భారత్‌లో ఈ ఏడాది భారీగా ఐటీ నియామకాలు!

by  |
భారత్‌లో ఈ ఏడాది భారీగా ఐటీ నియామకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఇటీవల ఐటీ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజాలు వివిధ స్థాయిల్లో ఐటీ నిపుణులను తీసుకుంకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్విస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ దిగ్గజ సంస్థ క్రెడిట్ సూయిస్ భారత్‌లో 1,000కి పైగా టెక్ నిపుణుల నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదిలోగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, ఏపీఐ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఇంజనీర్లు, డెవలపర్లను నియమించుకోనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకునేందుకు, అంతర్జాతీయంగా కంపెనీ సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ను నిలిపేందుకు ఈ ప్రణాళికలు దోహదపడతాయని కంపెనీ అభిప్రాయపడింది. ఇందులో భాగంగానే కంపెనీ భారత్‌లో వివిధ విభాగాల్లో భారీగా నియామకాలు చేపట్టనున్నట్టు, ఇప్పటికే దేశీయంగా సామర్థ్యాన్ని పెంచేందుకు అందుబాటులో నైపుణ్యం కలిగిన 2 వేల మంది ఐటీ ఉద్యోగులను నియమించుకున్నట్టు సంస్థ వివరించింది.

క్రెడిట్ సూయిస్ కంపెనీ బాటలోనే దేశంలోని మొదటి ఐదు ఐటీ కంపెనీలు లక్షల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ గత నెలలో ఈ ఏడాది చివరి నాటికి 40 వేల మందిని నియమించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం 25 వేల మంది కొత్త ఐటీ ఉద్యోగులను తీసుకోనున్నట్టు పేర్కొంది. ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా కంపెనీలు ఈ ఏడాది 1,10,000 మందికి పైగా ఉద్యోగులను నియమించనున్నాయని, గతేడాది ఈ సంఖ్య 90 వేలుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed