అడ్డుఅదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు.. అధికారులేం చేస్తున్నారు..?

by  |
అడ్డుఅదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు.. అధికారులేం చేస్తున్నారు..?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం ప్రాంతంలో ఎక్కడ చూసినా నాలుగు అంతస్తుల అక్రమ భవనాల కట్టడాలు జోరుగా జరుగుతున్నాయి. అసలు ఏజెన్సీలో మూడస్తులకే అనుమతులు లేవు.. కానీ రియల్ స్టేట్ వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకొని నాలుగు అంతస్తులు జోరుగా కట్టేస్తున్నారు. మండలంలో గుట్టమల్లారం పరిసర ప్రాంతంలో ఎక్కడ చూసినా మూడు అంతస్తులు, నాలుగు అంతస్థులు కలకలలాడుతున్నాయి. అంటే సంబంధిత అధికారులు రియల్ స్టేట్ వ్యాపారులు ఇచ్చే ముడుపులకు లొంగిపోవడం వల్ల భవన నిర్మాణాల కట్టడాలు అధికంగా జరుగుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

మండలంలో మూడు అంతస్తులు, నాలుగు అంతస్థులు భవనాలు కట్టాలన్నా అధికారుల నుండి అనుమతులు పొందాలి. కానీ రియల్ స్టేట్ వ్యాపారులు అనుమతులు పొందకుండా అధికారులకు ముడుపులు ముట్ట జెప్పి అక్రమ నిర్మాణ కట్టడాలు చేస్తున్నారు. ఇలా అక్రమ నిర్మాణం చేసిన వారిపై పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అక్రమ నిర్మాణం కింద నోటీసులు ఇవ్వాలి. కానీ రియల్ స్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇవ్వకుండా వారితో చేతులు కలిపి అక్రమకట్టడాలు చేస్తున్నారని ఏజెన్సీ గిరిజన వాసులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా జరుగుతున్నా పట్టించుకున్న అధికారులే లేరని గిరిజనులు వాపోతున్నారు.

రియల్ స్టేట్ వ్యాపారులు ముందు తూతూ మంత్రంగా నాలుగు రేకులు వేసి కట్టేసి ఆ తర్వాత అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అనుమతులు అవసరం లేదనే విధంగా భవన నిర్మాణ యజమానులు భావిస్తున్నారని గిరిజనులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మూడంస్తుల, నాలుగు అంతస్తుల భవనానికి ఓ రేటు వచ్చాక విక్రయాలు చేస్తున్నారని గిరిజనులు మాట్లాడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవనాలు నిర్మించి అమ్మేస్తున్నారని గిరిజనుల ద్వారా తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అక్రమభవన నిర్మాణాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు, పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు.



Next Story