ట్రాఫిక్ ఫ్రీ సిటీనే లక్ష్యం

by  |
ట్రాఫిక్ ఫ్రీ సిటీనే లక్ష్యం
X

– సమీక్షా సమావేశంలో కేటీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని, నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జూన్ నుంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ నెలలోనే వీలైనంత ఎక్కువ పని పూర్తి చేయాలని మంత్రి సూచించారు. బుద్దభవన్‌లో శనివారం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్‌లతో కలిసి పనుల ప్రగతిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని సూచించారు. దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకున్న రాష్టంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించుకుందామని తెలిపారు.

వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్లలో అక్కడక్కడా ఆటంకంగా వున్న భూముల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. నిర్మాణంలో వున్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సిసిపి దేవేందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు శ్రీధర్, జియాఉద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

Tags: Telangana, KTR, GHMC, HRDC, Lockdown, Roads, Development


Next Story

Most Viewed