అత్త రాకతో… అల్లుడు దూరం!

by  |
అత్త రాకతో… అల్లుడు దూరం!
X

దిశ, రంగారెడ్డి: ఒకప్పుడు అన్ని తానై వ్యవహరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అతనే ముందుండేవారు. కేసీఆర్, కేటీఆర్ లతో సన్నిహితంగా మెలిగి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ, ఇప్పుడు అత్త ఇటువైపు అడుగులేసింది. ఈ సందర్భంతో అల్లుడు అన్నింటికీ దూరమయ్యారని ప్రచారం జోరుగా సాగుతోన్నది.

కరోనా సమీక్షలకు దూరం…

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న విపత్కర సమయంలో అందరూ కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా రెడ్ జోన్ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మంత్రి వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. కరోనా వైరస్ నివారణకు సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. కానీ, ఒక్కరోజు కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొనలేదు. అంతేకాకుండా మహేందర్ రెడ్డి కి తన సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మద్దతు మాత్రమే ఉంది. వికారాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ, అందరూ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అంతర్గత మద్దతు పలుకుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి దూరంగా ఉంటారు. మంత్రి సబిత సమీక్షలకు పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి హాజరుకావడంలేదు. ఇది మంత్రి మీద కోపమో.. మహేందర్ రెడ్డికి మద్దతు గానో కాదు. కేవలం పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ ఎమ్మెల్యేలకు అంతర్గత వైరం ఉండటంతో సమీక్షలకు హాజరుకావడం లేదని సమాచారం.

నియోజకవర్గానికే పరిమితం…

తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం పట్నం మహేందర్ రెడ్డికి పేటెంట్ అన్నట్లు ఉండేది. ఆ నియోజకవర్గం గత ఎన్నికల్లో చేజారిపోయింది. అంతేకాకుండా పట్నంపై గెలిచిన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పట్నం పట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో కోల్పోయారు. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న పట్నం, పైలెట్ రోహిత్ రెడ్డిలు కరోనా కారణంగా కలిసిపోతున్నారు. నియోజకవర్గ స్థాయిలో పట్టు పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు. కానీ, జిల్లాకు, నియోజకవర్గానికి మంత్రి సబిత వచ్చినప్పుడు పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునితా రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలు హాజరుకావడంలేదు. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమ్ముడు సైతం దూరం..

వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి.. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్. అయితే కొడంగల్ నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగా నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇతను నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానిస్తున్నారు. జిల్లా మంత్రి సబితను వ్యతిరేకిస్తున్నారు. దీనికంతటికీ ఒకటే కారణం టీఆర్ఎస్ లో సబిత చేరడంతో మా అన్నకు మంత్రి పదవి లభించలేదనే ఉద్దేశంతో వ్యవరిస్తున్నారు. అంతర్గతంగా కొనసాగుతున్న ఈ వర్గపోరు బహిర్గతం అవుతదా… లేక సద్ధుమనుగుతదా అనేది వేచి చూడాలి.

Next Story

Most Viewed