పోరాడి ఓడిన సన్‌రైజర్స్

by  |
పోరాడి ఓడిన సన్‌రైజర్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపోందాయి. కానీ నాలుగో మ్యాచ్‌లో ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్ గెల్చి వార్నర్ బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన నిర్ణయం ఎంత తప్పో తెలిసిరావడానికి వార్నర్‌కు ఎంతో సమయం పట్టలేదు. యువ క్రికెటర్లు నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి హైదరాబాద్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి భారీ స్కోర్‌కు పునాదులు వేశారు. ఇక హైదరాబాద్ జట్టు త్వరగా వికెట్లను కోల్పోవడం.. జానీ, పాండే దూకుడుగా ఆడినా.. చివర్లో కోల్‌కతా అద్బుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లోపాలు సరిదిద్దుకుంటే రాబోయే మ్యాచ్‌లో రాణించవచ్చు.

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తొలుత బ్యాటింగ్ చేసి 189 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (7), డేవిడ్ వార్నర్ (3) త్వరగా పెవీలియన్ చేరారు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కీపర్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ అవుటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే వృద్దిమాన్ సాహా.. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే కలసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పాండే కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా.. జానీ బెయిర్‌స్టో తన ఫామ్‌ను కొనసాగించాడు. బౌండరీలు, సిక్సులు కొడుతూ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు.

వీరిద్దరూ లక్ష్యం వైపు వెళ్తున్నారనుకున్న సమయంలో జానీ బెయిర్‌స్టో (55) పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో నితీశ్ రాణాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మనీశ్ పాండే (61) ఒక వైపు క్రీజులో నిలబడి ఆడుతున్నా.. మరో ఎండ్‌లో అతడికి సపోర్ట్ ఎవరూ ఇవ్వలేదు. రిక్వైర్డ్ రన్‌రేట్ పెరుగుతున్నా.. వేగం పెంచడంలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మహ్మద్ నబీ (14), విజయ్ శంకర్ (19) వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ కేవలం 8 ఓవర్లలో 19 పరగులు చేసి మ్యాచ్‌పై ఆశలు రేపాడు. చివరి ఓవర్లో 22 పరుగులు కావల్సి ఉండగా ఆండ్రీ రస్పెల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులే ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా షకీబుల్ హసన్, పాట్ కమ్మిన్స్, ఆండ్రీ రస్సెల్ తలా ఒక వికెట్ తీశారు. నితీశ్ రాణాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

రాణా మెరుపులు.. త్రిపాఠీ దూకుడు

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ ఓపెనర్లు అర్దసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ (15) క్రీజులో సరిగా కదల్లేకపోయాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న నితీశ్ రాణా మాత్రం తొలి బంతి నుంచే రెచ్చిపోయాడు. ఈ సీజన్‌ ఆరంభంలో కరోనా బారిన పడి కోలుకున్న రాణా.. ఏ సమయంలోనూ డల్‌గా కనిపించలేదు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ చివరి బంతికి గిల్‌ను ఒక గూగ్లీతో బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత రాణాతో జతకలిసిన రాహుల్ త్రిపాఠి దూకుడుగా ఆడాడు. ఇద్దరూ సన్‌రైజర్స్ బౌలర్లను చితక్కొట్టారు. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకపడుతూ పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

ఈ క్రమంలో రాణా 37 బంతుల్లో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. వీరిద్దరూ కలసి జట్టు స్కోర్‌ను 200 దాటిస్తారని అందరూ భావించారు. అయితే నటరాజన్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి (53) సాహాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. డేంజరస్ ఆండ్రీ రస్సెల్ (5) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18వ ఓవర్లో మహ్మద్ నబీ వరుసగా నితీశ్ రాణా (80), ఇయాన్ మోర్గాన్ (2)లను పెవీలియన్ చేర్చాడు. కేవలం 14 పరుగుల వ్యవధిలో కోల్‌కతా జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 22 పరుగులు బాదాడు. చివరి బంతికి షకీబుల్ హసన్ (3) అవుటయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ చెరి రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌కు తలా ఒక వికెట్ లభించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్

నితీశ్ రాణా (సి) విజయ్ శంకర్ (బి) మహ్మద్ నబీ 80, శుభ్‌మన్ గిల్ (బి) రషీద్ ఖాన్ 15, రాహుల్ త్రిపాఠి (సి) వృద్దిమాన్ సాహా (బి) నటరాజన్ 53, ఆండ్రీ రస్సెల్ (సి) మనీశ్ పాండే (బి) రషీద్ ఖాన్ 5, ఇయాన్ మోర్గాన్ (సి) అబ్దుల్ సమద్ (బి) మహ్మద్ నబీ 2, దినేశ్ కార్తీక్ 22 నాటౌట్, షకీబుల్ హసన్ (సి) అబ్దుల్ సమద్ (బి) భువనేశ్వర్ కుమార్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లు) 187/6

వికెట్ల పతనం : 1-53, 2-146, 3-157, 4-160, 5-160, 6-187

బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ (4-0-45-1), సందీప్ శర్మ (3-0-35-0), టి.నటరాజన్ (4-0-37-1), మహ్మద్ నబీ (4-0-32-2), రషీద్ ఖాన్ (4-0-24-2), విజయ్ శంకర్ (1-0-14-0)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్

వృద్దిమాన్ సాహ (బి) షకీబుల్ హసన్ 7, డేవిడ్ వార్నర్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రసిధ్ కృష్ణ 3, మనీష్ పాండే 61 నాటౌట్, జానీ బెయిర్‌స్టో (సి) నితీశ్ రాణా (బి) పాట్ కమ్మిన్స్ 55, మహ్మద్ నబీ (సి) ఇయాన్ మోర్గాన్ (బి) ప్రసిధ్ కృష్ణ 14, విజయ్ శంకర్ (సి) ఇయాన్ మోర్గాన్ (బి) ఆండ్రీ రస్సెల్ 11, అబ్దుల్ సమద్ 19 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లు) 177/5

వికెట్ల పతనం : 1-10, 2-10, 3-102, 4-131, 5-150

బౌలింగ్ : హర్భజన్ సింగ్ (1-0-8-0), ప్రసిధ్ కృష్ణ (4-0-35-2), షకీబుల్ హసన్ (4-0-34-1), పాట్ కమ్మిన్స్ (4-0-30-1), ఆండ్రీ రస్సెల్ (3-0-32-1), వరుణ్ చక్రవర్తి (4-0-36-0)

Next Story

Most Viewed