకటి ఇసుక వ్యాపారులు) బాహాటంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇసుక కొరతను బట్టి ధర పెంచి వారు లాభపడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలపై దొడ్డిదారి ఇసుక భారం పడకుండా.. మన ఇసుక వాహనం ద్వారా అనువైన ప్రాంతాల నుంచి సప్లై చేయడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని చర్ల మండల ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed