వైద్యశాఖలో మరో పంచాయితీ.. మంత్రి హరీష్‌కు సవాల్

108

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పీజీ చదివేందుకు సర్కార్ కల్పించే ఇన్​సర్వీస్ కోటా ప్రత్యేక రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇన్​సర్వీస్​కోటా ఇవ్వడం వలన తమకు అన్యాయం జరుగుతుందంటూ జూడాలు, తక్కువ శాతం ఇచ్చారంటూ సర్కార్​ వైద్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేస్తే బాగుంటుందని అధికారులు అంతర్గతంగా పరిష్కారాన్ని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే రెండు వర్గాల డాక్టర్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావును ప్రత్యేకంగా కలిసి సమస్యలను వివరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన రెండు వర్గాలకు హామీ ఇచ్చారు. కానీ ఇన్ సర్వీస్​ కోటాపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.155ను వెంటనే రద్దు చేయాలంటూ జూడాలు గత రెండు రోజులుగా టీచింగ్​ ఆసుపత్రుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యులు కూడా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

20 రోజుల పాటు రీసెర్చ్..

2017లో రద్దైన ఇన్ సర్వీస్​కోటా సుమారు మూడేళ్ల తర్వాత పున:ప్రారంభమైంది. కానీ, దీన్ని షురూ చేసే ముందే డాక్టర్ల నుంచి వచ్చే సమస్యలు, నష్టాలు, ఉపయోగాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఆ కమిటీలో డీఎంఈ డా రమేశ్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌‌, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డా. శ్రీనివాస రావులు ఉన్నారు. వీరు ఇన్​సర్వీస్​కోటా అమలుపై 20 రోజుల పాటు స్డడీ చేసి సర్కార్‌కు రిపోర్టును అందించారు. నాన్​క్లినికల్ విభాగంలోని 40 శాతం, క్లినికల్‌లో 20 శాతం సీట్లను కేటాయించాలని కమిటీ సూచించింది.

దీని వలన సర్కార్​ ఆసుపత్రుల్లో వైద్యులు పెరగడమే కాకుండా, గ్రామాల్లోనూ వైద్యసేవలు మరింత మెరుగవుతాయని వివరించారు. కానీ, ప్రభుత్వం క్లినికల్‌లో 20 శాతం, నాన్​క్లినికల్‌లో 30 శాతాన్ని కుదిస్తూ ఇన్​సర్వీస్​కోటా కింద అప్రూవ్​చేసింది. అయితే, దీన్ని జూడాలు వ్యతిరేకిస్తున్నారు. దీని వలన రెగ్యులర్‌గా చదువుతున్న వారికి సీట్లు తగ్గుతాయని, కావాలంటే సర్వీస్‌లో ఉన్నోళ్లకు 30 శాతం వెయిటేజ్​ఇవ్వాలని గాంధీ జూనియర్ డాక్టర్ కార్తిక్ తెలిపారు.

ప్రైవేట్‌లోనూ ఇవ్వండి..

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటున్న ఇన్​సర్వీస్ కోటా శాతాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరుతున్నారు. దీని వలన తమకు లాభం జరగడమే కాకుండా, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పబ్లిక్​హెల్త్​డాక్టర్స్​అసోసియేషన్​ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి జనార్ధన్​పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 4 సర్కార్​ఆసుపత్రులతో పాటు 13 ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు లభిస్తాయన్నారు. ఫీజులు కూడా తామే భరిస్తామన్నారు. అంతేగాక ప్రైవేట్‌లో పీజీ పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా పదేళ్లు సర్కార్‌లోనే సేవలు అందిస్తామన్నారు. అవసరమైతే ఆ గడువును పొడిగించినా పర్వాలేదన్నారు. జీవో నెం.155 తమ గొంతు కోసే విధంగా ఉన్నదని, దానిలో మార్పులు చేస్తూ ప్రైవేట్​కాలేజీలకు వర్తింపచేయాలన్నారు. తాము ప్రజలకు సేవ చేస్తున్న వాళ్లమని, కావున ప్రభుత్వం కనికరం చూపాలని విజ్ఞప్తి చేశారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..