‘మణికొండ’ అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకులు..!

by  |
‘మణికొండ’ అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మణికొండ మున్సిపాలిటీల్లోని 90 శాతం కాలనీల్లో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. 150 నుంచి 250 గజాల్లోనే ఆరేడు అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆ మున్సిపాలిటీని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు కలిసి పంచుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమాల పుట్టలు తొలగించండంటూ స్థానికులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పాలకులు అడ్డుకుంటున్నారు. పురపాలక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా వారి అనూయుల కోసం అధికారులపై ఒత్తిడి చేయడం లేదని సమాచారం. మూడు పార్టీల ప్రజాప్రతినిధులు అక్రమాలకు మద్దతుగా నిలుస్తుండడంతో మణికొండ మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది.

పుప్పాలగూడలో బహుళ అంతస్థులు

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ రెవెన్యూ గ్రామాల్లో లెక్కకు మించిన అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కానీ మున్సిపాలిటీ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన కౌన్సిలర్లు వారికే మద్దతునిస్తున్నారు. కాలనీ అసోసియేషన్లు తమ కాలనీలో ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా, 200 గజాల స్థలంలోనే ఆరేడు అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారని, రోడ్లన్నీ ఇరుకుగా మారుతున్నాయంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా వారేం పట్టించుకోవడం లేదు. పుప్పాలగూడలో సర్వే నంబరు 238.. వినాయక్ నగర్ ఫేజ్ 2లో ప్లాట్ నంబర్లతో సహా ఎక్కడెక్కడ ఎలాంటి బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారో కాలనీ అసోసియేషన్ గతంలో మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీలోని వాతావరణం చెడిపోతుందని పేర్కొన్నారు. ఆఫీసు నుంచి రశీదు ఇచ్చారు. ఫిర్యాదు కాపీలను మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పురపాలక శాఖ డైరెక్టర్ డా.ఎన్.సత్యనారాయణలకు కూడా పంపారు. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 13న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఐతే పునాదులు తీసేటప్పుడు ఇస్తే ఎలాంటి యాక్షన్ లేదు. దాంతో యథేచ్ఛగా నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పుడేమో 200 గజాల్లోనే ఐదారు అంతస్థుల భవన నిర్మాణం పూర్తయ్యింది.

లీడర్లే అక్రమార్కులు..

మణికొండ మున్సిపాలిటీలోని ప్రతి అక్రమ నిర్మాణం వెనుక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, లీడర్, వారి అనుచరుల్లో ఎవరో ఒకరు ఉంటున్నారు. అధికారులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారు. కొందరు కాలనీ అసోసియేషన్ సభ్యులు కూడా అక్రమ నిర్మాణాలు జరిపే వారి వెన్నంటి ఉంటున్నారు. కొన్ని కాలనీల్లోని అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. చాలా కాలనీల్లో మాత్రం ఆ అక్రమార్కులకు భయపడి, రాజకీయ ఒత్తిళ్లతో అసోసియేషన్ ప్రతినిధులు కూడా అక్రమాలను నిలదీసేందుకు భయపడుతున్నారు. అందుకే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ పోస్టులకు లేనంత డిమాండ్ మణికొండలో నెలకొంది. ఇక్కడ పని చేసేందుకు ఉద్యోగులు, అధికారులు పోటీ పడుతున్నారు. మంత్రులతో రికమండేషన్ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

11 మందిని బలితీసుకున్నారు..

2016 లో నానక్ రాంగూడలో అతి తక్కువ విస్తీర్ణంలోనే బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించారు. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. 11 మంది కార్మికులు మృతి చెందారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఘటన. అది కూడా ఇదే మణికొండ మున్సిపాలిటీకి పక్కనే ఉన్నది. ఈ ప్రమాదం జరగ్గానే ఇక ఎక్కడా అక్రమాలే ఉండవని పాలకులు గ్యారంటీ ఇచ్చారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు ఉండాలని షరతులు విధించింది. కానీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కారణం ఈ అనుమతికి మించి నిర్మాణాలు చేపట్టే వారి వెనుక అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉండడమేనన్న అభిప్రాయం నెలకొంది


Next Story

Most Viewed