అందుకు భారత్ అనువైన దేశం : నీతీ ఆయోగ్ సీఈవో

by  |
అందుకు భారత్ అనువైన దేశం : నీతీ ఆయోగ్ సీఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వ్యాపార వాతావరణం నిరంతరం మెరుగుపడుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు, సంపద సృష్టించేందుకు అనువైన దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని శుక్రవారం నీతి ఆయోగ్ (Nithi Aayog) సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రపంచ బ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ రిపోర్టు’ (Doing Business Report)ను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించిన ఒకరోజు తర్వాత అమితాబ్ కాంత్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

వ్యాపార వాతావరణానికి సంబంధించి ఏ దేశాలు ర్యాంకింగ్ జాబితా (Ranking list)లో ఉన్నాయనే డేటాలో అవకతవకల కారణంగా ఈ ఏడాది ప్రపంచ బ్యాంకు రిపోర్టు (World Bank Report)ను వాయిదా వేసింది. ‘భారత్‌లో వ్యాపార వాతావరణం మెరుగవుతోంది. ప్రపంచ బ్యాంకు సూచిక ఆధారంగా కాదు, సులభమైన-సరళమైన విధానాలతో ఇది మెరుగ్గా ఉందని’ కాంత్ వివరించారు.

ఎంఎస్ఎంఈలు, వ్యాపారాలు, స్టార్టప్‌లకు ప్రయోజనాలు కల్పిస్తూ భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, సంపద సృష్టించడానికి సులభమైన దేశాల్లో ఒకటిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో(2014-19) భారత్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 79 స్థానాలు ఎగబాకింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానానికి చేరుకుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంకు నిర్ణయం గురించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు బిజినెస్ డూయింగ్ రిపోర్టులో జరిగిన అవకతవకలపై తగిన దర్యాప్తు జరిపి, వీలైనంత తొందరగా రిపోర్టును వెల్లడించాలన్నారు. ప్రపంచ బ్యాంకు (World Bank) గురువారం ప్రకటనలో 2017 నుంచి 2019 వరకు నివేదించిన డూయింగ్ బిజినెస్ రిపోర్టులలో అవకతవకలు జరిగాయని తెలిపింది. డేటాలో ఉన్న మార్పులు డూయింగ్ బిజినెస్ పద్దతికి భిన్నంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.


Next Story

Most Viewed