ఓటు రాల్చని మాటల గారడీ..!

by  |
ఓటు రాల్చని మాటల గారడీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘విధ్వంసమా.. విశ్వనగరమా?’, ‘ఆరేండ్ల ప్రగతితో మన హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి..’ ‘కారు గుర్తుకు ఓటేద్దాం.. మన బ్రాండ్ హైదరాబాద్ కు అండగా ఉందాం..’, ‘హైదరాబాద్ పరిశుభ్రం.. గ్రీనర్ సిటీ’, ‘ఇన్నోవేటివ్, ప్రొగ్రెసివ్ పాలసీస్.. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్’, ‘సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్, సర్కార్ కారు’.. అంటూ పదునైన పదజాలం, కనికట్టు మాటలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బల్దియా ఎన్నికల్లో పడిన కష్టం అంతాఇంతా కాదు. 12 రోజుల పాటు అహర్నిషలూ శ్రమించారు. సభలు, సమావేశాలు, భేటీలు, సమ్మేళనాలు, వ్యూహరచన, రోడ్డు షోలు.. ఒక్కటేమిటి? టీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ మాత్రమే అన్నట్లుగా బల్దియా ఎన్నికల ప్రచారం సాగింది. కుల సంఘాలు, ఐటీ వర్గాలు, ఇండస్ట్రియల్ అసోసియేషన్లు, వ్యాపార, వాణిజ్య వర్గాలు.. ఇతర రాష్ట్రాల సంఘాలతో వరుస సమ్మేళనాలతో ఆకట్టుకున్నారు. ఆయా వర్గాలకు తగ్గట్లుగా మాట, బాట, యాసతో వ్యవహరించారు. కానీ.. ఎందుకో, ఏమో గానీ.. ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని ఆయనే అన్నారు.

ఎన్ని సమ్మేళనాలు, ఎన్ని సభల్లో ప్రసంగించినా, మాట మంత్రాలుగా ఉచ్ఛరించినా సగానికి పైగా జనం ఓట్లేసి దగ్గరికి వెళ్లగానే వెనుకడుగు వేశారు. 2016 లో ఒంటి చేత్తో సున్నా నుంచి 99 డివిజన్లలో తన పార్టీ అభ్యర్ధులను గెలిపించుకొని సీఎం కేసీఆర్ తో శభాష్ అనిపించుకున్నారు. సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది. అనేక థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఎన్ని మాటలు చెప్పినా వినిపించుకోలేదని అర్థమవుతోంది. ఆఖరికి భారతీయ జనతా పార్టీకి 50 సూటి ప్రశ్నలు సంధించినా ఆ పార్టీని నిలువరించలేకపోయారన్న చర్చ సాగుతోంది. బీజేపీని ఎదుర్కోవడానికి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. ఉదయం కుల సంఘాలతో సమ్మేళనాలు.. సాయంత్రం రోడ్డు షోలతో అలరించారు. అన్ని వర్గాలతో ప్రభుత్వానికి మద్దతు తెలపాలంటూ అభ్యర్థించారు. కానీ ఆ సమ్మేళనాలతో పెద్దగా ఒరిగిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందొకటి.. వెనుకొకటి..

బల్దియా ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్​ వేసిన ఎత్తుగడలు ఫలించలేదని తెలుస్తోంది. ఉదయం వేళ నడిపిన సమ్మేళనాల్లో కేటీఆర్ తన అభిమతాన్ని, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అందరూ ఆహో.. ఓహో అన్నారు. కానీ ఆయన ముందు మాత్రమే అభినందించినట్లుగా ఓట్ల శాతం చెబుతోంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ సమ్మిట్, రియల్టర్లు, బిల్డర్లతో నడిపిన సమ్మేళనాలు, వార్షికోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యారు. కానీ బయటికి వచ్చిన కొందరు బిల్డర్లు, రియల్టర్లు.. ప్రభుత్వ అధికారులు ఏ పనీ నిర్దిష్ట సమయంలో చేయలేదన్నారు. ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై పెదవి విరిశారు. ప్రభుత్వ విధానాలను సమావేశంలో విమర్శించలేదు. కనీసం ప్రశ్నించలేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత వాస్తవాలేమిటో ప్రభుత్వానికి సరిగ్గా తెలియడం లేదన్నారు. కూకట్పల్లిలో ఓ అపార్టుమెంట్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకొని ఆర్నెళ్లు గడుస్తున్నా పరిశీలించలేదు. కనీసం షార్ట్​ఫాల్స్​ ఏమిటో చెప్పకుండా కాలయాపన చేశారు. సింగిల్విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేస్తున్నాం.. అంటూ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఇలాంటి అనేకాంశాలు ఓటింగ్ పై ప్రభావం చూపినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మూడు పదవులతో ఎన్ని?

బల్దియా ఎన్నికలకు ముందే ఆర్య వైశ్యులకు మూడు పదవులు ఇచ్చారు. ఒకరిని నామినేటెడ్​ఎమ్మెల్యేను చేశారు. ఇద్దరిని కార్పొరేషన్ల చైర్మన్లను చేశారు. ఆ తర్వాత వారి సామాజిక వర్గమంతా ఎన్ని ఓట్లు వేయించిందన్న అంశంపై చర్చించుకుంటున్నారు. అలాగే మరొక సామాజిక వర్గానికి చెందిన లీడర్ ను ఎమ్మెల్యేను చేశారు. ఇంకో కవి, కళాకారుడిని ఎమ్మెల్సీని చేశారు. పార్టీ నుంచి పదవులు పొందిన ఆ నాయకులు వారి సామాజిక వర్గాల ఓట్లను ఎన్నింటిని వేయించారన్న ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. రాజకీయాలన్నీ కుల, సామాజిక వర్గీకరణపైనే నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా సమ్మేళనాలు నడిపారు. ఐతే పార్టీ, ప్రభుత్వంలో పద్మశాలి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రధాన చర్చగా కనిపించింది. ఆప్కో నిర్వీర్యం, చేనేత కార్మికులను పట్టించుకోకపోవడం, సిరిసిల్ల పవర్ లూం మగ్గాలకు మాత్రమే పెద్ద ఆర్డర్ ఇవ్వడం వంటివి కూడా ప్రభావితం చూపినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ​సమ్మేళనాలు

= 22న హైసియా నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ సెషన్​
=23న తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం
= 24న ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రొఫెషనల్, నాన్​ ప్రొఫెషనల్ విద్యా సంస్థ సంఘం ఏర్పాటు సమావేశం
= 25న మారియట్ కన్వెన్షన్లో హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్
= 26న నిజాం క్లబ్​ లో విశ్వనగరంగా హైదరాబాద్ అనే అంశంపై సదస్సులోనూ రాజకీయ ప్రసంగం
=27న పీపుల్స్ ప్లాజాలో ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభ
= 27న బిల్డర్స్ అండ్ డెవలపర్స్.. రియల్​ ఎస్టేట్​ సమ్మిట్​
=28న గుజరాత్, మార్వాడీ, మహేశ్వరి, అగర్వాల్ బిజినెస్ కమ్యూనిటీస్ మీటింగ్​
=28న లింగ్విస్టక్ అసోసియేషన్స్ తో హరితా ప్లాజాలో సమ్మేళనం
= 30న ఫ్రాంక్లీ స్పీకింగ్.. అంటూ టైమ్స్ నౌ రిపోర్టర్​నావికా కుమార్​ కు ఇంటర్వ్యూ
= వివిధ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు..
= తెలుగు మీడియాలో సింహభాగం కేటీఆర్​ ఇంటర్వ్యూలు కనిపించాయి.

Next Story