జూన్13న జర్నలిస్టుల ఉపవాస దీక్ష

by  |
జూన్13న జర్నలిస్టుల ఉపవాస దీక్ష
X

దిశ, హైదరాబాద్: కరోనా కాటుకు గురవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 13న హైదరాబాద్‌లో జర్నలిస్టులు ఒక రోజు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో జరిగిన యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో జర్నలిస్టుల స్థితిగతులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు మాట్లాడుతూ.. కరోనా ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం అపహాస్యం చేయడం సరైనది కాదన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే కరోనా బారిన పడి పాత్రికేయుడు మనోజ్ బలైపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకొనే విషయంలో కూడా ముందుకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది పాత్రికేయులు కరోనా కాటుకు గురై చికిత్సపరంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీయూడబ్ల్యూజే ఆందోళనకు పూనుకుంటున్నట్లు వారు వెల్లడించారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రత్యేక ఆసుపత్రి కేటాయించాలి

కరోనా కాటుకు గురైన మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని కేటాయించాలన్నారు. అత్యవసర సేవల విభాగం కింద పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 50 లక్షల ఆరోగ్య బీమాను జర్నలిస్టులకు కూడా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఆయా డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో జర్నలిస్టులను ఆదుకోవడానికి తాము భిక్షాటనకు సిధ్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనాపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే జూన్ 13న ఉపవాస దీక్ష చేస్తున్నామని, జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జర్నలిస్టుల సంఘాలు ఈ దీక్షకు కలిసి రావాలని శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీలు కోరారు. జర్నలిస్టుల కష్టాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని, గవర్నర్‌ను కలువనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు అజిత, రాములు, హబీబ్ జిలానీ, స్వామి, రియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story