వేరుశనగ సాగుకు ప్రోత్సాహకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
Peanut Crop
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్న వేరుశనగ పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం మోర్బీ జిల్లా అలువద్ తాలూకా సుఖ్ పూర్ గ్రామంలోని వేరుశనగ క్షేత్రాన్ని, మోర్బీ గ్రామ సమీపంలో బోన్ విల్లే ఫుడ్స్ లిమిటెడ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు దారి మళ్లించాల్సిన అవసరముందని తెలిపారు.

గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణలోని వేరుశనగ విత్తన నాణ్యత ఎంతో ఎక్కువగా ఉంటుందన్నారు. గుజరాత్‌లో అక్టోబర్ నుండి చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుండటంతో వర్షాకాలం సాగులో వేరుశనగను సాగు చేస్తారని తెలిపారు. దీనిమూలంగా అధిక వేరుశనగ దిగుబడి సాధించినప్పటికీ అఫ్లాటాక్సిన్ ఫంగస్ రహిత (శిలీంధ్రం) వేరుశనగ దిగుబడి అసాధ్యమని వివరించారు. రాష్ట్రంలో యాసంగిలో వేరుశనగ సాగు పెంపునకు సంపూర్ణ అవకాశాలున్నాయని, అక్టోబర్‌లో వేరుశనగ సాగు ప్రారంభిస్తే జనవరి చివరివారం, ఫిబ్రవరి మొదటివారంలోపు ఊష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటకుండానే పంట చేతికి వస్తున్నాయని పేర్కోన్నారు.

రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నా ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని తెలిపారు. వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనతో విస్తృతంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ దశ మారిపోతుందని అభిప్రాయ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతుల నేపథ్యంలో స్పష్టమయిన ప్రణాళికతో రైతులను సాంప్రదాయ పంటల నుండి బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వరి కన్నా తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఇచ్చే వాణిజ్యపంటలను సాగు చేయాలి సూచించారు.


Next Story

Most Viewed