జల జగడానికి నేడైనా తెరపడేనా..?

by  |
Krishna Water Dispute latest news
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో చెలరేగిన జల వివాదం ఇంకా చల్లారడం లేదు. ఒకదళలో ప్రాజెక్టులపై బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్​విడుదల చేసింది. వచ్చేనెల 14 నుంచి గెజిట్ బోర్డుల పరిధి ఖరారు కానుంది. ఈ నేపథ్యంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు వివాదాలకు దిగుతూనే ఉన్నాయి. కృష్ణా జలాల్లో ఫిఫ్టీ–ఫిఫ్టీ వాటా కోసం తెలంగాణ పట్టుబడుతోంది. మరోవైపు శ్రీశైలం విద్యుత్​ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రెండు రాష్ట్రాలు ఇటు బోర్డులకు, అటు కేంద్రానికి లేఖలు పంపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం మొదలుకానుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది.

వాటాపైనే ప్రధాన చర్చ

రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచి కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి పెరగాల్సిన వాటాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటినే ఏపీ, తెలంగాణలు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి నీటి వాటాలను మార్చాలని తెలంగాణ గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని, పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని, బోర్డును కోరుతోంది.
ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో సగం వాటా అంటే 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్​ సూచించారు. గత నెల 25న సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి బోర్డుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు.

అలాగే ఏడాది కేటాయించిన వాటాలో మిగిలిన జలాలను మరుసటి ఏడాదికి లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన, వరద వచ్చినప్పుడు నీటి వినియోగం, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, వాటి డీపీఆర్‌లు ఇవ్వడం, చిన్ననీటివనరులకు నీటి వినియోగం, ఏపీ గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, బోర్డు నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. వీటితో పాటు బోర్డు తరలింపు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన అంశంతో పాటు రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలు కూడా కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై బుధవారం సాయంత్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది. ఉదయం కేఆర్ఎంబీ మీటింగ్, సాయంత్రం 4 గంటలకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 3న నిర్వహించిన కృష్ణా, గోదావరి బోర్డుల కోఆర్డినేషన్ మీటింగ్, 9న నిర్వహించిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ జాయింట్ మీటింగ్‌కు తెలంగాణ గైర్హాజరు అయింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొననున్నారు.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం ఏం మలుపు తిరుగుతుందో అనుకునే తరుణంలో కర్ణాటక కూడా రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంలో బయటకు వచ్చింది. కర్ణాటక ఏం చేస్తుందనేది ఇప్పుడు కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఆసక్తికరంగా మారింది. కృష్ణా యాజమాన్య బోర్డ్ నదీ జలాల విషయంలో సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుందనేది కూడా ఇప్పుడు తేల్చాల్సిన అంశం అయింది.

లేఖల యుద్ధం ఆగుతుందా..?

బుధవారం జరిగే బోర్డుల సమావేశానికి హాజరు కానున్న తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలను సమావేశంలో ఉంచుతారనేది ఆసక్తిని రేపింది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతలు, కృష్ణా జలాలను ఆవతలి బేసిన్​కు తరలించడం, కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్​పై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. పలుమార్లు కేంద్రానికి, బోర్డులకు సైతం లేఖలు రాశారు. మరోవైపు బుధవారం జరిగే కృష్ణా పూర్తి స్థాయి భేటీలోనూ బలంగా వాదనలు వినిపించాలని, అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్​ఇప్పటికే ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించే 80 టీఎంసీల గోదావరి నీటితో, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబట్టుకునేలా వాదించాలని, దీనికి తోడు క్యారీ ఓవర్‌ నీటిపై ఏపీ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు, తాగునీటి కేటాయింపులో 20 శాతం వినియోగమే లెక్కలోకి తీసుకునేలా రాష్ట్ర వాదనను బలంగా వినిపించాలంటూ మరోసారి సూచించారు.

ఏపీ కూడా అదే వైఖరి

శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులపై నిర్మించిన విద్యుత్​ కేంద్రాల్లో తెలంగాణ అక్రమంగా కరెంటు ఉత్పత్తి చేయడంపై బుధవారం నాటి కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలో రాష్ట్రప్రభుత్వం నిలదీసేందుకు ఏపీ కూడా సిద్ధమవుతోంది. కృష్ణా జలాల అంశంపై బోర్డుకు గత నెల రోజులుగా లేఖలు రాస్తున్నా ఎలాంటి ఫలితమూ రావడం లేదని, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై గట్టిగా గళమెత్తుతామంటూ ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించి అధ్యయన నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కి ఇచ్చేందుకు బోర్డు ఉబలాటపడిందని, కానీ తెలంగాణలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నివేదిక ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించడంపై బోర్డును సైతం నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా జలాలను భారీగా విడుదల చేస్తున్నప్పటికీ.. అదంతా దిగువన ఉన్న పులిచింతలకు చేరుకోకపోవడంలోని మతలబు ఏమిటో ప్రశ్నించాలనీ ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.



Next Story

Most Viewed