ప్రైవేట్ ఉపాధ్యాయుడి ఆమరణ నిరాహార దీక్ష

by  |
ప్రైవేట్ ఉపాధ్యాయుడి ఆమరణ నిరాహార దీక్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు పూర్తి వేతానాలు చెల్లించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుడు రవి కుమార్ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులతో పని చేయించిన విద్యాసంస్థల యాజమాన్యాలు సగం వేతనాలు చెల్లించడాన్ని నిరసిస్తూ రామంతపూర్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న రవికుమార్ మంగళవారం మధ్యాహ్నం నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. బుధవారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బిర్ అలీ ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో రోజూ 10 గంటలు పనిచేయించి సగం వేతనాలు ఇస్తూ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తమ శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ క్లాసులు చెప్పాలని, ఫీజులు వసూలు, అడ్మిషన్లు చేయాలని యాజమాన్యాలు ఆదేశించాయన్నారు. చెప్పిన పని చేశాక సగం వేతనాలు చెల్లించాడని ప్రశ్నిస్తే ఉంటే ఉండు.. లేదాంటే వెళ్లిపోమన్నడం సబబు కాదన్నారు. రాష్ట్రంలోని చైతన్య, నారాయణ సంస్థలు ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఉద్యోగుల వేతనాలపై సరైన నిర్ణయం తీసుకునే వరకూ దీక్ష విరమించేది లేదని తెలిపారు.


Next Story