జాగ్రత్త పడాల్సింది ప్రజలే: కేసీఆర్

by  |
జాగ్రత్త పడాల్సింది ప్రజలే: కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదు. ఇతర రకాల జబ్బులు తీవ్రంగా ఉన్నవారు మాత్రమే అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటివారు చాలా తక్కువ మంది. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్ ఉన్నవారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేనివారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని, ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్ర వైద్యారోగ్య అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై స్పష్టత ఇచ్చారు.

మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయడం కుదరదు: వైద్యులు

“కొందరు నిరంతరం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఇతర పిటిషన్లు వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తున్నది. దీనివల్ల మేం వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నది. ఏ కారణంతో మరణించినాసరే, వారందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలుకు సాధ్యం కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీరోజు సగటున 900- 1000 మంది వరకు మరణిస్తుంటారని, రాష్ట్రంలో ఏదో మూల ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారని, వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుందని వైద్యులు ప్రశ్నించారు. మృతదేహాలకు పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలను అందించడం సాధ్యమే కాదన్నారు. రకరకాల జబ్బులతో వచ్చేవారు, డెలివరీల కోసం వచ్చేవారు ఉంటారని, ఇప్పుడు కరోనాతో వస్తున్న వారు ఉంటున్నారని, ఇలాంటివారందరినీ వదిలేసి, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని సీఎంకు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ, కేంద్ర ప్రభుత్వంకానీ, ఐసిఎంఆర్ కానీ మృత దేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎక్కడా చెప్పలేదని, హైకోర్టు ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ యోగ్యం కాదని, ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాలని సీఎంకు వైద్యులు నొక్కిచెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో 247 మంది పేషెంట్లే ఉన్నారు

గాంధీ ఆసుపత్రిలో సుమారు రెండు వేల మందికి పైగా చికిత్స అందించగలిగే సామర్ధ్యం ఉందని, కానీ ప్రస్తుతం 247 మంది మాత్రమే కోవిడ్ వైరస్ సోకినవారున్నారని స్పష్టం చేశారు. వాస్తవం ఇలా ఉంటే కొంతమంది పనిగట్టుకుని గాంధీ ఆసుపత్రి కొవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి దగ్గర ఈ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో పిల్స్ వేస్తున్నారు. దీనివల్ల ప్రతీ రోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. రోజంతా ఆ పనితోనే సరిపోతున్నది. దీనివల్ల కరోనా కేసులతో పాటు, ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతున్నది. ఈ పిల్స్ లన్నీ నిజానికి ఉద్దేశ్యపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తున్నది. దీనివల్ల వైద్యాధికారుల విలువైన సమయం వృధా అవుతున్నది.

153 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్:

రాష్ట్రంలో ఇప్పటివరకు 153 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని, ఎవరికీ సీరియస్ కండిషన్ లేదని, తోటి వైద్య సిబ్బంది ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నామని వైద్యులు సీఎంకు వివరించారు. అందరూ చికిత్సకు కోలుకుంటున్నారని తెలిపారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదని ప్రచారం చేస్తూ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు గుర్తుచేశారు. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే దేశవ్యాప్తంగా 10 వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకిందని, అమెరికాలో ఇది 68 వేలుగా ఉందని, బ్రిటన్‌లో వైరస్ పేషెంట్లలో 15 శాతం మంది వైద్య సిబ్బందేనని సీఎంకు వివరించారు.

కరోనా మరణాలకు 95% ఇతర వ్యాధులే కారణం

కరోనా మరణాలుగా చెప్పబడేవన్నీ కేవలం కరోనా వల్ల సంభవించిన మరణాలు కాదని, దాదాపు 95 శాతం ఇతర కారణాలతో చనిపోయిన వారేనని వైద్యులు సీఎంకు వివరించారు. కిడ్నీ, గుండె, లివర్, శ్యాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, షుగర్, బిపి ఉన్నవారు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ, వారికి కరోనా పాజిటివ్ ఉంది కాబట్టి, కరోనాతోనే చనిపోయినట్లు నిర్థారిస్తున్నారని, ఇది అశాస్త్రీయమైన అవగాహన అని, ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతున్నదని సీఎంకు వివరించారు.

పాజిటివ్ ఉన్నా ఇంటికే పంపిన ‘గాంధీ’

కరోనా వ్యాధి ఉన్నప్పటికీ సీరియస్‌గా లేనివారిని గాంధీ ఆసుపత్రి నుంచి ఇండ్లకు పంపించేశారు వైద్యులు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏండ్ల వయస్సులోపు కోవిడ్ పేషేంట్లను గాంధీ ఆసుపత్రి నుంచి వారివారి ఇండ్లకు పంపించేశారు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. ఈ నిర్ణయంతో మొత్తం 393మంది కరోనా పాజిటివ్ పేషేంట్లు సోమవారం గాంధీ ఆసుపత్రి నుంచి ఇండ్లకు తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇండ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోం క్వారంటైన్కు, మిగతా 83 మందిని అమీర్పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు వివరించారు. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండే వీరి ఆరోగ్య స్థితిగతులపై ప్రజారోగ్య విభాగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పేషేంట్లు ఒకవేళ అనారోగ్యానికి గురైతే వెంటనే కోవిడ్ నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలిపి, తగిన సూచనలు, వైద్యం పొందవచ్చన్నారు.

Next Story

Most Viewed