రాజ్యసభకు నమస్తే తెలంగాణ ఎండీ..

by  |
రాజ్యసభకు నమస్తే తెలంగాణ ఎండీ..
X

టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు వెళ్ళేవారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. వచ్చే నెల జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే ఇద్దరూ టీఆర్ఎస్‌కు చెందినవారే. ఇందులో ఒకరు నమస్తే తెలంగాణ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ డి.దామోదరరావు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే దామోదరరావుకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరొకరి పేరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాలుగేళ్ళ క్రితమే దామోరరావును రాజ్యసభకు పంపించే ప్రతిపాదనను ఆయన ముందుంచారు. అయితే మియాపూర్ భూ కుంభకోణం తెరపైకి రావడంతో ఆ ప్రతిపాదన వెనక్కు పోయింది. అప్పటి నుంచి ప్రగతి భవన్‌కు వెళ్ళడం మానివేశారు. కేసీఆర్‌తో దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధం ఉన్న దామోదరరావు మియాపూర్ వ్యవహారం తర్వాత కేసీఆర్‌తో ఎప్పుడూ చర్చించలేదు. ఇటీవల మళ్ళీ వారిద్దరి మధ్య బంధం బలపడింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందుకు కేసీఆర్‌ తన వెంట దామోదరరావును కూడా తీసుకుని వెళ్ళారు. అదే సమయంలో కేశవరావు కూడా ఉన్నారు. దాంతోనే వీరిద్దరికీ ఈసారి రాజ్యసభ అవకాశం ఖరారు అనే సంకేతాలు వెళ్ళాయి. కేసీఆర్ ఢిల్లీకి దామోదరావును తీసుకెళ్ళడం చాలా అరుదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ ఆ సన్నివేశం చోటుచేసుకోలేదు. ఇదే మొదటిసారి. సందర్భం కాకున్నా తన వెంట తీసుకెళ్ళడాన్ని ఒక సంకేతంగానే భావించవచ్చు.

మరో సభ్యుడెవరనేదానిపై సందిగ్ధం కొనసాగుతోంది. ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశవరావుల్లో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. కేశవరావుకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు కేంద్రంలో పనులు చక్కబెట్టడంలో తగినంత పలుకుబడి, పరిచయాలు ఉన్నందున రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడతారనేది కేసీఆర్ భావన. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా కొనసాగుతున్నందున ఇదే పరిస్థితిని మరికొంతకాలం కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిసింది.

అయితే కేటీఆర్ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ కారణంగా రాజ్యసభకు పంపే ప్రతిపాదనతో ఆయనను సర్దిపుచ్చారు. ఆ ప్రకారంగా ఈసారి రాజ్యసభకు పంపించాల్సిందిగా కేటీఆర్ తన మనసులోని మాటను కేసీఆర్ ముందు ఉంచారు. ఆ ప్రతిపాదనను కేసీఆర్ వ్యతిరేకించకపోయినప్పటికీ రాజకీయ అవసరాల దృష్ట్యా కేశవరావువైపే మొగ్గు చూపుతున్నారు. తండ్రీ కొడుకుల మధ్య భిన్నాభిప్రాయం తలెత్తడంతో వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది. కేశవరావు తన బయోగ్రఫీ పుస్తకం అంశాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించి తాను ఎంపీగా ఉండగానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరారు. ఆ సందర్భంలో ‘ఏం.. ఇకపైన ఎంపీగా ఉండవని అనుకుంటున్నారా? అలాంటి అనుమానమేమైనా ఉందా? ఇప్పుడే పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిన తొందరేమీ లేదు. టైమ్ వచ్చినప్పుడు చూద్దాం. ఆందోళన అవసరం లేదు’ అంటూ కేశవరావుకు వివరించినట్లు సమాచారం. అంటే అప్పటికే కేశవరావును మరోసారి రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

కేసీఆర్ మాట ప్రకారమే కేశవరావుకు మరోసారి రాజ్యసభ అవకాశం లభిస్తే పొంగులేటిని శాసనమండలికి పంపే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ నుంచి ఓడిపోయినందున కవితను రాజ్యసభకు పంపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ మదిలో మాత్రం ప్రజల ఓటుతో ఓడిపోయినందున మళ్ళీ ప్రజామోదంతోనే లోక్‌సభకు పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల కవితను రాజ్యసభకు కాకుండా లోక్‌సభకు మాత్రమే పంపాలనుకుంటున్నట్లు సమాచారం. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేదా మందా జగన్నాధం లేదా మైనారిటీ నాయకులు లేదా ఎస్టీ నాయకుడు… ఇలా అనేక రకాలుగా వార్తలు వచ్చినా చివరకు దామోదరరావు పేరు ఖరారైంది. పొంగులేటి, కేశవరావుల్లో మరొకరికి అవకాశం లభించనుంది.


Next Story

Most Viewed