గులాబీలో గ్రూపు పాలిటిక్స్‌ సమసిపోయేనా?

424
KTR1

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి నేతల్లో నైరాశ్యం అలుముకుంది. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునేవారే కరువయ్యారు. దీనిని గమనించిన అధినాయకత్వం దిద్దుబాటుకు శ్రీకారం చుట్టింది. ఓ వైపు ప్లీనరీ, విజయగర్జన సభకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూనే మండల స్థాయి నేతలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. పార్టీ ఎలా ఉంది? మరింత పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ఫీడ్​బ్యాక్​ తీసుకుంటున్నారు. 2001లో తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్​కు ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్నారు. అయినప్పటికీ గ్రామస్థాయిలో కార్యకర్తలకు, నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ ఉంది.

కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 90% ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో పటిష్టంగా లేదు. ప్రజాప్రతినిధులు కార్యకర్తలను, నేతలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అక్కడక్కడ నిరసనలు చేపట్టడం, టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్తుండటం పరిపాటిగా మారింది. మరో పక్క పార్టీ బద్నాం అవుతుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా వరంగల్ లో వచ్చే నెల 15న విజయగర్జన సభ నిర్వహిస్తున్నది. విజయ గర్జన కోసం ఈ నెల 18 నుంచి ప్రతిరోజు 20 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సుమారు 400 మందితో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమవుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు అర్ధగంట సమయం కేటాయిస్తూ మండల పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు.

పార్టీ సంస్థాగత పరిస్థితిని క్షుణ్నంగా అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో ఉన్న సమస్యలు, గ్రూపులపై ఆరా తీస్తున్నారు. మండల నాయకులు కేటీఆర్ తో పార్టీలో చిన్నచూపు చూస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని నివేదిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా వేయకుండా మండల స్థాయి నేతలతో ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, తమకు గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కల్యాణ లక్ష్మి, తదితర పథకాలకు సంబంధించిన చెక్కులు అందజేస్తున్నారని, తమకు కొన్ని ఇచ్చేలా చూడాలని విన్నవించుకుంటున్నారు. ఇలా తమకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో తమకు ఆదరణ లభిస్తుందని, తద్వారా పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని పలువురు చెప్పినట్టు సమాచారం.

కేటీఆర్ మాత్రం ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలపై స్పందించాలని సూచిస్తున్నట్టు తెలిసింది. పార్టీ గ్రూపులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని, అందరిని కలుపుకొని పోయేలా చర్యలుంటాయని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకుంటామని వారికి కేటీఆర్​ మాట ఇస్తున్నారు. టీఆర్ఎస్ అంటేనే గ్రూపులకు అతీతమనే విధంగా తీర్చిదిద్దుదామని పార్టీ నేతలకు కేటీఆర్ భరోసా ఇస్తున్నట్టు మండల నాయకులు పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..