IPL 2026: కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం.. రాజస్థాన్‌ను కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-19 13:20:55  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు తడబడ్డారు.

IPL 2026: కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం.. రాజస్థాన్‌ను కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రాజస్థాన్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి తన మెరుపులు మెరిపించాడు. ఓపెనర్‌గా వచ్చిన సూర్యవంశీ కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (39; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు వేగంగా పరుగులు జోడించినప్పటికీ, వారు అవుట్ అయిన తర్వాత రాజస్థాన్ స్కోరు నెమ్మదించింది. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందిపుచ్చుకోలేకపోయారు హెట్‌మయర్ (15), కెప్టెన్ రియాన్ పరాగ్ (12) సహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో రాజస్థాన్ కనీసం 160 పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది.

మెరిసిన వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి..

కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో కార్తీక్ త్యాగి 19వ ఓవర్‌లో వరుసగా వికెట్లు తీసి రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. సునీల్ నరైన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 156 పరుగులు చేయాల్సి ఉంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో కేకేఆర్ ఈ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుందా లేక రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

IPL లో నేడు డబుల్ ధమాకా

Next Story