- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఈ సారైనా హైదరా‘బాద్‌షా’ అయ్యేనా?
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు.

దిశ, స్పోర్ట్స్ : గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. లీగ్ చరిత్రలోనే మూడుసార్లు రికార్డు హయ్యెస్ట్ స్కోరు నమోదు చేసిందంటే ఆ జట్టు విధ్వంసాన్నిఅర్థం చేసుకోవచ్చు. దూకుడు ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో భంగపాటు గురై రన్నరప్‌తో సరిపెట్టింది. 2016లో తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. చివరిసారి కూడా అదే. గతేడాది తృటిలో టైటిల్ కోల్పోయింది. కానీ, ఈ సారైనా ఎలాగైనా టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తోంది. ఈ నెల 22 నుంచి లీగ్ ప్రారంభంకానుండగా.. ఆ మరుసటి రోజు 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్-2024లో పాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. 2020 తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడమే కాకుండా 2018 తర్వాత ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ అందించిన కమిన్స్ నాయకత్వం హైదరాబాద్ ప్రదర్శన మెరుగుపడటానికి ఓ కారణం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు మరో కారణంగా చెప్పుకోవచ్చు. విధ్వంసకర ఆటతీరుతో హైదరాబాద్.. ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది. బెంగళూరుపై చేసిన స్కోరు 287/3 టోర్నీ చరిత్రలోనే హయ్యెస్ట్ టోటల్. ముంబైపై 277/3 స్కోరు చేయగా. ఢిల్లీపై 266/7 స్కోరు చేసింది. మొత్తంగా నాలుగుసార్లు 200కిపైగా పరుగులు చేసింది. ఈ సారి హైదరాబాద్ అదే విధ్వంసకర ఆటతీరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వేలంలో బలాన్ని పెంచుకుని..
హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ కమిన్స్, అభిషేక్ శర్మ, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లను రిటైన్ చేసుకుంది. మెగా వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, ఆడమ్ జంపా లాంటి స్టార్లను తీసుకుని బలాన్ని మరింత పెంచుకుంది. వీరి రాకతో ఈ సారి నిరుడుతో పోలిస్తే బలంగా కనిపిస్తున్నది. కాబట్టి, ఈ సారి కూడా ప్రత్యర్థి జట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌తో సవాల్ తప్పదు. హెడ్, అభిషేక్, క్లాసెన్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. గత సీజన్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 303 రన్స్ చేశాడు. ఆ సంచలన ప్రదర్శనతో ఏకంగా భారత జట్టు నుంచి పిలుపు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అతనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇషాన్ కిషన్, కామిందు మెండిస్ వారికి తోడవనున్నారు. ఇక, హైదరాబాద్ అంటేనే ప్రత్యేకంగా బౌలింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఈ సారి కూడా బౌలింగ్ దళానికి ఢోకా లేదు. మహ్మద్ షమీ చేరికతో జట్టు బలం మరింత పెరిగింది. చాంపియన్స్ ట్రోఫీలో అతను సత్తాచాటి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక, గత సీజన్‌లో యువ బౌలర్ హర్షల్ పటేల్ 24 వికెట్లు పడగొట్టాడు. అతనే టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం. అతను అదనపు బలం కానున్నాడు. కమిన్స్ ఎలాగూ ఉన్నాడు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లతో స్పిన్ యూనిట్ కూడా బాగానే ఉంది. జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, సీమర్‌జీత్ సింగ్ వంటి ప్రతిభావంతులు కూడా బౌలింగ్ దళంలో ఉన్నారు.
కెప్టెన్ ఆడతాడా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత పాట్ కమిన్స్ చీలమండల గాయం బారినపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా అతను శ్రీలంక పర్యటనతోపాటు చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో పాల్గొనడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. చీలమండలం బాగానే ఉందని, ఎస్‌ఆర్‌హెచ్‌కు మళ్లీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని గత నెలలో ఓ మీడియా సంస్థతో తెలిపాడు. అయితే, అతని రాకపై ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా స్పష్టతనివ్వలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సీజన్‌లో మెజార్జీ గ్రూపు మ్యాచ్‌లకు అతను దూరమవుతాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతను దూరమైతే క్లాసెన్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
పాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, కామిందు మెండిస్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, రాహుల్ చాహర్, సీమర్‌జీత్ సింగ్, ఈషన్ మలింగ, వియాన్ ముల్డర్, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేజీ, అనికేత్ వర్మ.






