నిందితులను ఉరి తీయండి.. కోమటిరెడ్డి సంచలన డిమాండ్

by  |
నిందితులను ఉరి తీయండి.. కోమటిరెడ్డి సంచలన డిమాండ్
X

దిశ, నల్లగొండ: ధనలక్ష్మి కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష వేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో ధనలక్ష్మి కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిరోజూ రెండు మూడు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ తెలంగాణలోనే ఉందని చెబుతున్న కేసీఆర్, రోజుకో సంఘటన జరుగుతుంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కిరాణా షాపుల్లో, పాన్ షాపుల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. గంజాయి ద్వారా వచ్చే లిక్విడ్‌ను రెండు మూడు చుక్కలు వేసుకుంటే మనుషులు రాక్షసులుగా మారి ఇలాంటి సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. కాలేజీ విద్యార్థులు, యువకులు దీనికి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న పోలీసులంతా ఎమ్మెల్యేకు రక్షణ కల్పిస్తే, ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఆయన తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేసి.. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story