యుద్ధ నౌకలపై ధీర వనితలు

by  |
యుద్ధ నౌకలపై ధీర వనితలు
X

న్యూఢిల్లీ: నేవీలో లింగసమానత్వానికి మరో కీలక అడుగు పడింది. యుద్ధ నౌకల పై ధీర వనితల సేవలందించడానికి మరో దారి తెరుచుకుంది. సైన్యం చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు నౌకల పై నుంచి హెలికాప్టర్లను ఆపరేట్ చేయనున్నారు. ఇందులో ఒకరు మన హైదరాబాద్ మహిళనే కావడం గమనార్హం. సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్, సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగిలు తొలి మహిళా ఎయిర్‌బోర్న్ టాక్టిషియన్లుగా మెరవనున్నారు. కొచ్చిలోని దక్షిణాది నావల్ కమాండర్ నుంచి అబ్జర్వర్ కోర్సును వీరు విజయవంతంగా పూర్తి చేసుకుని యుద్ధ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.

కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లయిన వీరిరువురు 2018లో నేవీలో చేరారు. యుద్ధ నౌకలపై మహిళలు సేవలందించడం ఇది మొదటిసారేమీ కాదు. సముద్రపు ఒడ్డున హెలికాప్టర్లను నడిపి మళ్లీ అక్కడే ల్యాండ్ చేసే కార్యాలూ మహిళలు చేస్తున్నారు. కానీ, నౌకల పై నుంచి సముద్రం పైన హెలికాప్టర్లను ఆపరేట్ చేస్తూ శత్రువుల కదలికలను డేగ కన్నేయడంలో ఇప్పటి వరకు పురుషులదే ఆధిపత్యం.

ఇక ఈ సేవలను వీరిద్దరు మహిళలు అందించనున్నారు. ఫలితంగా నౌకాదళంలోనూ ముందుశ్రేణి సేవల్లోకి మహిళలకు దారివేసినవారయ్యారు. ప్రపంచస్థాయి సాంకేతికత గల ఎంహెచ్60-ఆర్ హెలికాప్టర్లను వీరు నడపనున్నారు. సెన్సార్లు, సోనార్ కన్సోల్స్, ఇంటెలిజెన్స్, సర్వెలెన్స్ రికనసెన్స్ ప్లే లోడ్లతో ఉండే ఈ హెలికాప్టర్లను తొలిసారిగా మహిళలు ఆపరేట్ చేయనుండటం గమనార్హం. వీటి ద్వారా శత్రువుల షిప్పులు, సబ్‌మెరైన్లను పసిగట్టనున్నారు.

సైన్యంలో మూడో తరం

సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ హైదరాబాదీ. తన తండ్రి, తాతలు సైన్యంలో సేవలందించారు. ఇప్పుడు తాను మూడో తరం. తాత ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్‌లో చేయగా, తండ్రి నేవీలో బాధ్యతల నిర్వహించారు. వైట్ యూనిఫామ్‌ ధరించి దేశానికి సేవచేయడం తన కల అని రితి సింగ్ చెప్పుకొచ్చారు. గజియాబాద్‌కు చెందిన సబ్ లెఫ్టినెంట్ త్యాగి మాట్లాడుతూ, నేవీ సిబ్బంది భూమి, గగనం, నీటిలో సేవలందిస్తారని, ఈ సవాలును స్వీకరించాలనుకున్నారని చెప్పారు.

Next Story