భిక్షగాళ్లకు భారీగా ఉద్యోగావకాశాలు.. ప్రభుత్వ లక్ష్యం ఇదే!

by  |
begger-1
X

దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలో భిక్షగాళ్లు ఎక్కడపడితే అక్కడే దర్శనమిస్తుంటారు. విద్యాలయాలు, టెంపుల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్‌పాత్స్, షాపింగ్ కాంపెక్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడే డబ్బులు యాచిస్తూ పొట్టకూటి కోసం నానా తంటాలు పడుతుంటారు. అందులో వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే, ఇటీవల కొందరు పనిచేయగల సామర్థ్యం ఉండి కూడా పని దొరక్క యాచక వృత్తివైపు మళ్ళుతున్నారు. వికలాంగులు, చిన్నపిల్లలు అంటే చెప్పనక్కరలేదు. సిగ్నల్స్ పడిన సమయంలో వాహనాలు వేగంగా కదులుతున్నా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ యాచిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ వృత్తిలో ఎందుకు కొనసాగుతున్నారంటే దాని వెనుక ఎంతో విషాదం ఉండే ఉంటుంది. కొందరు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, అనాథ పిల్లలు, కుటుంబం నుంచి బహిష్కరించబడిన వారు ఇలా ఎందరో రోజువారీగా యాచిస్తూ జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు. జానెడు పొట్ట నింపుకోవడానికి రోడ్ల పక్కన, పుట్‌పాత్‌లపై, బస్టాండ్ సెంటర్లలో నిద్రిస్తూ తెల్లవారితే బతుకు పోరాటంలో నిమగ్నమవుతుండటం వీరికి అలవాటే.

అయితే, ఇలాంటి వారి జీవితాలు మెరుగుపరిచేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. శరీరంలో అన్ని భాగాలు సరిగా ఉండి.. కష్టపడే తత్వం ఉన్నా యాచిస్తూ జీవనం సాగించే వారిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. యాచక వృత్తిని వదిలేసి వారి కాళ్లపై వారు నిలబడేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. అందుకోసం వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా ఓ పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో పాటు 60 మంది యాచకులకు ఉద్యోగాలు కల్పించింది.

కొత్త కోర్సులు..

వొకేషనల్‌ ట్రైనింగ్ ఫర్‌ లైఫ్‌ విత్‌ డిగ్నిటీ పేరుతో రాజస్థాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్‌లీ హుడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా యాచకులకు సంవత్సరం పాటు వృత్తిపరమైన కోర్సుల్లో అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత వారే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

beggers--3

అయితే, నైపుణ్యం పొందిన యాచకులకు ఉద్యోగం కల్గించే బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది. తమ రాష్ట్రంలో ఇక మీదట యాచకులు అనే వారు ఉండకూడదనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ డైరెక్టర్‌ నీరజ్‌ కె. పవన్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎంత మంది యాచకులు ఉన్నారో లెక్కలు తీసి, అందులో పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా చేయడం వలన యాచకులందరికీ మంచి జీవితం కలుగడమే కాకుండా రోడ్లపై డబ్బులు అడుక్కునేవారిని క్రమంగా తగ్గించాలని చూస్తోంది. గతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై యాచిస్తూ ప్రమాదంలో మరణించిన వారు అనేకం ఉన్నారు. వారికి పత్యేకంగా ట్రెయినింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తే ప్రమాదంలో చనిపోయే యాచకుల సంఖ్యను తగ్గించవచ్చునని ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టు సమాచారం.

వొకేషనల్‌ ట్రైనింగ్ ఫర్‌ లైఫ్‌ విత్‌ డిగ్నిటీ పేరిట మొదట రాష్ట్రంలో 100 మంది యాచకులకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రస్తుతం 60 మంది శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగాలు పొందారు. మిగిలిన వారు శిక్షణ తీసుకొని, ఉద్యోగంలో చేరేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు అధికారుల తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed