వాంఖడేలో గర్జించిన సంజూ శాంసన్.. ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యం!

by Ramesh Naini |   (  Updated:2026-04-23 16:11:34  IST  )

ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు.

వాంఖడేలో గర్జించిన సంజూ శాంసన్.. ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్‌ (MI)తో గురువారం వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసక్తికర పోరులో సంజూ అద్భుతమైన అజేయ సెంచరీతో (101*) కదం తొక్కాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై విజయానికి 208 పరుగుల కఠిన లక్ష్యం నమోదైంది.

సంజూ విధ్వంసం.. ఇన్నింగ్స్ సాగిందిలా!

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కేకు సంజూ శాంసన్‌ వెన్నెముకలా నిలిచాడు. ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగి ఆడాడు. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఫోర్‌ బాది సెంచరీ మార్కును చేరుకోవడం విశేషం. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూకి ఇది రెండో శతకం కావడం గమనార్హం. మరోవైపు మిగతా బ్యాటర్ల నుంచి అతనికి మోస్తరు సహకారం లభించింది. రుతురాజ్ గైక్వాడ్‌ (22), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (21) ఫర్వాలేదనిపించగా.. కార్తీక్ శర్మ (18), జామీ ఓవర్టన్ (15) పరుగులతో రాణించారు. అకేల్‌ హసేన్‌ (2*) శాంసన్‌తో పాటు నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లు చెన్నై స్కోర్ వేగాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ముంబై బౌలర్లలో ఏఎం గజన్‌ఫర్‌, అశ్విన్ కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టి చెన్నైని కొంతమేర కట్టడి చేసే ప్రయత్నం చేశారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్‌లకు చెరో వికెట్ దక్కింది.

అభిమానులకు మరో ఎదురుదెబ్బ..ధోని రావ‌డం ఇక‌ క‌ష్ట‌మే!

Next Story