45 ఏళ్ల తర్వాత.. భారత్, చైనా సరిహద్దులో మరణాలు

by  |
45 ఏళ్ల తర్వాత.. భారత్, చైనా సరిహద్దులో మరణాలు
X

న్యూఢిల్లీ: భారత, చైనా సరిహద్దు మరోసారి రక్తసిక్తమైంది. ఇరుదేశాల సైన్యం మధ్య గతనెలలో మొదలైన ఘర్షణలు సోమవారం రాత్రి హింసాత్మకంగా మారాయి. లడఖ్‌లోని గాల్వాన్ లోయ గుండా పోతున్న ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ)కు ఇరువైపులా సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లతోపరస్పరం భౌతిక దాడికి దిగినట్టు తెలిసింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఓ మిలిటరీ అధికారితోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. చైనా వైపునా కనీసం ముగ్గురు సైనికులు మృతి చెందారని సమాచారం. కాల్పులు జరుపుకోలేదనీ, రాళ్లు,
రాడ్లతోనే పరస్పర దాడులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో పరిస్థితులను చక్కబెట్టేందుకు ఇరుదేశాల సీనియర్ మిలిటరీ అధికారులు సమావేశమయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతలు అదుపులోనే ఉన్నాయని, ఇరుపక్షాల చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలు సమసిపోతాయని భారత్‌, చైనాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిహద్దులో శాంతిపున:స్థాపించేందుకు ఇరుదేశాలకు చెందిన మిలిటరీ, దౌత్య అధికారుల స్థాయి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘర్షణలు చోటుచేసుకోవడం
గమనార్హం.

మీరంటే మీరు..

ఈ హింసాత్మక ఘటనపై ఇరుదేశాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలను పరిష్కరించే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయని భారత ఆర్మీ వెల్లడించింది. ఈ ఘర్షణలే ఉద్రిక్తంగా మారి జవాన్ల ప్రాణాలను బలిగొన్నాయని తెలిపింది. కాగా, చైనా దీన్ని ఖండించింది. భారత సైనికులు సోమవారం రెండు సార్లు సరిహద్దు దాటి వచ్చారని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని, వాటి ఫలితంగానే హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. భారత సైన్యం దుందుడుకు చర్యలను మానుకోవాలని, ఏకపక్ష చర్యలకు పూనుకుంటే సరిహద్దులో
పరిస్థితులు మరింత దిగజారుతాయని అన్నారు. భారత సైన్యం వెనక్కి తగ్గాలని తెలిపారు. కాగా, ఇటీవలే ఇరుదేశాల సైనికులు సరిహద్దు వీడి వెనక్కి మరలాలన్న నిబంధనను అంగీకరించాయి. కానీ, చైనా సైన్యం మాత్రం వెనక్కి వెళ్లలేదని కొన్ని వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌లతో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని మోడీకి ఘటనా వివరాలను తెలియజేశారు.

భారత జవాన్ల మరణం పట్ల రాజకీయ పార్టీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వారి మరణాలు వృథా పోరాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొనగా, శాంతి చర్చలు జరుగుతుండగా దాడులు జరుగుతున్నాయంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతున్నాయని ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

1975 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

భారత్, చైనా సరిహద్దులో దాదాపు 45 ఏళ్ల తర్వాత సైనికుల మరణాలు చోటుచేసుకున్నాయి. 1975లో పెట్రోలింగ్ చేస్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లపై చైనా మిలిటరీ విరుచుకుపడింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ఏరియాలో జరిపిన ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత మళ్లీ తాజాగా, సోమవారం రాత్రి ఘటనలో మనదేశ సైనికులు అమరులయ్యారు. అయితే, భారత్, చైనా మధ్య చివరిసారిగా ఘర్షణలు 1967లోనే జరిగాయన్న సాధారణ అభిప్రాయం ఉన్నది. అప్పుడు సుమారు 800 మంది భారత సైనికులు, దాదాపు 400 మంది జవాన్లు ప్రాణం త్యాగం చేశారు.



Next Story

Most Viewed